పార్టీలో చేరుతాం.. సీటిత్తారా... సిక్కోలులో విచిత్ర పరిస్థితి...

సీటు కోసం పార్టీ మారుతారా... సిక్కోలు జిల్లాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్...ఇంతకీ పార్టీ మారుతానన్నది ఎవరు..? ఆ పార్టీలేంటి...?

Update: 2024-04-05 06:26 GMT

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: 2024 ఎన్నికలు విచిత్రంగా సాగుతున్నాయి.. కూటమి జట్టు పార్టీల్లో నేతలు సీటు కోసం పార్టీలు మారేందుకు సిద్ధపడుతున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. సీటు కోసం పార్టీ మారుతున్న నేతలు ఎక్కువ అవుతున్నారు. అత్యధికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బిజెపి, జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నా... సిక్కోలు జిల్లాలో మాత్రం సీటిస్తే పార్టీలో చేరుతామంటున్నారు ఆశావహులు. మరి ఇన్ని రోజులు సొంత పార్టీలో కష్టపడి పనిచేసి..పార్టీ జెండాలు మోయడం ఎందుకు దండగ అంటున్నారు టిడిపి, జనసేన ద్వితీయ శ్రేణి నేతలు. ఎన్నికల టైమ్‌లో పార్టీ మారితే సరిపోతుంది.. ఒక పార్టీ లో టికెట్ రాకపోతే మరో పార్టీలో చేరితే టికెట్ కన్ఫర్మ్ అట.. దీంతో ఆశావహులు క్యూ కడుతున్నారు.


పాలకొండలో ఏం జరుగుతోంది...

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకు రంగులు మారుతున్నాయి. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం అయిన పాలకొండలో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే ఈ టిక్కెట్‌ను టీడీపీ-జనసేన-బిజెపిల కూటమిలో జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ టిక్కెట్ కోసం జనసేనలో చేరారు. ఆ నియోజకవర్గంలో స్వపక్షంలో విపక్షం అన్నట్టు సొంత పార్టీలో అసమ్మతి పోరు నెలకొంది. జయకృష్ణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలోని కొందరు పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ జయకృష్ణకు పోటీగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అక్కడ టిడిపికి సీటు కేటాయించకపోవడంతో పడాల భూదేవి కూడా జనసేన వైపు చూస్తున్నారు.

టిడిపి నుంచి జనసేనకు జాతర...

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా పాలకొండ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. అయితే జనసేనకు ఇక్కడ సరైన అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ తరుపున ఇక్కడ నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన నిమ్మక. జయకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మరో వైపు పడాల భూదేవి కూడా తన వర్గం నేతలతో పవన్‌ను కలిసి తాను పార్టీలో చేరుతానని, తనకు జనసేన తరుపున టికెట్ కేటాయించాలని అర్జీ పెట్టుకున్నారు. జనసేనలో తొలి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న కోరంగి నాగేశ్వరరావు, నిమ్మల లెబ్రం లు కూడా ఈ టికెట్ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గ నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వసరాయి.కళావతిని రంగంలో దించగా... జనసేన నుంచి అభ్యర్థి ప్రకటన జరగాల్సి ఉంది.

ఎస్సీ నియోజకవర్గం ఎస్టీగా మార్పు....

పాలకొండ నియోజకవర్గం గతంలో ఎస్సీ నియోజకవర్గంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దీన్ని ఎస్టి నియోజకవర్గంగా మార్చారు. జిల్లాల పునర్విభజనలో కొత్తగా మన్యం జిల్లా ఏర్పాటు చేయడంతో పాలకొండ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు కలిశాయి. గిరిజన ఓట్లు అత్యధికంగా ఉండడంతో దీన్ని ఎస్టీ నియోజకవర్గంగా మార్పు చేశారు. నియోజకవర్గంలో 1,84, 414 ఓట్లు ఉండగా... గిరిజన తెగలకు చెందిన సవర, జాతపు, కాపు సవర, కొండ దొర ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. సవర సామాజిక వర్గానికి 55 వేల ఓట్లు ఉండగా... జాతపు సామాజిక వర్గానికి 25 వేల ఓట్లు ఉన్నాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో మూడుసార్లు జాతపు సామాజిక వర్గ నేతలు గెలుపొందారు. అందుకే ఈసారి ఏ పార్టీ అయినా సవర జాతీయులకే టిక్కెట్టు కేటాయించాలని నియోజకవర్గ నేతలు పట్టు పడుతున్నారు.1951లో ఏర్పడిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది.


1952లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పాలవాస సంఘంనాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1955లో పైడి నరసింహప్పారావు, 1962లో కేంబూరి సూర్యనారాయణ నాయుడు. 1967లో జే జోజిలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికయ్యారు. 1972లో కొత్తపల్లి నరసయ్య కాంగ్రెస్ నుంచి ఎన్నిక కాగా... 1978లో కంబాల రాజారత్నం జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యారు. 1983 లో గోనిపాటిశ్యామలరావు, 1985లో తాలే భద్రయ్య తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 1989లో పీజే అమృతకుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిగా...1999 లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1994లో తాలే భద్రయ్య, 2004లో కంబాల జోగులు తెలుగుదేశం నుంచి గెలుపొందారు. 2009లో నిమ్మక సుగ్రీవులు కాంగ్రెస్ నుంచి గెలుపొందిగా... 2014, 2019 లలో విశ్వసరాయి కళావతి వైసీపీ నుంచి ఎన్నికయ్యారు.

గుర్రు మీదున్న జనసైనికులు...

పాలకొండ నియోజకవర్గంలో జనసైనికులు గుర్రు మీదున్నారు. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని ఉన్న జనసేన నాయకులను పక్కన పెట్టి టిడిపి వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుండడంతో జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి నాయకులకు పార్టీ కండువా కప్పి మరీ టికెట్ ఇస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు



Tags:    

Similar News