చంద్రబాబుకు సుప్రీంకోర్టు భారీ ఊరట
చంద్రబాబుపై నమోదైన 7 సీఐడీ కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలన్న పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.;
By : The Federal
Update: 2025-01-28 16:23 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై దాఖలైన కేసుల్ని సీబీఐకి (CBI)కి దాఖలు చేయాలన్న పిటీషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుపై ఏపీ సీఐడీ గతంలో 7 కేసుల్ని నమోదు చేసింది. వాటన్నింటినీ సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య పిటీషన్ ను దాఖలు చేశారు. ఆ పిటీషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమైనపుడు ఆ న్యాయవాదికి జస్టిస్ బేలా త్రివేదికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇటువంటి పిటీషన్లను కూడా మీరు వాదిస్తారా? అని ధర్మాసనం అడిగింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో న్యాయవాది మణీందర్ సింగ్ ఏదో చెప్పబోగా ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఈ పిటీషన్ ను హైకోర్టు న్యాయవాది బాలయ్య దురుద్దేశంతో దాఖలు చేశారన్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని టీడీపీ వర్గాలు స్వాగతించాయి. చివరకు న్యాయమే గెలుస్తుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.