పరకామణి చోరీ కేసు:మాజీ ఏవిఎస్ఓ అనుమానాస్పద మృతి

తాడిపత్రి రైల్వే ట్రాక్ పై శవమై తేలిన సతీష్ కుమార్.

Update: 2025-11-14 07:49 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణి చోరీ కేసులో  కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (TTd assistant vigilance and security officer Avso) సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రస్తుతం ఆయన గుంతకల్లు రైల్వే జీఆర్పీ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నారు.


అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని కోమలి గ్రామం సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ మృతదేహం కనిపించాడు. ఆయన మృతదేహం వద్ద ఐడి కార్డు కూడా పక్కనే పడి ఉంది. రక్తపు మడుగులో పడి ఉన్న టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు.

2023 మార్చి నెలలో శ్రీవారి ఆలయ పరకామణిలో జీయంగార్ మఠం ప్రతినిధి రవికుమార్ 920 డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పరకామణిలో చోరీకి పాల్పడిన పెద్ద జయ్యంగార్ మఠం ఉద్యోగి రవికుమార్ తో తిరుపతి కోర్టులో రాజీ కుదుర్చుకోవడం ద్వారా కేసు మాఫీ చేసుకున్నారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ వ్యవహారం చోటుచేసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసులో వాస్తవాలు తేల్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టిటిడి ప్రస్తుత పాలకమండలి సభ్యుడు జి భాను ప్రకాష్ రెడ్డి గవర్నర్ తోపాటు డిజిపి కి కూడా ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత ఈ కేసుపై ఏపీ హైకోర్టులో ఓ వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. లోకఅదాలత్ లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, దీనిపై విచారణ సాగించాలని కేసును సిఐడికి అప్పగించింది. ఏపీ సిఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సారధ్యంలోని బృందం ఇటీవల తిరుమల ఆలయ పరకామణిని పరిశీలించింది.
తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో రికార్డులను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభం మరింత ముమ్మరం కానున్న నేపథ్యంలో పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుతో కీలకంగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ వై.సతీష్ కుమార్ అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు. ఇది టీటీడీ వర్గాల్లో సంచలనంగా మారింది.
సీఐడీ చీప్ రవిశంకర్ అయ్యన్నార్ తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో విచారణ సాగించారు. అందులో భాగంగా ఈ నెల ఆరవ తేదీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ను కూడా విచారణకు పిలిచారు. కొన్ని గంటలపాటు అనేక ప్రశ్నలు అడిగి, వివరాలు సేకరించారని తెలిసింది.
అనంతపురం జిల్లా ఏఆర్ పోలీస్ విభాగంలో ఎస్ఐగా ఉన్న సతీష్ కుమార్ టీటీడీ విజిలెన్స్ విభాగంలోకి డెప్యుటేషన్ పై వచ్చారు ఆ తరువాత సీఐ పదోన్నతితో ఏవీఎస్ఓ హోదాలో పరకామణి (శ్రీవారి హుండీ కానుకలు లెక్కించే కేంద్రం) సెక్యూరిటీ విభాగానికి అధిపతిగా ఉన్న సమయంలోనే 2023లో పరకామణి చోరీ వ్యవహారం వెలుగు చూసింది.  

టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మరణించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈయన ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు కారణం ఏమిటమనే  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి తాడిపత్రి డీఎస్పీ రోహిత్ చౌదరిని ఫెడరల్ ఆంధ్రప్రదేశ్  ప్రతినిధి సంప్రదించారు.
"ఘటనా స్థలంలో ఉన్నాం. ఇక్కడ పరిశీలని చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వివరాలు ఏమి చెప్పలేం" అని డీఎస్పీ రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారం తెలియడంతో శ్రీవారి క్షేత్రంలోని అధికారులు, సిబ్బంది మధ్య ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News