గుడివాడలో అడుగుపెట్టిన కొడాలి నాని

మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై పోరాటం చేస్తానని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు కొడాలి నాని చెప్పారు.

Update: 2025-12-10 09:33 GMT

2024 ఎన్నికల అనంతరం సుదీర్ఘ రాజకీయ విరామం తర్వాత వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా ప్రత్యక్షమయ్యారు. అనారోగ్య కారణాల వల్ల దాదాపు 18 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన బుధవారం నాడు పీపీపీ పద్ధతిలోనే వైద్య కాళాశాలలను నిర్వించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన 'కోటి సంతకాల సేకరణ' ప్రజా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కోటి సంతకాలు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా, గుడివాడలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించారు. ఆయన స్వయంగా వినతి పత్రంపై సంతకం చేసి, ఈ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతును తెలిపారు. అనంతరం, సంతకాలతో కూడిన వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో కొత్తగా మెడికల్ కాలేజీలను మంజూరు చేసి నిర్మిస్తే, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు పన్నుతోందని" ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించే నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు.
భవిష్యత్ కార్యాచరణ
తన రాజకీయ పునరాగమనంపై క్లారిటీ ఇస్తూ, వచ్చే ఆరు నెలల పాటు తాను గుడివాడ నియోజకవర్గం కేంద్రంగానే పూర్తిగా అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటానని, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తానని కొడాలి నాని వెల్లడించారు. ఆయన ప్రత్యక్ష ఎంట్రీతో గుడివాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
Tags:    

Similar News