అన్నిపార్టీల దృష్టి కరీంనగర్ సీటు మీదేనా ?
ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే మూడు ఎంఎల్సీ సీట్ల ఎన్నికలో కరీంనగర్ సీటు చాలా కీలకమైపోయింది;
ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే మూడు ఎంఎల్సీ సీట్ల ఎన్నికలో కరీంనగర్ సీటు చాలా కీలకమైపోయింది. అన్నీపార్టీల దృష్టి ఇపుడు కరీంనగర్ సీటును గెలుచుకోవటంపైనే ఉన్నది. ఫిబ్రవరి 27వ తేదీన మూడు ఎంఎల్సీ నియోజకవర్గాలకు ఎన్నిక జరగబోతోంది. ఇందులో ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఉండగా రెండు టీచర్ ఎంఎల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. అలాగే రెండు ఉపాధ్యాయ ఎంఎల్సీ నియోజకవర్గాల్లో ఒకటి కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ అయితే రెండో సీటు పరిధిలోకి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాలొస్తాయి. అంటే కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోనే ఒక గ్రాడ్యుయేట్ మరో టీచర్ ఎంఎల్సీ సీటుకు ఎన్నికలు జరగబోతున్నాయి.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లా టీచర్ ఎంఎల్సీ ఎన్నికకన్నా కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల ఎన్నికలే ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకున్నట్లు ? ఎందుకంటే మూడుపార్టీల్లోని అగ్రనేతలు, కీలకనేతలంతా కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఉన్నారు కాబట్టి. పై మూడుసీట్లలో పోటీకి బీజేపీ(BJP) ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించేసింది. ముగ్గురు అభ్యర్ధులను తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishanreddy) నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలందరికీ పరిచయం చేశారు. అభ్యర్ధులతో పాటు జిల్లాల్లో ప్రచారంచేయాల్సిన నేతలజాబితాలు, షెడ్యూల్ ను కూడా కిషన్ రెడ్డి రెడీచేస్తున్నారు.
ఇదేసమయంలో కాంగ్రెస్ ముగ్గురుఅభ్యర్ధులను అధికారికంగా ప్రకటించకపోయినా జాబితా అయితే రెడీ అయిపోయింది. రేవంత్(Revanth) ఆమోదంతో జాబితాను ఏఐసీసీ(AICC)కి పంపి ఢిల్లీలో ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో నేతలమధ్య పోటీ ఎక్కువగా ఉందికాబట్టి అభ్యర్ధుల ప్రకటనలో ఆలస్యమైంది. ఇక, బీఆర్ఎస్(BRS) విషయంచూస్తే అసలు పోటీకి ఆసక్తే లేనట్లుంది. అభ్యర్ధులు కాదు చివరకు ఆశావహులపైన కూడా పార్టీఆఫీసులో చర్చలు జరగలేదు. పోటీచేయాలా ? వద్దా ? అనే విషయంలో కూడా కేసీఆర్ నేతలతో సమీక్షించలేదు. పార్టీవర్గాల సమాచారం అయితే మూడుసీట్లలోను పోటీకి కేసీఆర్(KCR) ఇష్టపడటంలేదు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉండటంతో పాటు ఒకవేళ గెలిచినా వెంటనే ఏదో కారణంతో కాంగ్రెస్ లోకి ఫిరాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుమానిస్తున్నారని తెలిసిందే. ఫైనల్ గా నేతల మధ్య సమన్వయం చేసుకోవటం కూడా కష్టమనే భావన కేసీఆర్ లో ఎక్కువగా ఉంది.
అందుకనే పోటీచేసి ఓడిపోవటం కన్నా అసలు పోటీకే దూరంగా ఉండటం మేలన్నఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మరీ తప్పదంటే ఎవరైనా గట్టి ఇండిపెండెంట్ అభ్యర్ధులకు మద్దతు ప్రకటించటం మేలని ఆలోచిస్తున్నారు. ఇది కూడా ఇష్టంలేకపోతే పోటీలో ఉన్న కాంగ్రెస్-బీజేపీ అభ్యర్ధుల గెలుపోటములను శాసించే అవకాశాలను కూడా చూస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మూడుపార్టీల్లోని అగ్రనేతలు, కీలకనేతలు కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోనే ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish) మెదక్ జిల్లా నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే పార్టీలోని ఎంఎల్ఏల్లో 15 మంది ఈ ఎంఎల్సీ సీటులోని జిల్లాల్లోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ కీలకనేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిది కూడా ఈ జిల్లానే.
ఇక కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ది కరీంనగర్ జిల్లానే. బండికి ఎంపీలు ధర్మపురి అర్వింద్, నగేష్, రఘునందనావుతో పాటు ఏడుగురు ఎంఎల్ఏలు గట్టిగా మద్దతివ్వాల్సిందే. అలాగే పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) కూడా కరీంనగరే. ఇపుడు సిట్టింగ్ ఎంఎల్సీ టీ. జీవన్ రెడ్డిది కూడా ఇదే జిల్లా. మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధరబాబు, పొన్నంప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీతో పాటు 20 మంది ఎంఎల్ఏలు పార్టీ గెలుపుకు కష్టపడాల్సిందే. బీజేపీని ఈ సీటులో గెలిపించుకోవటం బండికి ఎంత ముఖ్యమో, కాంగ్రెస్ ను గెలిపించుకోవటం పీసీసీ అధ్యక్షుడికీ అంతే కీలకం.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ అధ్యక్షపదవి రేసులో ఉన్నారు. కాబట్టి టీచర్, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో పార్టీ అభ్యర్ధిగెలుపు ధర్మపురికి కీలకమైంది. ఇదేసమయంలో అధికారంలో ఉందికాబట్టి మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు, సీనియర్ నేతలకు పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవాల్సిందే. బీఆర్ఎస్ లో కీలక నేత, కేసీఆర్ కూతురు కమ్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేయకూడదని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే పోటీ విషయమై అధినేత కేసీఆర్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని పార్టీ ఓట్లను కవిత ఏమి చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. పార్టీలోని వాతావరణం అయితే పోటీకి దూరంగా ఉంటుందనే అనిపిస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.