స్త్రీశక్తి పథకం–ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.;
By : The Federal
Update: 2025-08-06 16:00 GMT
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నిర్థేశించిన స్త్రీశక్తి పథకానికి, ఐటీ కంపెనీలను ఆకర్షించేందు ఉద్దేశించిన లిప్ట్ పాలసీతో పాటు అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రం వేసింది. మంత్రి వర్గ సమావేశం అనంతరం ఆ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
స్త్రీశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీఎస్‌ఆర్‌టీసీకి చెందిన పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ïసిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 11,449 ఆర్టీసి బస్సులకు గాను 8,456 బస్సులో స్త్రీశక్తి పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రతి సంవత్సరం 1.42కోట్ల మంది మహిళలకు లబ్ధి పొందుతారని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వంపైన రూ. 1,942 కోట్లు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. స్త్రీశక్తి పథకం నిర్ణయం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు రూ. 800 నుంచి రూ. 1000 వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు.
మరో ముఖ్యమైన పాలసీ లిప్ట్(ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ టెక్ హబ్స్)కు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఐటీతో పాటు ఐటీ ఆధారిత సేవలు(ఐటీఈఎస్), గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లను ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించే ఉద్దేశంతో లిఫ్ట్ పాలసీని రూపొందించినట్లు తెలిపారు. లిప్ట్ పాలసీ కింద ఫార్చ్యూన్ 500, ఫోర్బ్స్ గ్లోబల్ 2000 వంటి జాబితాలో స్థానంలో సంపాదించుకున్న పెద్ద పెద్ద సంస్థలకు వాటి పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు తక్కవ ధరలకు భూములను కేటాయించడం చేయనున్నారు. ఏపీలో ప్రముఖ నగరాలైన విశాఖతో పాటు రాజధాని అమరావతి, తిరుపతి వంటి పలు నగరాల్లో ఐటీకి అనువైన వాతావరణం క్రియేట్ చేయనున్నారు. పరిశ్రమలకు కేటాయించే ప్రతి ఎకరాకు కనీసం 500 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుందనే షరతు కూడా విధించాలని నిర్ణయించారు.
2025–28 సంవత్సరాలకు నూతన బార్ పాలసీని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కార్టెల్ వ్యవస్థను నిరోధించేందుకు, ట్రాన్స్‌పరెన్సీ పెంచేందుకు వీలుగా ఈ బార్ పాలసీని రూపొందించారు. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు లైసెన్సులు జారీ చేయనున్నారు. కల్లుగీత కార్మికులకు 50 శాతం ఫీజు రాయితీతో 10 శాతం రిజర్వేషన్ కల్పించారు. అంతేకాకుండా బార్ల సమయాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పొడిగించారు. దీంతో పాటుగా పర్మిట్ రూమ్‌లకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
రూ. 5లక్షల లైసెన్స్ ఫీజులతో వెయ్యి చదరపు అడుగులకు మించకుండా ఈ పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వీటితో పాటు చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, గృహాల్లో పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. నాయీబ్రాహ్మణులకు హెయిర్ సెలూన్లకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పరిమితిని నెలకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 22 ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లను, రిసార్టులను ఆరు క్లస్టర్లుగా డివైడ్ చేసి, వాటిని డెవలప్ చేయాలని, వీటి నిర్వహణ కోసం 33 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.