టీడీపీ నేతలు వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు

నామినేటెడ్‌ పోస్టుల భర్తీ జాప్యానికి నేతలే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు.;

By :  Admin
Update: 2025-03-14 09:47 GMT

తాను ఎప్పుడో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేయాలని భావించా. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నామినేటెడ్‌ పోస్టులన్నీ భర్తీ చేయాలనుకున్నా. కానీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు దీని మీద స్పందించడం లేదని, అందువల్లే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేయడం లేక పోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చంద్రబాబు టీడీపీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుల మీద చంద్రబాబు నాయుడు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్ట పడి పని చేసిన నాయకుల పేర్లతో కూడిన జాబితాను పంపించాలని చాలా రోజుల క్రితేమ నాయకులకు చెప్పానని కానీ ఇంత వరకు ప్రజా ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదని, జాబితాలను పంప లేదని అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి నామినేటెడ్‌ పోస్టుల ఇస్తామన్నారు. అలాంటి వారి వివరాలను పంపాలని కోరినా ఇంత వరకు పంపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

అన్ని నామినేటెడ్‌ పోస్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్లు, పాలక మండలి సభ్యులను కూడా నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే నామినేటెడ్‌ పదవుల కోసం ఇప్పటి వరకు 60వేల దరఖాస్తులు వచ్చయని, ఈ దరఖాస్తులన్నింటిని నిశితంగా పరిశీలస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ సందర్భంగా మరో బాంబును చంద్రబాబు పేల్చారు. సిఫార్సు చేసిన వారందరికీ నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వలేమని తెలిపారు. దరఖాస్తులు పంపిన మొదటి సారే పదవి రాలేదని బాధపడొద్దని, రెండేళ్ల పదవీ కాలం ముగిశాక తక్కిన వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పదవులు వచ్చిన తర్వాత ప్రజలకు సేవలు చేయడంతో పాటు పార్టీకి పేరు వచ్చేలా పని చేయాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నామో.. అంతకంటే హుందాగా పదవలు వచ్చిన తర్వాత ఉండాలని సూచించారు. వైసీపీ నేతలకు ఏ పని చేయకూడదని ఇది వరకు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు వైసీపీకి దూరంగా ఉండాలని, ఏ స్థాయిలో కూడా వైసీపీనేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. తాను పార్టీ పరంగా చెబుతోంటే వైసీపీకి ఓట్లేసిన వారికి పథకాలు ఇవ్వొద్దు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలని, కూటమిలోని మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకొని మందుకెళ్లాలని సూచించారు.
Tags:    

Similar News