ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్లో టీడీపీకి మెజారిటీ ఉన్నట్లా? లేనట్లా..?

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నట్లా? లేనట్లా? అనే చర్చ మొదలైంది. శుక్రవారం జరిగిన సమావేశం ఇందుకు వేదికైంది.

Update: 2024-09-14 02:40 GMT

ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ లో 50 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుపొందగా ఒకటి జనసేన పార్టీ గెలుపొందింది. మిగిలిన 44 స్థానాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు గెలుపొందారు. దీంతో వైఎస్సార్సీపీ మేయర్ స్థానంతో పాటు ఒంగోలు మునిసిపల్ స్థానాన్ని స్వాధీనం చేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏపీలో పరిపాలన సాగించి మూడు నెలలు దాటింది. ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీ సభ్యులుగా ఉన్న వారు టీడీపీ సభ్యులుగా మారేందుకు నిర్ణయించుకున్నారు. వైఎస్సార్సీపీని వీడేందుకు నిర్ణయించుకోవడంతో టీడీపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నట్లు టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ప్రకటించారు. మునిసిపల్ మేయర్ గా ఉన్న గంగాడ సుజాత కూడా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వైఎస్సార్ సీపీ ఒంగోలు మునిసిపాలిటీలో ప్రభావం కోల్పోయింది.

ఎందుకు ఇలా జరిగింది?

వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన గంగాడ సుజాత ఒక ఎన్జీవో నడుపుతున్న వ్యక్తి భార్య. ఆమె ఒకప్పుడు టీచర్, ఆ వ్రుత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. గంగాడ సుజాత రాజకీయాల్లోకి రావడానికి కారణం ఆమె భర్త అరుళ్ రాజ్. ఆయన దయానంద నిలయం సొసైటీ ఒంగోలులో స్థాపించి దివ్యాంగుల కోసం సేవలు చేసేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 17 సంవత్సరాల క్రితం ఆయన నడిపిన దయానంద నిలయం సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని, తాము ఇచ్చిన డబ్బులకు కనీసం లెక్కలు చెప్పడం కూడా చేయలేదని ఇంగ్లండ్ కు చెందిన ‘ఎనేబుల్’ అనే సంస్థ నుంచి కార్యదర్శి కొలిన్ హార్టే అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన విచారణ నిర్వహించి అరుళ్ రాజ్ పై చర్యలు తీసుకున్నారు. అప్పట్లో సంపాదించిన వేల కోట్లు దగ్గర పెట్టుకుని అరుళ్ రాజ్ భార్య గంగాడ సుజాత రాజకీయాల్లోకి వచ్చారనే ప్రచారం జరిగింది. వైఎస్సార్ సీపీ బాగా పీక్ లో ఉండటంతో ఆమె గెలిచారు. తిరుగులేని మెజారిటీ రావడంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండదండలు, డబ్బు ప్రభావంతో గంగాడ సుజాత ఒంగోలు మునిసిపల్ మేయర్ అవగలిగారు. ఇప్పుడు పవర్ లేని పార్టీలో ఉండటం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని భావించిన సుజాత మిగిలిన కార్పొరేటర్లతో మాట్లాడి జంప్ అయ్యారు. కేవలం పవర్, పలుకుబడి, డబ్బు కోసమే పార్టీ మారారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

పవర్ లో ఉండాలని కోరుకున్నారు...

రాజకీయాల్లో ఉన్న వారు ఎలాగైనా పవర్ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నారు. నేటి రాజకీయాలు అలా ఉంటున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి వరకు వైఎస్ఆర్ సీపీ మేయర్ గా ఉన్న గంగాడ సుజాత ఒక్కసారిగా మారిపోయారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఇటీవల ప్రకటించి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆమెతో పాటు పార్టీ మారిన 17 మంది, గతంలో పార్టీ మారిన ఐదు మంది కలిపి 22 మంది సభ్యులను కలిపి పార్టీ నుంచి తొలగించామని, వారిని కార్పొరేటర్ సభ్యత్వం తొలగించాలని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. కలెక్టర్ పట్టీ పట్టనట్లు వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వారికి మెజారిటీ లేదని, గెలిచిన వారంతా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారనే విధంగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విషయంలో పక్కా ప్రణాళిక ద్వారా పావులు కదిపారు.

బాలినేని వద్ద 20 మంది కార్పొరేటర్లు

ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం సభ్యుల్లో సుమారు 22 మంది వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరడంతో టీడీపీ బలం పెరిగింది. అయితే వారిని ఎలాగైనా తిరిగి దక్కించుకునేందుకు పన్నిన పన్నాగంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. వైఎస్సార్ సీపీని వీడిన కార్పొరేటర్లను బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ పిలిపించారు. నేను మిమ్మల్ని గెలిపించాను. నేను చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. పార్టీ మారాలనుకుంటే అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాము. అప్పుడు పార్టీ మారదామని బాలినేని చెప్పడంతో పార్టీ మారిన కార్పొరేటర్ల నోట మాట రాలేదు. వారంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. అయినా జరగాల్సిన పనులన్నీ జరగాలంటే మునిసిపల్ కార్పొరేషన్ లో మూడో వంతు సభ్యులు దేనినైనా ఆమోదించాల్సి ఉంటుంది. ఆ మెజారిటీ ప్రస్తుతం ఉండటంతో సమావేశం సాఫీగా సాగింది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారి జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ సమావేశం ఇది. 

ఎక్స్ అఫీషియో సభ్యలుగా ప్రమాణం

తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేలుగా గెలిచిన దామచర్ల జానర్థన్, ఎంపీగా గెలుపొందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ లు కొత్త ప్రభుత్వంలో మొదటి సారిగా జరిగిన ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఒంగోలు ఎంపి, ఎమ్మెల్యేతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ లు శుక్రవారం ఒంగోలు మునిసిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి మాట్లాడే అవకాశం ఉంటుంది తప్ప ఓటు వేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. సమావేశం జరగటానికి వన్ థర్డ్ మెజారిటీ ఉంటే సరిపోతుంది. ఒంగోలు మునిసిపాలిటీ పరిధిలో సంతనూతలపాడు నియోకవర్గం కలిసి ఉండటంతో ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ కూడా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉంటానని మునిసిపల్ కమిషనర్ కు లేఖ ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 

బడ్జెట్ ఆమోదం పొందాలంటే...

మునిసిపల్ కార్పొరేషన్ లో బడ్జెట్ ఆమోదం పొందాలంటే మూడింటి రెండు వంతులు కార్పొరేటర్ల మెజారిటీ కావాల్సి ఉంటుంది. అలా మెజారిటీ ఉంటేనే బడ్జెట్ సమావేశాలు సక్సెస్ అవుతాయి. అలా కారకుండా బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం లేదు. సాధారణంగా సగం మంది కార్పొరేటర్లు ఉండాలి. అలా కానప్పుడు ముగ్గురిలో ఇద్దరు సభ్యులు ఆమోదించాలి. అప్పుడే సమావేశంలో అనుకున్న తీర్మానం నెగ్గుతుంది. శుక్రవారం జరిగిన సమావేశం కేవలం కోరం వరకే పరిమితమైంది. సమావేశంలో పెద్దగా చర్చలు లేవు. తీర్మానాల ఆమోదం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ప్రమాణ స్వీకారంతో సమావేశం ముగిసింది.

కలిసి వెళదామని బాలినేని చెప్పారా?

హైదరాబాద్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ సభ్యులతో సమావేశం నిర్వహిస్తుండగా వైఎస్సాఆర్ సీపీ తరపున మాజీ మంత్రి విడదల రజిని, పులివెందుల సతీష్ రెడ్డిలు కలిసి బాలినేని నివాసానికి వెళ్లారు. మీరు పార్టీ మారవద్దని, మేము జగన్ తరపున హమీ ఇస్తున్నామని చెప్పారు. మేము పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే మీ న్యూసెన్స్ ఏమిటంటూ వారిపై బాలినేని మండిపడినట్లు సమాచారం. పార్టీ మారుతున్నారనే సమాచారంతో బాలినేనిని వారించేందుకు వీరు అక్కడికి వెళ్లారు. అయితే వారికి చుక్కెదురైంది. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారే విషయంలో అందరం కలిసే వెళదామని, తొందర పడొద్దని కార్పొరేటర్లకు చెప్పినట్లు సమాచారం. పైకి ఒకటి చెబుతూ తన బలాన్ని తగ్గకుండా కాపాడుకునే పనిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. 

Tags:    

Similar News