అధిష్టానం సీరియస్..సురేఖ వికెట్ డౌన్ ?

ఇపుడు విషయం ఏమిటంటే మంత్రిగా కొండా సురేఖ రాజీనామా చేయకతప్పదని పార్టీలో ఒక్కసారిగా చర్చ పెరిగిపోతోంది.

Update: 2024-10-05 02:03 GMT

నోరుజారితే వెనక్కు తీసుకోలేమన్న పెద్దల మాట మరోసారి నిజమే అని నిరూపణవుతోందా ? దీనికి తాజా సాక్ష్యం మంత్రి కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల తర్వాత పరిణామాలే. ఇపుడు విషయం ఏమిటంటే మంత్రిగా కొండా సురేఖ రాజీనామా చేయకతప్పదని పార్టీలో ఒక్కసారిగా చర్చ పెరిగిపోతోంది. మొన్నటివరకు సురేఖ వివాదం రాష్ట్రానికి మాత్రమే పరిమితమవ్వగా ఇపుడు ఈ వివాదం దేశరాజధానికి కూడా చేరినట్లు పార్టీవర్గాల సమాచారం. హర్యానాలో జరగబోయే ఎన్నికల్లో అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి చేసిన ఆరోపణలను బీజేపీ ప్రముఖంగా ప్రచారంలో ప్రస్తావించాలని డిసైడ్ అయ్యింది. సురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్లో ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏపాటి గౌరవం ఇస్తుందో మంత్రి వ్యాఖ్యలు, ఆరోపణలతో తేలిపోయిందని వైష్ణవ్ చెప్పారు. ఒకపుడు లైగింక ఆరోపణపై వేధింపులకు గురైన సాక్షీమాలిక్, వినేష్ ఫోగట్ లాంటి మహిళా రెజలర్లకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి మద్దతుగా నిలిచారు.

మహిళా రెజలర్లకు కాంగ్రెస్ మద్దతుగా నిలవటంపై దేశమంతా హర్షించింది. అలాంటిది ఇపుడు సురేఖ మరో లేడీ సెలబ్రిటీ సమంతపై అసభ్యంగా మాట్లాడటం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. సమంత-నాగచైతన్య విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అంతటి ఆగకుండా అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని నాగార్జునను కేటీఆర్ అడిగారని మంత్రి ఆరోపించారు. ఇదే విషయమై సమంతను నాగార్జున, చైతన్య ఒత్తిడి చేయటంతో సమంత ఎదురుతిరిగారట. దాంతో వాళ్ళమధ్య గొడవలవ్వటంతో సమంతను ఇంట్లోనుండి గెంటేశారని తర్వాత సమంత-చైతన్య విడాకులు తీసుకున్నారని సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కొండా సురేఖ చేసిన వ్యఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించిన తీరుతోనే ఆరోపణలు ఏ స్ధాయిలో సంచలనమయ్యాయో అర్ధమైపోతోంది.

అన్నీ వైపుల నుండి ఎదురైన ఒత్తిడి కారణంగా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ట్విట్టర్లో చెప్పినట్లే చెప్పి తన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నట్లు మళ్ళీ పదేపదే అవే ఆరోపణలను ప్రస్తావిస్తున్నారు. దాంతో నాగార్జున ఫ్యామిలీకి మద్దతుగా బాలీవుడ్ లోని ప్రముఖులు కొందరు రంగంలోకి దిగినట్లు సమాచారం. బాలీవుడ్ లో కొందరు సురేఖ వ్యాఖ్యలను ప్రియాంకగాంధీకు చెప్పి వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రమంత్రి వైష్ణవ్ కూడా సురేఖ వ్యాఖ్యలు, ఆరోపణలను ట్విట్టర్లో ప్రస్తావించటం, మంత్రిపై యాక్షన్ తీసుకోకుండా రాహుల్ మౌనంగా ఉన్నారంటే మద్దతు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా హర్యానా ఎన్నికల ప్రచారంలో సురేఖ ఆరోపణలను ప్రముఖంగా ప్రస్తావించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం.

బీజేపీ గనుక ఎన్నికల ప్రచారంలో సమంతపై సురేఖ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తే పరిస్ధితులు ఎలాగ మారుతాయో ఎవరు చెప్పలేరు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలున్నాయని అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో గెలుపు అవకాశాలను తమంతట తాముగానే చెడగొట్టుకోవటం ఎందుకని ప్రియాంక గాంధి తదితరులు ఆలోచిస్తున్నారట. ఇదే విషయాన్ని ప్రియాంక సోదరుడు రాహుల్ తో చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. సురేఖ టార్గెట్ కేటీఆరే అయినా రోడ్డునపడింది మాత్రం అక్కినేని ఫ్యామిలి, సమంతలే. సురేఖ ఆరోపణలు, దాని పర్యవసానాలను రాహుల్ ఇప్పటికే రేవంత్ తో చర్చించారట. మంత్రితో వెంటనే రాజీనామా చేయించాలని ఆదేశించినట్లు పార్టీవర్గాల సమాచారం.

ఇదే విషయాన్ని రేవంత్ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో ప్రస్తావించి రాహుల్, ప్రియాంక ఆదేశాలను వివరించి చెప్పి సురేఖతో రాజీనామా చేయించే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. సురేఖ రాజీనామాకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల్లో కొందరు బాగా పట్టుబట్టినట్లు సమాచారం. దాంతో హర్యానా ఎన్నికలు, జనాల్లో మంత్రి వ్యాఖ్యలు, ఆరోపణలపై నెగిటివ్ గా చర్చ జరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకుని వివాదానికి ఫులుస్టాప్ పెట్టాలంటే సురేఖ రాజీనామా చేయటం ఒకటే మార్గమని అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. మరి మంత్రి రాజీనామా ఎప్పుడుంటుంటో చూడాలి. నోరుజారితే ఎంతటి పరిస్ధితులు తలెత్తుతాయనే విషయం మిగిలిన అందరికీ ఒక గుణపాఠమని పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News