నటి శ్రీరెడ్డిపై ఏపీలో సోషల్‌ మీడియా కేసులు

సోషల్‌ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పెట్టారని శ్రీరెడ్డిపై ఏపీలో మూడు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి.

By :  Admin
Update: 2024-11-14 05:25 GMT

గతంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ చాంబర్‌ ఎదుట అర్థ నగ్న ప్రదర్శన చేసి అటు తెలుగు చిత్ర పరిశ్రమలోను, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి మీద ఆంధ్రప్రదేశ్‌లో సోషల్‌ మీడియా కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లపైన, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యకరమైన, అభ్యంతకరమైన వీడియోలు పోస్టు చేశారని శ్రీరెడ్డిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. తూర్పు గోదావరికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమండ్రి రూరల్‌ పరిధిలోని బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లపైన, వారి కుటుంబ సభ్యులపైన, వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత గౌవరవానికి భంగం కలిగేలా కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ పద్మావతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు పోలీసులు బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌లో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.

రాజమండ్రిలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లోను శ్రీరెడ్డిపైన కేసు నమోదు చేశారు. అనంతపురం నగరానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని అనంతపురంలో ఫిర్యాదు చేశారు. నగరంలోని నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ సాయినాథ్‌కు తేజస్విని ఫిర్యాదు చేశారు. విశాఖలో కూడా కేసు నమోదైంది. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో శ్రీరెడ్డిపైన ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్‌ మీడియా కేసుల అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో శ్రీరెడ్డి తన సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. తనను క్షమించాలని, ఇక నుంచి అలాంటి అభ్యంతరకర పోస్టులు, వీడియోలు పెట్టనని, తనపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దంటూ వేడుకుంది.

Tags:    

Similar News