మీకు ఇల్లు కావాలా? అయితే వెంటనే మీ ఎమ్మెల్యేని కలవండి!

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని వారికి ఇది నిజంగా శుభవార్తే!

Update: 2025-11-10 11:04 GMT
Chandrababu
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఇళ్లు లేవో వాళ్లందరూ తక్షణమే వాళ్ల ఎమ్మెల్యేని కలిస్తే చాలు.. ఇక వాళ్లే చూసుకుంటారు.. లిస్టులు తయారు చేసే పని వాళ్లదే. ఇళ్లు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేలదే..
ఇది నిజమేనా అని మీకు అనుమానం అవసరం లేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. అక్టోబర్ 10 సోమవారం ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో చర్చించిన సుమారు 70 అజెండా అంశాలలో ప్రధానమైంది ఇళ్ల స్థలాల సమస్య ఒకటి.

రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర అనేక అంశాలున్నప్పటికీ ఎప్పట్నుంచో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్య ఒకటి.

పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేనివారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. త్వరతగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని చెప్పారు.
ఇళ్ల కల ఇంకా కలగానే…
“ఇల్లుంటే బతుక్కి భరోసా ఉన్నట్టే అంటుంటారు కదా”.. అయినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులకు ఇల్లు ఇంకా అందని కలగానే మిగిలింది. 2019 తర్వాత ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా, ఇళ్ల స్థలాలు ఇచ్చినా, వాస్తవానికి గృహ నిర్మాణం, స్వాధీనం, పట్టాల పంపిణీ వంటివి ఇంకా అందని దాక్ష గానే మిగిలి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 30.75 లక్షల ఇళ్ల స్థలాలను మంజూరు చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. కానీ, ఆ స్థలాల్లో అన్నీ ఇళ్లు లేవు. కొన్ని వివాదాల్లో ఉన్నాయి. మరికొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కొన్నిటికి విద్యుత్ ఉంటే మరికొన్నింటికి నీటి సౌకర్యం లేదు. మొత్తంగా ఎక్కడా ఇళ్లు లేవు అనేది సామాన్యుడి ఆవేదన.
2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ప్రభుత్వం మరో 10 లక్షల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 7 లక్షలు, పట్టణాల్లో 3 లక్షల ఇళ్లు ఉండనున్నాయని గృహ నిర్మాణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇళ్లు కోసం ఎదురు చూపులు
విజయవాడ నగర పరిధిలో మాత్రమే సుమారు 40 వేల కుటుంబాలు (అంటే దాదాపు రెండు లక్షల మంది ప్రజలు) ఇంకా ఇళ్ల పట్లాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో చాలామంది కొండప్రాంతాలు, నదీతీరాలు, అడ్డదార్లలో తాత్కాలిక గుడిసెల్లో జీవిస్తున్నారు. కొంతమంది పాత హౌజింగ్ కాలనీల్లో స్థిర పత్రాలు లేకుండా జీవిస్తున్నారు.

స్థానిక మున్సిపల్ అధికారులు ప్రకారం, ఈ కుటుంబాల్లో చాలామంది పేదల హౌసింగ్ జాబితాలో ఉన్నా, లీగల్ క్లియరెన్స్ లేదా భూసేకరణ ఆలస్యంతో పత్రాలు ఇవ్వలేకపోతున్నట్టు తెలిపారు.
ఎవరికీ, ఎలా ఇళ్లు?
ఇళ్ల పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ (SECC) ఆధారంగా డేటా సేకరిస్తోంది.
గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పేద కుటుంబాల దరఖాస్తులు స్వీకరించి, స్థానిక స్థాయిలో అర్హత ధృవీకరణ జరుగుతోంది. బిపిఎల్ కుటుంబాలు, కూలీలు, తాత్కాలిక లేదా కూలిపోయిన గృహాల్లో నివసించే వారే ప్రధానంగా అర్హులుగా పరిగణిస్తున్నారు.
ఇళ్ల కల- ఇంకా కాగితాలలోనే..
ప్రభుత్వం గృహనిర్మాణంలో “హౌసింగ్ ఫర్ ఆల్” లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ప్రకటించినా, వాస్తవంలో అనేక అడ్డంకులు కనిపిస్తున్నాయి. భూమి సేకరణ, ఫండ్ విడుదల, టెండర్ ఆలస్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వంటివి సాధారణ సమస్యలు.
కేంద్ర–రాష్ట్ర నిధుల సమన్వయం లోపంతో పీఎంఏవై కింద ఉన్న కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో భూముల లీగల్ స్టేటస్ స్పష్టత లేకపోవడం వల్ల, కొందరికి ఇళ్లు కట్టినా పట్టాలు ఇవ్వలేకపోతున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ లబ్ధిదారు సునీతమ్మ చెబుతున్న దాని ప్రకారం “మాకు పాత ఇళ్లు కూలిపోయాయి. రెండు సార్లు పత్రాలు ఇచ్చాం. అధికారులూ వచ్చి కొలిచారు. కానీ ఇంతవరకూ పత్రం రాలేదు. పిల్లలతో అద్దె ఇల్లులోనే ఉన్నాం” అనేది ఆమె ఆవేదన.
2026 నాటికి అందరికీ ఇళ్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫీల్డ్ సర్వేలు పూర్తయాయి. కొత్త హౌసింగ్ లొకేషన్లు గుర్తిస్తున్నాం అని అధికారులు చెబుతున్నా ఒక్క అడుగు ముందుకు పడని దుస్థితి.
ఇప్పుడు చంద్రబాబు ఆదేశాలతోనైనా అందరికీ ఇళ్ళు సమకూరుతాయోమో చూడాలని సీపీఐ నాయకుడు కేవీవీ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News