విశాఖకు గనులు ఇవ్వాలని తీర్మానం చేశాం
విశాఖలో ఉక్కు ప్లాంట్‌కు ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అధికారిక తీర్మానం చేసి, దానిని కేంద్రానికి పంపామని జగన్ గుర్తు చేశారు. తమ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా పూర్తిగా ఆపేసినది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఉక్కు కార్మికులపై పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాడట.. అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. కార్మికులను రక్షించాలి గానీ, వారిని బెదిరించే విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
గనులే కీలకం
విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులే కీలకమని పేర్కొన్నారు. ఎస్‌ఏఐఎల్ (SAIL)కు సొంత ఐరన్ ఓర్ గనులు ఉన్నాయని, అయితే ఆర్‌ఐఎన్‌ఎల్ (RINL–విశాఖ స్టీల్ ప్లాంట్)కు సొంత గనులు లేవని జగన్ వివరించారు. ఇదే రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా. విశాఖ స్టీల్‌కు సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాలు పెరిగాయని ఆయన అన్నారు.
మిట్టల్‌కు గనులు కావాలని అడిగే సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు కోసం గనులు కావాలని ఎందుకు అడగరు అని జగన్ సీఎం చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు అదానీ-మిట్టల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు గనులు ఇవ్వాలని కోరుతూ మాట్లాడుతారని, అయితే ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం సొంత గనులు ఇవ్వాలని ఎప్పుడూ మాట్లాడరని జగన్ విమర్శించారు. ప్రైవేట్ కంపెనీల కోసం గనులు అడుగుతారు కానీ ప్రభుత్వ ప్లాంట్‌ను మాత్రం పట్టించుకోరు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.