తెలంగాణకు స్టాన్‌ఫోర్డ్

భారీ వైద్య పరికరాల పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దీనికి సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2024-08-10 12:50 GMT

భారీ వైద్య పరికరాల పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్న విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దీనికి సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణకు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని తీసుకురావడంలో వారు సక్సెస్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. తమ పర్యటనలో భాగంగా స్టాన్‌ఫోర్డ్ వర్సిటీని సందర్శించారు రేవంత్, శ్రీధర్ బృందం. ఇందులో భాగంగానే హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపై బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో చర్చించారు. ఈ చర్చలు ఫలదాయకంగా సాగాయని అధికారులు తెలిపారు. తెలంగాణకు తమ పూర్తి సమకారం అందించడానికి స్టాన్‌ఫోర్డ్ ఓకే చెప్పింది.

భాగస్వామ్యానికి గ్రీన్ సిగ్నల్

ఈ చర్చల్లో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అందుకోవాలని స్టాన్‌ఫోర్డ్‌‌ను ఆహ్వానించారు. అందుకు స్టాన్‌ఫోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశంలో అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునేతా కార్యక్రమాలు, ఉమ్మడి పరిశోధనలు నిర్వమించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలన్న అంశం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఒకవేళ ఈ శాటిలైట్ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తే దీనిని రాష్ట్రంలోని అకడమిక్, హెల్త్‌కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలన్న ఆలోచనను కూడా రేవంత్ రెడ్డి వ్యక్తపరిచారు.

సహకారం అందిస్తాం..

ఈ సమావేశంలో అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి తమ సహకారం అందిస్తామని పేర్కొంటూ బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ వెల్లడించారు. ఇదే అంశంపై రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. ఈ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్.. తెలంగాణలో ఏర్పడితే యువతకు భారీగా ఉపాధి అవకాశాలు అందుతాయని తెలంగాణ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అనురాగ్, జోష్ తమ లేఖలో పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యం కొత్త బాటలు వేస్తుంది: రేవంత్

ఈ సమావేశాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్న వ్యాఖ్యానించారు. ‘‘ స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుంది. హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం కోరాం. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉంది. స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవెలప్మెంట్‌లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా.. యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. స్టాన్ ఫోర్డ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందన్నారు.

గూగుల్ హెడ్ క్వార్టర్స్‌లో రేవంత్

తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు పెట్టుబడులు, ఒప్పందాలు చేసుకోవాలన్న లక్ష్యంతో అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు బృందం మంచి ఫలితాలను సాధిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు సహకరించడానికి స్టాన్ ఫోర్డ్‌ ఒప్పించిన వారు గూగుల్‌తో కూడా చర్చలు జరుగుతున్నారు. ఇందులో భాగంగానే వారు గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఉత్పాదక చర్చలు జరిపారు. తెలంగాణలో టెక్ సేవల విస్తరణ, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ స్థాపన సహా పలు ఇతర ప్రాజెక్ట్‌లపై వారు చర్చించారు.

Tags:    

Similar News