చంద్రబాబూ గోడమీది పిల్లివాటం వద్దు?

రాష్ట్రపతి ముర్ము లేఖపై టీడీపీ వైఖరేమిటో చెప్పాలని సీపీఎం డిమాండ్;

Update: 2025-05-16 11:36 GMT
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరేమిటో చెప్పాలని సీపీఎం డిమాండ్ చేసింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు ఉండాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఆక్షేపించేలా 15 ప్రశ్నలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము లేఖ రాశారు. భారత రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్వభావాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాల హక్కులను కాపాడేలా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రపతి ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలు సంధింపచేశారని, ఇది గర్హనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు.


రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, ఆ లేఖ వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని బహిరంగంగా స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.


 

తమిళనాడుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో గవర్నర్‌లు శాసనసభల ఆమోదించిన బిల్లులపై తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిందిగా పేర్కొంది. 3 నెలల గడువును విధించింది. ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుండా, రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును ప్రశ్నించడం గర్హనీయమని సీపీఎం అభిప్రాయపడింది.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఇటువంటి క్లిష్టసమయంలో తటస్థంగా ఉండాలని చూడడం, కేంద్రప్రభుత్వాన్ని శరణు కోరేలా ఉండడం అనాగరికమని, రాష్ట్రపతి లేఖపై తన అధికారిక స్థాయిలో వైఖరిని ప్రకటించాలని కోరింది.
ఫెడరలిజం, రాజ్యాంగ బద్ధతపై మద్దతు
సుప్రీంకోర్టు తీర్పును ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ముద్రిస్తూ, రాష్ట్రాల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని సీపీఎం పిలుపునిచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా పేర్కొంటూ, ఆ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పును ఆదర్శంగా ప్రశంసించింది.
స్వయం పరిపాలన, ఆత్మగౌరవం వంటి నినాదాలపై నిర్మితమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎలా సమర్థిస్తుందో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి లేఖ విషయమై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ప్రత్యుత్తరం ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Tags:    

Similar News