RTC Strike|ఆర్టీసీలో సమ్మె సైరన్ ?
దాదాపు నాలుగేళ్ళ తర్వాత తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోందా ? సంస్ధలో వాతావరణం చూస్తే అలాగే అనిపిస్తోంది;
దాదాపు నాలుగేళ్ళ తర్వాత తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగబోతోందా ? సంస్ధలో వాతావరణం చూస్తే అలాగే అనిపిస్తోంది. తమడిమాండ్లను పరిష్కరించమని ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా సంస్ధయాజమాన్యం పట్టించుకోవటంలేదని యూనియన్ నేతలు మండిపోతున్నారు. అందుకనే వేరేదారిలేక సమ్మె హెచ్చరికచేయాల్సొస్తోందని నేతలంటున్నారు. ఈరోజు అంటే సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ(RTC) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ను కలిసి సమ్మెనోటీసు ఇవ్వాలని యూనియన్లు డిసైడ్ చేశాయి. సమ్మెనోటీసు(Strike Notice) తర్వాత కార్మిక, ఉద్యోగల డిమాండ్లను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలను యాజమాన్యం తీసుకుంటే సమ్మె అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ నోటీసును కూడా యాజమాన్యం పట్టించుకోకపోతే సమ్మె తప్పకపోవచ్చని నేతలంటున్నారు.
ఇదేవిషయమై ‘తెలంగాణ ఫెడరల్’ తో బహుజన కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య మాట్లాడుతు ‘తమ డిమాండ్లను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవటంలేద’న్నారు. ‘2021లో సమ్మెచేసినపుడు అప్పటి సీఎం కేసీఆర్(KCR) సంస్ధలో కార్మిక యూనియన్ల గుర్తింపును రద్దు’చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు రద్దుచేసిన యూనియన్ల గుర్తింపును పునరుద్దరించాలని ఎన్నిసార్లు అడిగినా ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవటంలేదన్నారు. అలాగే ‘సంస్ధలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులన్నీ(Electric Busses) ప్రభుత్వానివే అయ్యుండాల’ని డిమాండ్ చేశారు. ‘ఇపుడు ప్రైవేటు సంస్ధల ఎలక్ట్రిక్ బస్సులను కాంట్రాక్ట్ కింద యాజమాన్యం ఉపయోగించుకుంటు’న్నట్లు చెప్పారు. ‘సుమారు 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని యాజమాన్యం అనుకుంటే ఇప్పటికే 400 బస్సులను తీసుకున్నద’ని చెప్పారు.
‘ప్రైవేటుసంస్ఠలతో కాంట్రాక్టు చేసుకుని ఎలక్ట్రిక్ బస్సులను తిప్పేకన్నా సంస్ధే సొంతంగా కొనుగోలు చేయటం వల్ల సంస్ధకు దీర్ఘకాలంగా ఉపయోగమే కాకుండా కొత్తగా ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చ’న్నారు. ‘2021లో ప్రభుత్వ శాఖల్లో పీఆర్సీ అమలుచేసినా ఆర్టీసీలో మాత్రం అమలుకాలేద’న్నారు. వెంటనే పెండింగులో ఉన్న పీఆర్సీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ‘వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం చాలా కీలక’మన్నారు. ‘2017 పేస్కేల్ అరియర్స్ సుమారు రు. 2 వేల కోట్లు వెంటనే చెల్లించాల’ని డిమాండ్ చేశారు. డ్రైవర్లు, కండక్టర్ల పనిభారాన్ని తగ్గించాలన్నారు. వీటితో పాటు మరికొన్ని సర్వీసు డిమాండ్లు కూడా ఉన్నట్లు యాదయ్య చెప్పారు.
సంస్ధలో 42 వేలమంది కార్మిక, ఉద్యోగులున్నట్లు యాదయ్య చెప్పారు. ఇపుడు సమ్మెనోటీసును ఆరు యూనియన్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ తెలంగాణ యూనియన్, బహుజన కార్మిక యూనియన్, కార్మిక పరిషత్, బహుజన వర్కర్స్ యూనియన్ నేతలంతా కలిసి యాజమాన్యాన్ని కలిసి సమ్మె నోటీసును ఇవ్వబోతున్నట్లు యాదయ్య చెప్పారు. తమ యూనియన్లలో సుమారు 30 వేలమంది కార్మిక, ఉద్యోగులున్నట్లు యాదయ్య తెలిపారు.
సమ్మెతో తమకు సంబంధంలేదు
కొన్ని యూనియన్లు చేస్తున్న సమ్మెతో తమకు సంబంధంలేదని ఎప్లాయీస్ యూనియన్ నేత రాజిరెడ్డి, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేత వీఎస్ రావు చెప్పారు. ఆర్టీసీలోని యూనియన్లలో చీలికలున్నట్లు దీంతో అర్ధమైంది. ఆర్టీసీలో మొత్తం 10 యూనియన్లుండగా దేనికి కూడా గుర్తింపులేదు. అప్పట్లో కేసీఆర్ రద్దుచేసిన యూనియన్ల గుర్తింపును ఏడాది క్రితం సీఎం అయిన రేవంత్(Revanth) కూడా పునరుద్ధరించలేదు. దాంతో పదిమంది కార్మిక, ఉద్యోగుల బలమున్న వాళ్ళు కూడా యూనియన్లు పెట్టేసుకున్నారు. ఇదే విషయమై రాజిరెడ్డి మాట్లాడుతు సమ్మె నోటీసు ఇవ్వబోతున్న యూనియన్లకు మహాయితే 15 వేలమంది కార్మిక, ఉద్యోగుల మద్దతుంటుందన్నారు. యాదయ్య చెప్పిన డిమాండ్లు వినటానికి రీజనబుల్ గానే ఉన్నాయి. మరీ డిమాండ్లకు కార్మిక, ఉద్యోగుల్లో ఎంతమంది మద్దతుంటుంది ? యాజమాన్యం ఎంత విలువిస్తుందన్నది చూడాలి.