కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ‘సోషల్’ వార్
ఇపుడు కొత్తగా మొదలైన వార్ ఏమిటంటే ఒకపార్టీ సోషల్ మీడియా పోల్ ను మరో పార్టీ హైజాక్ చేయటమే;
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సరికొత్త వార్ మొదలైంది. ఇంతకీ ఆ వార్ ఏమిటంటే సోషల్ మీడియా వార్(Social media war). సోషల్ మీడియాలో ఒకపార్టీని మరోపార్టీ దుమ్మెత్తిపోసుకోవటం ఇంతకాలం జరుగుతున్నదే. అయితే ఇపుడు కొత్తగా మొదలైన వార్ ఏమిటంటే ఒకపార్టీ సోషల్ మీడియా పోల్ ను మరో పార్టీ హైజాక్ చేయటమే. ఇంతకీ విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి(Revanth reddy) పరిపాలనపై కాంగ్రెస్ పార్టీ(Congress party) ట్విట్టర్(Twitter) వేదికగా ఒక పోల్ నిర్వహించింది. అదేమిటంటే ‘ఫామ్ హౌస్ పాలన కావాలా ? లేకపోతే ప్రజాపాలన కావాలా’ ? అని. బుధవారం మధ్యాహ్నం మొదలైన ఈ పోల్ గురువారం మధ్యాహ్నానికి ముగిసింది. పోల్ ముగిసిన తర్వాత వెల్లడైన ఫలితాలు చూసిన తర్వాత పార్టీ నేతలతో పాటు క్యాడర్, మామూలు జనాలు కూడా ఆశ్చర్యపోయారు.
ఇంతకీ పోల్ రిజల్టు ఏమిటంటే 67 శాతం మంది ఫామ్ హౌస్ పాలనే కావాలని కోరుకోవటం. కాంగ్రెస్(Congress) పార్టీనిర్వహించిన పోల్ లో ఫామ్ హౌస్ పాలన కావాలని 67శాతం మంది కోరుకున్నారని తెలియగానే అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి. మామూలు జనాలెవరూ ఫామ్ హౌస్ పాలనను కోరుకోరు. తాము ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, గెలిపించిన పార్టీఅధినేత కమ్ ముఖ్యమంత్రి తమకు దూరంగా ఫామ్ హౌస్ లో ఉండి పాలనచేస్తానంటే జనాలు ఒప్పుకోరు. పదేళ్ళ ఫామ్ హౌస్ పాలన నచ్చకే కదా జనాలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించింది. అలాంటిది ఇపుడు మళ్ళీ ఫామ్ హౌస్ పాలనకే మెజారిటి జనాలు మొగ్గుచూపించారంటే ఎవరైనా నమ్ముతారా ? 67 శాతం నెటిజన్లు ఫామ్ హౌస్ పాలనకు మొగ్గుచూపారంటే అర్ధమేంటి ? ఏమిటంటే కాంగ్రెస్ నిర్వహించిన పోల్ ను బీఆర్ఎస్(BRS) హైజాక్ చేసిందని. ట్విట్టర్లో కాంగ్రెస్ నిర్వహించిన పోల్ విషయంలో రెండు కోణాలున్నాయి. మొదటిది బీఆర్ఎస్ హైజాక్ చేయటం. రెండోది కాంగ్రెస్ నేతలు, క్యాడర్, సానుభూతిపరులు పోల్ ను పట్టించుకోకపోవటం. పోల్ నిర్వహించటంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని అర్ధమైపోయింది.
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుని పోల్ ను హైజాక్ చేసింది. పోల్ లో మొత్తం 92,551 మంది పాల్గొంటే అందులో ఫామ్ హౌస్ పాలనకు 67శాతం మొగ్గుచూపటం విచిత్రంగా ఉంది. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల్లో మూడింటిని అమలుచేసింది. మరోరెండు పాక్షికంగా అమలవుతోంది. ఒక్కపథకంమాత్రం పెండింగులో ఉంది. రైతుబంధు, ఇందిరమ్మ ఆత్మీయబంధు, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపుకు పైలెట్ ఎంపికలు జరిగాయి. రాష్ట్రంలోని 653 మండలాల్లో పైనాలుగు పథకాలను అమలుచేసేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదలచేసింది. అమలవుతున్న పథకాలు, పథకాల అమలుకు మార్గదర్శకాల విడుదలను చూస్తున్న జనాలు ఫామ్ హౌస్ పాలనకే మొగ్గుచూపినట్లు సర్వే ఫలితాలు రావటం ఆశ్చర్యంగా ఉంది.
ఇదే విషయమై టీపీసీసీ(Telangana PCC) సోషల్ మీడియా కన్వీనర్ మన్నెసతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతు బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్వహించిన పోల్ లో ప్రజాపాలనకు ప్రజలమొగ్గు చూపుతారన్న అక్కసు, అనుమానంతోనే తమ పోల్ ను బీఆర్ఎస్ హైజాక్ చేసిందని ఆరోపించారు. 20 నిముషాల్లో 20 వేల నకిలీఖాతాలతో తమ పోల్ పై బీఆర్ఎస్ దాడిచేసిందని ధ్వజమెత్తారు. నకిలీ ఖాతాలతో తమ పోల్ ను హైజాక్ చేసి దాడిచేయటానికి బీఆర్ఎస్ కోట్లరూపాయలు ఖర్చుపెట్టిందని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఫామ్ హౌస్ పాలనను జనాలు కోరుకుంటున్నారని చెప్పించేందుకు బీఆర్ఎస్ వేలాదిమందితో పోల్ చేయించినట్లు సతీష్ చెప్పారు. తాము నిర్వహించిన పోల్ విషయంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో తెలుసుకునేందుకే తాము పోల్ నిర్వహించినట్లు మన్నె చెప్పారు. దుబాయ్ కేంద్రంగా తాము నిర్వహించిన పోల్ పై బీఆర్ఎస్ దాడిచేసిందన్నారు.
కాంగ్రెస్ ఫెయిల్
తాజా పోల్ సర్వేను సక్రమంగా నిర్వహించటంలో కాంగ్రెస్ ఫెయిలైందని అర్ధమవుతోంది. పోల్ నిర్వహించేటపుడే నకిలీఖాతాలతో ఓట్లేయకుండా జాగ్రత్తలు తీసుకునేండాలి. అయితే కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకోలేదని అర్ధమవుతోంది. అందుకనే కాంగ్రెస్ పోల్ లోకి బీఆర్ఎస్ యధేచ్చగా జొరబడిపోయి పోల్ సర్వే ఫలితాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నదనే సామెతలాగ బీఆర్ఎస్ నైజాన్ని తెలుసుకునేందుకే తాము ఫోల్ నిర్వహించినట్లు మన్నె చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. బీఆర్ఎస్ వైఖరిని ఇపుడు కొత్తగా తెలుసుకోవటం ఏమిటో మన్నెకే తెలియాలి.
పార్టీ బలహీనంగా ఉంది
సోషల్ మీడియా నిర్వహణలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC president Bomma Mahesh Kumar Goud) అంగీకరించారు. పార్టీ సోషల్ మీడియాను బలోపేతంచేయాల్సిన అవసరం ఉందని బొమ్మ చెప్పారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలు, క్యాడర్ లక్షలాదిమంది ఉండికూడా పార్టీ నిర్వహించిన పోల్ లో యాక్టివ్ గా పాల్గొనకపోవటంపై మహష్ కుమార్ గౌడ్ తీవ్రఅసంతృప్తి వ్యక్తంచేశారు. తాజాగా రెండుపార్టీల మధ్య మొదలైన సోషల్ మీడియా వార్ ఎంతదూరం పోతుందో చూడాల్సిందే.