విష సంస్కృతిని టీడీపీ వాళ్లు మొదలు పెట్టారు.. రిప్లై కూడా ఉంటుంది

టీడీపీ కార్యాయంపై దాడి కేసులో విచారణ పేరుతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విష సంస్కృతిని మొదలు పెట్టింది. ఫ్యూచర్లో రిప్లై కూడా అలానే ఉంటుందని సజ్జల హెచ్చరించారు.

Update: 2024-10-17 13:26 GMT

టీడీపీ కార్యాలంపై దాడి కేసులో బుధవారం నోటీసులు అందుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం విచారణ కోసం మంగళగిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల విచారణ అనంతరం సజ్జల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరక్కూడని ఘటన జరిగింది. దానిపై కేసేదైనా ఉంటే ఒక ప్రాసెస్‌లో వెళ్లి పోవాలి. ఒక లాజికల్‌ ఎండ్‌కు తీసుకొని రావాలి. అంతేకానీ వాళ్లు చెప్పారని, వీళ్లు చెప్పారని నిందితులను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ, వాంగ్మూల పేరుతో రాసుకుంటూ, అక్కడ నుంచి దానిని సంచలనం చేస్తూ, ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించడం.. ఇదంతా మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. టీడీపీ కార్యాలయంపై దాడి తనకు సంబంధం లేదన్నారు. ఆ సమయంలో తాను అక్కడ లేనే లేను అన్నారు. ఈ ఊర్లో లేను. ఎక్కడో దూరంలో ఉన్నాను. దానికి సంబంధించిన వివరాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయి. అయినా సరే తనను 120వ నిందిడుగా పేరు చేర్చారు. దీంతో విచారణ కోసం మంగళగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చానని చెప్పారు. ఎయిర్‌ పోర్టులో కూడా ఆపారు. స్వేచ్ఛగా తిరగడానికి ఇబ్బంది పడేవిధంగా అన్ని రకాలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఒకందుకు ప్రజలు అధికారమిస్తే మరొకందుకు దానిని ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కేసు, దర్యాప్తు పేరుతో జరుగుతున్న తీరే దీనికి ఉదాహరణని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను మీరేమీ చేయలేరని, ప్రభుత్వం చేస్తున్న చేష్టలతో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఇంకా పట్టుదల పెరుగుతుందన్నారు. కానీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం చాలా ఘోరమైన తప్పు చేస్తోంది. వీళ్లు మొదలు పెట్టిన తప్పుడు సంస్కృతికి రానున్న రోజుల్లో రిప్లై కూడా అదే రీతిలో ఉంటుందని హెచ్చరించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కేసులేమైనా పెట్టారు అంటే వాటికి పూర్తి ఆధారాలు ఉన్నప్పుడే కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీళ్లు మాత్రం అలా చేయడం లేదని, కావాలనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏమీ లేకుండానే పేర్లు రాసుకుంటూ విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పెట్టుకుంటూ పోయిన పద్దతి అప్పట్లో జరగలేదన్నారు. ఇలాంటి తప్పుడు కల్చర్‌ను ఇప్పటికైనా మానుకుంటే బెటర్‌ అని సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, అది కేవలం వాళ్ల బ్రమే అవుతుందని, దీనిని గ్రహించాలని సీఎం చంద్రబాబుకు, ఆయన పక్కన ఉన్న నేతలకు విజ్ఞప్తి చేశారు.

నాడు టీడీపీ నేత పట్టాభి ప్లాన్‌ ప్రకారమే నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని బూతులు మాట్లాడారని అన్నారు. కావాలని నాటి సీఎం జగన్‌ను బూతులు తిడితే సహజంగానే వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు ఆవేశం వస్తుందన్నారు. అంత మాత్రాన టీడీపీ కార్యాలయంపై దాడి ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. ఈ కేసును లాజికల్‌ ఎండ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని, అలా చేస్తే ఎవరు వద్దంటారని అన్నారు. కానీ దాని వంక పేరుతో లేని వాళ్లను కూడా విచారణకు పిలిపించడం వంటివి సరైంది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Tags:    

Similar News