జగన్‌ కుటుంబంపై సోషల్‌ మీడియలో పోస్టులు..కేసు నమోదు చేయని పోలీసులు

మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు.;

By :  Admin
Update: 2025-01-06 09:32 GMT

మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన, ఆయన కుటుంబంపైన టీడీపీ నాయకులు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, దీనిపైన ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. దీనిపైన ఆయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. జగన్‌పైన, ఆయన కుటుంబంపైన సోషల్‌ మీడియాలో టీడీపీ నాయకులు అసభ్యకర పోస్టులు పెట్టారని ఐదు సార్లు ఫిర్యాదులు చేశానని, అయితే తన ఫిర్యాదులపై పోలీసులు సరిగా స్పందించ లేదని, కేసు నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపైన, తన కుటుంబ సభ్యులపైనా సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్టులపైన పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదులు చేశాను. పోలీసులు కేసులు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తే వెంటనే ప్రతిపక్ష నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు వివక్షత చూపిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసే విధంగా పోలీసులను ఆదేశించాలని అంబటి రాంబాబు తన పిటీషన్‌లో కోర్టును కోరారు. ఈ పిటీషన్‌పై సోమవారం విచారణ జరిగింది. పిటీషనర్‌ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా తన వాదనలు కోర్టులో వినిపించారు. అయితే తమకు ఎలాంటి సమాచారం రాలేదని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసుల తరఫున న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. 

Tags:    

Similar News