విజయవాడలో టీడీపీ వర్సెస్ జనసేన!

విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న యనమల కుదురులో ఒకరి భూమిని మరొకరు ఆక్రమించుకున్నారు. దీంతో తెలుగుదేశం, జనసేన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

Update: 2024-11-29 13:26 GMT

విజయవాడ నగరంలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఇందులో రాజకీయ పార్టీల నాయకులు వర్గాలుగా విడిపోయి కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు గౌతంరెడ్డి పై ఇదే విధమైన వివాదంలో హత్యకు కుట్రపన్నారనే కేసు నమోదైంది. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీ వర్గాల మధ్య బుధవారం రాత్రి చోటు చేసురకున్న వివాదం కత్తులు, కర్రలు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. అయినా పోలీసులు దీనివైపు కూడా చూడలేదు. మాకు ఫిర్యాదు రాలేదనే నెపంతో పోలీసులు చేతులు కట్టుకున్నారు. ఒక్కో వర్గం నుంచి 50 మంది వరకు అంటే రెండు వర్గాలకు చెందిన సుమారు వంద మంది యనమల కుదురు కరకట్ట వద్ద వీరంగం చేశారు. ఆ ప్రాంతమంతా భీతావహం సృష్టించారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఇందుకు కారణం రెండు పార్టీల వారు అధికార పార్టీల వారు కావడంతో ఇందులో తల దూరిస్తే ఎలా ఉంటుందోనని పోలీసులు తెలియనట్లు నటిస్తున్నారు.

ఆ రాత్రి ఏమి జరిగింది..

తెలుగుదేశం పార్టీ నాయకుల మద్దతుతో సుమారు 50 మంది కత్తులు, కర్రలతో యనమల కుదురు కరకట్ట వద్దకు వచ్చారు. జనసేన పార్టీ నుంచి వచ్చిన వారు అప్పటికే అక్కడ ఉన్న 80 సెంట్ల స్థలంలో చుట్టూ ఫెన్సింగ్ వేశారు. టీడీపీ వారు రాగానే ఇక్కడ ఎవడ్రా ఫెన్సింగ్ వేసింది అంటూ అవతలి వారు వేసిన ఫెన్సింగ్ ను పడగొట్టి వీరు వేరొక తీగ, స్తంభాలతో ఫెన్సింగ్ వేశారు. ఈ సందర్భంగా ప్రొక్లయిన్ లు వాడారు. ఒకరు వేసిన కంచెను మరొకరు పీకి వేసుతండటంతో ఇరు వర్గాలు వారు ఆ స్థలంలోనే తలపడ్డారు. చుట్టపక్కల వారు ఈ గలాటాను చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ స్థలం ఖరీదైంది. జగం సుమారు రూ. 50వేలకు పైమాటే పైగా 80 సెంట్ల స్థలం. కోట్ల విలువైన స్థలాన్ని పోగొట్టుకోవడానికి ఎవరైనా ఎందుకు సిద్ధంగా ఉంటారు. అసలు స్థలం వారిని కాదని ఆక్రమించుకున్న వారికి ప్రస్తుతం స్థలం పోయింది. స్థలం వానికి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ఎవరిదీ స్థలం

యనమల కుదురు కరకట్ట వద్ద ఉన్న స్థలం బుక్కవరపు చౌదరి కి చెందినది. ఈయన కానూరులో ఉంటారు. వ్యాపారాలు చేస్తుంటారు. ఈ స్థలాన్ని ఆయన భార్య కళానికేతన్ వారికి తాకట్టు పెట్టినట్లు సమాచారం. (స్థలాన్ని ఎంతకు తాకట్టు పెట్టారు. తాకట్టు సమయంలో వారికి ఏమని రాసి ఇచ్చారనేది ఇంకా బయటకు రాలేదు.) తాకట్టు పెట్టిన స్థలం సహజంగా అమ్మేందుకు వీలు ఉండదు. పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేస్తేనే కాని తాకట్టు పెట్టుకున్న వారికి హక్కులు ఉంటాయి. కళా నికేతన్ వారు ఈ స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతనేని ఆజాద్ అనే వ్యక్తికి అమ్మినట్లు చెబుతున్నారు. తాను కొనుగోలు చేసినందున స్థలం నాదేనని ఆజాద్ అంటున్నారు. తన స్థలాన్ని నేను అమ్మకుండా నీదెలా అవుతుందని చౌదరి ప్రశ్నిస్తున్నారు. దీనిపై వాదోప వాదాలు జరుగుతుండగానే తెలుగుదేశం వర్గీయుడు ఆజాత్ ఫెన్సింగ్ వేసి తనదేనని ప్రకటించారు.

ఆజాద్ కు సపోర్టుగా ఎమ్మెల్యేలు

ప్రస్తుతం స్థలానికి ఫెన్సింగ్ వేసిన ఆజాద్ కు సపోర్టుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు, పెనమలూరు బోడె ప్రసాద్ ల అనుచరులు రంగంలోకి దిగారు. బుక్కవరపు చౌదరికి మద్దతుగా జనసేన నాయకుడు అమ్మిసెట్టి వాసు అనుచరులు రంగంలోకి దిగారు. దీంతో ఇరు వర్గాల వారు మొహరించి ఘర్షణకు దిగారు. తెలుగుదేశం పార్టీ వారి ఆధిపత్యం ఎక్కువ కావడంతో జనసేన వారు కాస్త వెనక్కి తగ్గారు. దీంతో తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆజాద్ స్థలానికి ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకున్నారు. చౌదరి తన స్థలాన్ని కళానికేతన్ వారికి ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. తాకట్టులో ఉన్న భూమిని ఆజాద్ ఎందుకు కొన్నారనే విషయంలో విచారణ జరగాల్సి వుంది.

భూ కబ్జాలకు వేదికగా విజయవాడ

ఖాళీ స్థలం కనిపించిందంటే ఎవరు కబ్జా చేస్తారోననే భయం స్థలం సొంత దారుల్లో బయలు దేరింది. పోలీసులు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని, అధికార పార్టీ వారు చేస్తున్న అరాచకాలకు సపోర్టు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. యనమల కుదురు భూ దందా విషయంలో ఇంత వరకు పోలీసులు పట్టించుకోలేదంటే అక్కడ హత్యలు జరిగిన తరువాత కాని ఆ ప్రాంతానికి వెళ్లరని అర్థమైందని పట్టణ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో పడమట సెంటర్ లో రియల్ ఎస్టేట్ స్థలాలకు సంబంధించిన గొడవలో కొందరు యువకులు ఘర్షణ పడి ఒక యువకుడిని కత్తితో పొడిచి చంపారు. అప్పట్లో సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంఘటన జరిగింది.

Tags:    

Similar News