ఏసీఏ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా సుజయ్‌ కృష్ణ రంగారావు

ప్రస్తుతం ఎమ్మెల్యేగాను, ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్నారు.;

Update: 2025-04-07 11:58 GMT

ఈరోజు జరిగిన ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ది కార్పొరేషన్‌ చైర్మన్, రావు వెంకట సుజయ్‌ కృష్ణ రంగారావు గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గా ఎన్నికయ్యారు. త్వరలో జరగనున్న ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌– 2025. నిర్వహణ బాధ్యతలను చైర్మన్‌ హోదాలో సుజయ్‌ కృష్ణ రంగారావు చేపట్టనున్నారు. 2025 ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ చైర్మన్‌ గా ఎన్నికైన సుజయ్‌ కృష్ణ రంగారావుకు క్రికెట్‌ సంఘాలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

తొలుత ఈయన కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత వైఎస్‌ఆర్‌ చనిపోవడం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంతంగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేయడంతో సుజయ్‌ కృష్ణ రంగారావు 2012లో జగన్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి మూడో సారి గెలుపొందారు. అయితే నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు. నాడు దాదాపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారిలో ఈయన కూడా ఉన్నారు. 2016లో సుజయ్‌ కృష్ణ రంగారావు టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సుజయ్‌ కృష్ణ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతిలో ఓడిపోయారు. 2024లో తిరిగి బొబ్బిలి నుంచి గెలుపొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రభుత్వం నియమించింది.
Tags:    

Similar News