టీటీడీలో ఇంజినీర్ల పోరుబాట..!
రాష్ట్ర విజిలెన్స్ విభాగం టీటీడీలో అగ్గి రాజేసింది. ఇంజినీర్లు మరో రెండు రోజుల్లో తీసుకునే నిర్ణయంతో పోరుబాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మిక సంస్థలో ఇదే చర్చ జరుగుతోంది.
By : SSV Bhaskar Rao
Update: 2024-08-12 14:22 GMT
విజిలెన్స్ విభాగం జారీ చేసిన షోకాజ్ నోటీసులు టీటీడీలో అగ్గి రాజేసింది. " పాలకమండలి, అధికారులను వదిలేసి, మాపై గురి పెట్టడం ఏంటి" అని ఇంజినీర్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంజినీరింగ్ శాఖ పెద్దల ఓదార్పు, టీటీడీ ఈఓ దాటవేత సమాధానం ఆ విభాగం అధికారుల్లో మరింత అసంతృప్తి రాజేసింది. ఈ వ్యవహారం టీటీడీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. విజిలెన్స్ విచారణ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా, అధికార టీడీపీపై ప్రభావం చూపించే వాతావరణం లేకపోలేదు.
రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ విభాగం తీసుకోబోయే నిర్ణయాలపై టీటీడీ ఉద్యోగుల్లో మరింత ఆగ్రహం పెల్లుబికే ప్రమాదం లేకపోలేదు. "సర్వీస్ రూల్స్ ప్రకారం మా విధులు మేము నిర్వహిస్తే, మా పైనే చర్యలు తీసుకోవడానికి సంసిద్ధం కావడం ఏంటి" అని ఏఈలు ప్రశ్నిస్తున్నారు. "టీటీడీ పాలకమండలిలో తీసుకునే నిర్ణయాల మేరకు, ఉన్నత స్థాయి అధికారులు జారీ చేసే ఆదేశాలను అమలు చేయడమే మా విధి" నిర్ణయాలు తీసుకున్న వారిని కాదని, ఉద్యోగులపై చర్యలు ఏంటని ఇంజినీరింగ్ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై మా సహచర అధికారులు ఈఓ శ్యామలరావును కలిశారు అని టీటీడీ ఇంజినీర్స్ వెల్పేర్ అసోసియేషియన్ అధ్యక్షుడు మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. "విజిలెన్స్ అధికారులు అడిగిన మేరకు వివరణ ఇవ్వండి. తరువాత చూద్దాం" అని అన్నారని తెలిపారు.
"14వ తేదీ మా అసోసియేషియన్ ఇదే అంశంపై భేటీ అవుతోంది. తదుపరి కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకుంటాం" అని మల్లికార్జున ప్రసాద్ ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
ఇంజినీరింగ్ పనులు పర్యవేక్షించిన ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై భగ్గుమంటున్నారు. పాలక మండలిలో చేసిన తీర్మానాల మేరకు నిధులు ఇచ్చారు. అంతకుముందు తీయారు చేసిన ప్రణాళిక మేరకు పనులు పర్యవేక్షణ చేసిన తమను నిందితులుగా చూడడం ఎంతమేరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
"విధి నిర్వహణలో ఎన్నోసార్లు అవార్డులు, రివార్డులు అందుకున్న మేము నోటీసులు తీసుకోవడం బాధాకరం" అని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు వినిపత్రం సమర్పించారు. విజిలెన్స్ శాఖ జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఇంజినీర్స్ వెల్పేర్ అసోసియేషియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వృత్తిరీత్యా కాంట్రాక్టర్ కావడం గమనార్హం. ఆయన చిత్తూరుకు చెందని వ్యక్తి అయినా, తిరుపతి తోపాటు తిరుమలలో కూడా గతంలో అనేక కాంట్రాక్టులు చేశారు.
"ఉద్దేశపూర్తకంగా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. విధినిర్వహణలో తెలయకుండా జరిగి ఉంటే నేను అండగా ఉంటా" అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇంజినీర్లకు స్వాంతన మాటలు చెప్పడం మినహా, ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తున్నది.
టీటీడీలో ఇదే చర్చ
టీటీడీ చరిత్రలో మొదటిసారి అధికారులు ఈ తరహా ఒత్తిడికి గురయ్యారు. సాధారణంగా టీటీడీలో అంతర్గత చర్యలు తీసుకునే వారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నాటి నుంచే టీటీడీలో చర్చ జరుగుతోంది. నిర్ణయాలు చేసిన రాజకీయ ప్రతినిధులు, నిధులు మంజూరు చేసిన ఉన్నతస్థాయి అధికారులను వదిలేసి, క్షేత్రస్థాయి అధికారులను టార్గెట్ చేయడంపై చర్చ జరుగుతోంది. టీటీడీ ఇంజినీర్స్ వెల్పేర్ అసోసియేషియన్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకంపనలు తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదు.
"30 ఏళ్లుగా సేవాభావం, నిజాయితీగా పనిచేసిన తమను మానసిక వేధింపులకు గురి చేయడం సబబు కాదు" టీటీడీ ఇంజినీర్స్ వెల్పేర్ అసోసియేషియన్ మాజీ కార్యదర్శి టీ. వీరప్రసాద్ అన్నారు. "పాలక మండలిలో చేసిన తీర్మానం మేరకు అప్పగించిన పనులు చేశాం" అని ఆయన గుర్తు చేశారు.
వారిపైనే ఫోకస్
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలనలో ఐదేళ్ల పాటు తిరుమల, ఆ తరువాత టీటీడీ అదనపు ఈఓగా ఏవీ. ధర్మారెడ్డి పనిచేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి కాలంలో జరిగిన పనులు, నిధులు వినియోగంపై ఫోకస్ పెట్టింది.
వారి పాలనలో ఇంజినీరింగ్, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయంటూ, రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ విచారణకు ఆదేశించింది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా రాష్ట్ర విజిలెన్స్ తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అనేక శాఖల్లో విచారణ చేయడంతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేసుకుంది. అక్రమాలు, అవినీతి, అన్యాయాలు, దేవుడి సొమ్ము దుర్వినియోగం చేసినవారిని గుర్తించామని చెబుతున్నారు. ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీటన్నిటిపై విచారణ జరిపి, నిందితులను శిక్షిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటివరకు ఏం సాధించారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా తయారైంది.
2109 నుంచి అనడం కంటే సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి తిరుమల తరువాత తిరుపతిలో అనేక నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. అందులో తిరుపతిలో రోడ్ల నిర్మాణంతో పాటు టీటీడీ నిధులతో అనేక పనులు చేశారు. ఆ వివరాలు మాత్రం రహస్యం. టీటీడీ అధికారులు చెప్పరు. వివరాలు కూడా ప్రకటించారు. అదే ఇక్కడ సమస్య. కాగా, ఫెడరల్ ప్రతినిధికి కొందరు అధికారుల ద్వారా తెలిసిన సమాచారం మేరకు...
జరిగిన పనులు ఇవి..
తిరుపతిలో కొన్ని రోడ్ల విస్తరణ చేశారు. ఎన్నికలకు ముందు జరగడం వల్ల ఆరోపణలు తప్పలేదు. అందులో ప్రధానంగా రేణిగుంట, కరకంబాడి మార్గం, ఆర్టీఏ కార్యాలయం నుంచి రేణిగుంట వరకు బైపాస్ రోడ్డుతో పాటు ఇంకొన్ని రోడ్ల నిర్మాణం సాగించారు. వాటిలో ఒక్కొక్కటి రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు వెచ్చించారు. అలాగే చెర్లోపల్లి నుంచి వకుళమాత ఆలయం వరకు రూ. 30 కోట్లతో రోడ్డు నిర్మించారు. వాటికంటే ప్రధానంగా తిరుపతి రైల్వే స్టేషన్ కు వెనుక భాగంలోని వందల ఏళ్లనాటి సత్రాలను కూలగొట్టారు. వీటిని రూ. 600 కోట్లతో మళ్లీ నిర్మించడానికి సమాయత్తం అయ్యారు. ఈ పనులపై రాజకీయంగా దుమారం చెలరేగింది. ఈ పనులు వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులు చేశారనేది ప్రధాన అభియోగం. ఇందులో భారీగా అవినీతికి ఆస్కారం ఉందని సందేహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ..
2024 ఎన్నికల తరువాత రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాత్రే సీఎం ఎన్. చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమల దర్శనానికి వచ్చారు.
"పాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా" అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రోజుల వ్యవధిలోనే టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు. టీటీడీలో విజిలెన్స్ విభాగం ఉంది. దీనిని కాదని, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ కు బాధ్యతలు అప్పగించారు.
సుదీర్ఘ విచారణ
టీటీడీలో జరిగిన అవకతవకలపై 45 రోజుల్లోగా విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లోని 17 మంది అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయం పూర్తయినా కూడా పరిస్థితి ఓ కొలికి రాకపోవడంతో మరో నెల రోజులు సమయం ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో పొడిగించారు. ఈ పొడిగించిన సమయం కూడా మరో పది రోజుల్లో పూర్తికానుంది. ఈ పరిస్థితుల్లో...
55 మందికి నోటీసులు
టీటీడీలో రెండు నెలల పాటు సాగిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో అక్రమాలు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇంజినీరింగ్ విభాగంలోని 55 ఏఈలు, ఏఈఈ, డీఈఈలకు విజిలెన్స్ శాఖ 55 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రూ. కోట్లతో నిర్మించిన రోడ్లు, భవనాలు, ఇతర పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించారని సమాచారం. దీంతో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చేసిన పనులకు సంబంధించి ఒకో అధికారికి ఒకో రకంగా నోటీసు ఇచ్చారు. దీంతో..
ఇంజినీర్ల నిరసన
"తమకు జారీ చేసిన సోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పై ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (డీఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏ ఈ) పట్టుబడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే, సహాయ నిరాకరణకు కూడా సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి తిరుపతి పరిపాలనా భవనంలో ఇంజినీరింగ్ శాఖ అధికారులు ఉద్యోగులుపెన్ డౌన్ చేసి, నిరసన వ్యక్తం చేశారు.
టీటీడీ ఇంజినీర్స్ వెల్పేర్ అసోసియేషియన్ కార్యదర్శి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, "తిరుపతిలో పనిచేసే 51 ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తవం. నోటీసులు తీసుకున్న ఇంజీనీర్లు వారు పర్యవేక్షించిన పనులకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని ఆయన చెప్పారు. " అసోసియేషియన్ సమావేశంలో చర్చించిన మీదట నిర్ణయాలు తీసుకుంటాం" అని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి టీటీడీలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసి, బాధ్యులను శిక్షించాలనే టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయం మరో ఫలితాన్ని రుచి చూసే పరిస్థితి ఏర్పడింది. పనులు పర్యవేక్షించిన వారికి శిక్ష తప్పేలా లేదు. పనులు చేయాలని నిర్ణయించి, అనుమతులు మంజూరు చేయడం, నిధులు మంజూరు చేసిన అధికారులు భద్రంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంజినీర్లు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.