మిధున్ రెడ్డికి సుప్రీం షాక్

ఏపీ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కు నో చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం;

Update: 2025-07-18 12:29 GMT

లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈకేసులో ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.మద్యం కేసులో ముందస్తు బెయిలు కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మిధున్ రెడ్డి తరుపున సీనియర్ అడ్వకేట్ అభిషేఖ్ మను సింగ్వీ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు.ముందస్తు బెయిల్‌ పొందడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని జస్టిస్ జెబి పార్థివలా, జస్టిస్ మహదేవన్ తో కూడిన ధర్మాసనం అడిగింది.ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ముందస్తు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించింది.తమ క్లయింట్ కు లొంగిపోవడానికి వారం రోజుల సమయం ఇవ్వాలని అభిషేఖ్ మను సింగ్వీ చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం త్రోసిపుచ్చింది.

అరెస్టుకు రంగం సిద్ధం!
మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డిపై సిట్‌ అధికారులు ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ నోటీసులు జారీ అయ్యాయి. విదేశాలకు పారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఇక అరెస్టు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే మిధున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ప్రస్తుతం ఆయన ఎక్కడ దాక్కున్నారో తెలుసుకునేందుకు సిట్‌ బృందాలను ఏర్పాటు చేసింది.ఈ నేపథ్యంలో వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్ట్ చేసేందుకు చట్ట ప్రకారం సిట్ అధికారులు ముందుకు వెళ్తున్నారు.మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మిథున్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం ఇది రెండోసారి.మిథున్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ చర్చ జోరందుకుంది.
Tags:    

Similar News