అభ్యర్ధులు పరీక్ష హాల్లో ఓఎమ్మార్ షీట్ లో చేసే చిన్న, చిన్న పొరపాట్లే వారి జీవితాలను తారుమారు చేస్తాయని, ఈ విషయాన్ని తెలుసుకుని ఓఎమ్మార్ షీట్ ను సక్రమంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభ్యర్ధులు పరీక్ష హాల్లో ఏ చిన్న తప్పు చేసినా వారి శ్రమ వృధా అవుతుందని, లక్షల మంది పరీక్ష రాస్తున్నారనే విషయం గుర్తించుకోవాలన్నారు.
ఈ నెల 7వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఏబీసీడీ సిరీస్‌లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసిన ప్రశ్నాపత్రం అందిస్తామన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓఎమ్‌ఆర్ షీట్ ను జాగ్రత్తగా నింపాల్సి ఉందన్నారు. అభ్యర్థులు తప్పులు చేస్తే ఓఎమ్‌ఆర్ షీట్ ఇన్ వాలిడ్ అవుతుందన్నారు. దిద్దినా, కొట్టివేసినా, గోళ్లతో చెరిపివేసినా, వైట్‌నర్ పెట్టినా ట్యాంపరింగ్ అయినట్లు ఏపీపీఎస్సీ భావిస్తుందన్నారు. ట్యాంపరింగ్ చేసిన ఓఎమ్‌ఆర్ షీట్లను పరిగణలోనికి తీసుకోవడం జరగదన్నారు.
ఏపీపీఎస్సీ నిర్వహించే ఆయా పరీక్షల్లో అభ్యర్ధులు ఏవిధమైన పొరపాట్లు లేకుండా ఓఎమ్మార్ షీట్ ను పూర్తి చేయాలన్నారు. ఎక్కువ మంది ఓఎమ్మార్ షీట్స్ లలో పొరపాట్లు చేస్తున్నారన్నారు. ఓఎమ్మార్ షీట్స్ పూర్తి చేయటానికి బ్లాక్ లేదా బ్లూ పెన్స్ ను ఉపయోగించి మాత్రమే పూర్తి చేయాలన్నారు. ఫారెస్ట్ ఉద్యోగాల పరీక్ష ల్లో 1/3 నెగెటివ్ మార్కులు ఉన్నాయన్నారు. కాబట్టి అభ్యర్ధులు జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు పెట్టాల్సి ఉంటుందన్నారు.
గ్రూప్–1, గ్రూపు–2 పరీక్షలకు సంబంధించిన కోర్టు సమస్య పరిష్కారం కాగానే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరీక్షలు నిర్వహించడం జరిగిందని, క్వాలిఫికేషన్ కు సంబంధించి వివాదం పరిష్కారం కాగానే ఆ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కోర్టుల్లో కేసుల పెండింగ్ వల్ల డిప్యూటీ ఈవో, ఎఫ్‌ఆర్వో ఫలితాలు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 1600 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ఈ నెలాఖరుకు వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి మరో 16 నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. పారదర్శకంగా వాల్యుయేషన్ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేస్తామన్నారు.
కోర్టుల్లో కేసుల ఉండటం వల్ల పరీక్షా ఫలితాలు ప్రకటించటం ఆలస్యం అవుతుందన్నారు. సోషల్ మీడియాలో ఏపీపీఎస్సీ పై తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని, అది కరెక్ట్ కాదన్నారు. మహిళా రిజర్వేషన్ (హారిజాంటల్) కు సంబంధించి వివాదం వల్ల కొన్ని పోస్టుల ఫలితాలు సిద్ధంగా ఉన్నా ప్రకటించలేకపోతున్నామని కార్యదర్శి రాజబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ అడిషనల్ సెక్రటరీ ఐఎన్. మూర్తి, జాయింట్ సెక్రటరీలు కేవీ ప్రసాద్, జీకే ప్రసూనలు పాల్గొన్నారు.