రెండువర్గాలు కలిసి పోలీసులను కొట్టాయా ?

పాడి మద్దతుదారులు బాగానే ఉన్నారు, గాంధీ అనుచరులూ బాగానే ఉన్నారు. మధ్యలో ఏ సంబంధంలేని పోలీసులు గాయాలపాలయ్యారు.

Update: 2024-09-12 10:01 GMT

ఎనుబోతుల మధ్య లేగదూడలు నలిగిపోయాయనే సామెతలో చెప్పినట్లుగా తయారైంది పోలీసుల వ్యవహారం. అసలు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి-బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ వివాదం తారాస్ధాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. నేను మీ ఇంటికి వస్తానంటే...రాకపోతే నేనే మీ ఇంటికి వస్తానని బుధవారం ఇద్దరు ఒకరిని మరొకరు చాలెంజ్ చేసుకున్నారు. అయితే ఉదయం ఇంట్లోనుండి బయలుదేరిన పాడిని పోలీసులు హౌస్ అరెస్టుచేశారు. గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ కండువా కప్పి టిఫెన్ తినొస్తానని పాడి ఎంతచెప్పినా పోలీసులు ఇంట్లోనుండి బయటకు అడుగుపెట్టనీయలేదు.

ఇదే సమయంలో ఉదయం 11 గంటలవరకు చూసిన గాంధీ తన మద్దతుదారులతో పాడి ఇంటికి చేరుకున్నారు. దాంతో ఇద్దరి మద్దతుదారుల మధ్య పెద్ద గొడవే అయ్యింది. కోడిగుడ్లు, రాళ్ళు, కర్రలు, కుర్చీలు ఏది దొరికితే దాంతో కొట్టేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే రెండువర్గాలను ఆపటానికి ప్రయత్నించిన పోలీసులకు దెబ్బలు తగిలాయి. పాడి మద్దతుదారులు బాగానే ఉన్నారు, గాంధీ అనుచరులూ బాగానే ఉన్నారు. మధ్యలో ఏ సంబంధంలేని పోలీసులు గాయాలపాలయ్యారు. పాడి మద్దతుదారుల ఆరోపణలు ఏమిటంటే గాంధీ మద్దతుదారులు పోలీసులను బాగా కొట్టారట.

పాడి ఇంటిమీదకు వెళ్ళకుండా తమను ఆపుతున్నారనే మంటతో గాంధీ అనుచరులు అడ్డొచ్చిన పోలసులతో గొడవపడ్డారు. ఇద్దరు ముగ్గురిని చితక్కొట్టినట్లు కొన్ని వీడియోల్లో కనబడుతున్నాయి. నలుగురు కలిసి ఒక పోలీసు కానిస్టేబుల్ ను తోసేసి కొడుతున్న దృశ్యాలు ఒక వీడియోలో స్పష్టంగా కనబడింది. ఈ సంఘటనకు పాడి మద్దతుదారులు తెలంగాణా, నాన్ తెలంగాణా రంగు కూడా పులిమేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు తెలంగాణా-ఆంధ్రాకు ఏమిటి సంబంధం ? గాంధీతో పాటు ఫిరాయింపు ఎంఎల్ఏలను పాడి ఎందుకు రెచ్చగొట్టాలి ? పాడికి ఎవరు చెప్పారు రెచ్చగొట్టమని ? అసలీ రచ్చకు మూలకారణం బీఆర్ఎస్ పిరాయింపు ఎంఎల్ఏలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడమే.

ఫిరాయింపు ఎంఎల్ఏ గాంధీ ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ జెండాను ఎగరేస్తానని అక్కడినుండి ఎంఎల్ఏని తీసుకుని కేసీఆర్ ఇంటికి వెళతానని చెప్పాల్సిన అవసరం పాడికి ఏమొచ్చింది ? ఫిరాయింపులకు వ్యతిరేకంగా పాడి, కేపీ వివేకానంద గౌడ్ కోర్టులో కేసు వేశారు. ఫిరాయింపులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోమని కోర్టు అసెంబ్లీ సెక్రటరీకి నాలుగు వారాల గడువిచ్చింది. ఇపుడా విషయం న్యాయస్ధానం-అసెంబ్లీ కార్యదర్శి మధ్యుంది. ఇంతలో కౌశిక జోక్యం చేసుకుని రాజీనామాలు చేయమని డిమాండ్ చేయటం ఏమిటో ? రాజీనామాలు చేయకపోతే చీరలు కట్టుకుని, గాజులు వేసుకుని జనాల్లో తిరగాలని రెచ్చగొట్టడం ఏమిటో అర్ధంకావటంలేదు.

ఒక ప్లాన్ ప్రకారం కౌశిక్ రెడ్డిని ముందుపెట్టి బీఆర్ఎస్ పెద్దలు నానా గొడవచేస్తున్న విషయం అర్ధమైపోతోంది. అందుకనే ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా అదే పద్దతిలో కౌంటర్లు ఇస్తున్నారు. దాంతో రెండువైపులా గొడవలు పెరిగిపోతున్నాయి. రెండువర్గాలు బాగానే ఉన్నాయి కాని మధ్యలో పోలీసులే నలిగిపోతున్నారు. కౌశిక్ ఇంటిమీదకు పోనీకుండా ఆపుతున్నందుకు గాంధీ అనుచరులు ఒకవైపు, తమ ఎంఎల్ఏ ఇంటిముందువరకు రానిచ్చినందుకు కౌశిక్ మద్దతుదారులు మరోవైపు చేరి పోలీసులను వాయించేశారు.

Tags:    

Similar News