పెద్ద హ్యాండిచ్చిన బడే భాయ్

అమరావతి నిర్మాణానికి కేంద్రం రు. 15 వేల కోట్ల అప్పుకు మార్గం సుగమం చేసిందంతే.

Update: 2024-07-24 04:51 GMT

తాజా కేంద్ర బడ్జెట్లో నరేంద్రమోడి ప్రభుత్వం తెలంగాణాకు పెద్ద హ్యాండే ఇచ్చింది. నరేంద్రమోడి తెలంగాణా పర్యటనకు వచ్చినపుడు ఎంతో మర్యాదిచ్చి రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటు గౌరవించిన విషయం తెలిసిందే. డెవలప్మెంటులో గుజరాత్ పద్దతిలోనే తెలంగాణా అభివృద్ధికి కూడా చర్చలు తీసుకోమని, సాయం చేయమని మోడిని రేవంత్ కోరారు. అప్పుడు తెలంగాణా అభివృద్ధికి కేంద్రం అన్నీవిధాలుగా సాయం చేస్తుందని బహిరంగసభలోనే మోడి హామీ ఇచ్చారు. జనాలందరు కూడా ఆ హామీని నమ్మారు. తీరా తాజా బడ్జెట్లో తెలంగాణా ఊసే ఎత్తలేదు. ఏ రూపంలో కూడా తెలంగాణాకు ఒక్కరూపాయి కూడా కేంద్రం కేటాయించలేదు. అసలు రేవంత్ రెడ్డి, కేటీయార్ అన్నట్లుగా తెలంగాణా పదాన్ని కేంద్రం నిషేధించినట్లుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ పై రేవంత్ మండిపడ్డారు. తెలంగాణాపై కేంద్రప్రభుత్వానిది వివక్ష కాదని కక్షసాధింపుగా వర్ణించారు. బడ్జెట్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వం తెలంగాణా అన్న పదాన్ని పలకటానికి కూడా ఇష్టపడలేదని సీఎం మండిపడ్డారు. బడ్జెట్ పై అసెంబ్లీలో నిరసన తెలిపి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. తీర్మానం విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పాల్గొని మాట్లాడాలని రేవంత్ కోరారు. తాజా బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ అని, బీహార్, ఏపీ కోసమే బడ్జెట్ పెట్టినట్లుందని రేవంత్ తన అసహనాన్ని వ్యక్తంచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బడ్జెట్లో తెలంగాణాకు పూర్తి అన్యాయం జరిగింది వాస్తవమే అనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో ఏపీకి కూడా కేంద్రం చేసిన న్యాయం ఏమీలేదు.

అమరావతి నిర్మాణానికి కేంద్రం రు. 15 వేల కోట్ల అప్పుకు మార్గం సుగమం చేసిందంతే. ఆర్ధికశాఖ మంత్రి అమరావతికి రు. 15 వేలని ప్రకటించగానే చాలామంది సంతోషం వ్యక్తంచేశారు. అయితే అసలు విషయం ఏమిటంటే కేంద్రం రు. 15 వేల కోట్లు కేటాయించలేదు. అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం 15 వేల కోట్లరూపాయల అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతించిందంతే. దీన్నే చంద్రబాబునాయుడు, లోకేష్ తదితరులు మహాభాగ్యమని చెప్పుకుంటున్నారు. ఇదిమినహా ఏపీకి కేంద్రం చెప్పింది ఏమీలేదు. పోలవరం నిర్మాణం కేంద్రానికి ప్రయారిటి అని చెప్పిన కేంద్రమంత్రి కేటాయింపులు మాత్రం చేయలేదు. ఇక తీరప్రాంత అభివృద్ధి, టూరిజం అభివృద్ధంటు చాలా మాటలు చెప్పారు. కేటాయింపులు లేని మాటలు ఎన్నిచెబితే మాత్రం ఉపయోగం ఏమిటి ?

బీహార్ కు టాప్ ప్రయారిటి ఇచ్చింది మాత్రం వాస్తవం. జాతీయ రహదారుల అభివృద్ధికి రు. 26 వేల కోట్లు, 2400 మెగావాట్ల సామర్ధ్యంతో కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, కొత్తగా ఎయిర్ పోర్టులు, క్రీడా ప్రాంగణాలు, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. తెలంగాణాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, నిర్మాణానికి నిధులు కేటాయించాలని, ఐటిఐఆర్ ఇవ్వాలని, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని, ఐఐఎం కేటాయించాలని, హనుమకొండలో కేటాయించి రద్దుచేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మళ్ళీ కేటాయించాలని, ర్వేల్వే లైన్ల ఊసులేకపోవటమే కాకుండా తెలంగాణాలోని బొగ్గుగనులన్నింటినీ సింగరేణికే నామినేషన్ పద్దతిలో తిరిగి కేటాయించాలని ప్రభుత్వం బడేభాయ్ ను చాలాసార్లు రిక్వెస్టులు చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రు. 10 వేలకోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని రేవంత్ ఎన్నిరిక్వెస్టులు చేసినా బడేభాయ్ మనసు మాత్రం కరగలేదు.

మరి అసెంబ్లీలో కేంద్రం తీరుపై నిరసన తీర్మానాలు చేస్తామని చెప్పిన రేవంగ్ ప్రకటన ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ఎందుకంటే నిరసన తీర్మానానికి మద్దతు ఇవ్వటానికి బీఆర్ఎస్ రెడీగా ఉంటుందనటంలో సందేహంలేదు. బడ్జెట్లో తెలంగాణాకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే కేటీయార్, హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కాబట్టి నిరసన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతిస్తుంది. అయితే సభలో బీజేపీ సభ్యులు ఏమిచేస్తారో చూడాలి. పార్టీపరంగా నిరసన తీర్మానాన్ని అడ్డుకుంటారా ? లేకపోతే తెలంగాణా ఎంఎల్ఏలుగా కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News