ఇక హరీష్ కు నిద్రలేనట్లేనా ?

బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి మారిన ఎంఎల్ఏలు రాజీనామాలు చేసే అవకాశం లేదు. ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించే ఉద్దేశ్యం రేవంత్ రెడ్డికి లేదని అర్ధమైపోతోంది.

Update: 2024-07-17 09:27 GMT

ప్రతిజ్ఞలు చేయటం సులభమే కాని దాన్ని నిలుపుకోవటమే కష్టం. అలాగే నెరవేరని ప్రతిజ్ఞలు చేయటం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఇపుడిదంతా ఎందుకంటే బీఆర్ఎస్ లో కీలక నేత తన్నీరు హరీష్ రావు భీకర ప్రతిజ్ఞచేశారు. ఏమనంటే ‘పార్టీమారిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలు మాజీలు అయ్యేంతవరకు నిద్రపోన’ని. ఈ ప్రతిజ్ఞ హరీష్ ఎందుకు చేశారో తెలీదు. ఎందుకంటే ఇది నెవరేరే ప్రతిజ్ఞ అయితే కాదు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి మారిన పదిమంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేసే అవకాశం లేదు. ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించే ఉద్దేశ్యం రేవంత్ రెడ్డికి ఏకోశానా లేదని అర్ధమైపోతోంది. పార్టీలోకి తీసుకుని వాళ్ళతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు వచ్చేట్లు చేసి, మళ్ళీ వాళ్ళకే కాంగ్రెస్ టికెట్లిచ్చి గెలిపించుకోవటం అంటే జరిగేపనికాదని అందరికీ తెలుసు.

రాజీనామాలు చేయించి ఉపఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకోవటం ఎందుకు జరిగేపనికాదు ? ఎందుకంటే అంత అవసరం రేవంత్ కు లేదు కాబట్టే. పార్టీ మారిన ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించాలనే విలువలతో కూడిన రాజకీయాలు ఇపుడు ఎవరూ చేయటంలేదు. ఫిరాయింపుల విషయంలో రేవంత్ కు మార్గదర్శకుడిగా నిలిచిన కేసీయార్ కూడా ఈ పనిచేయలేదు కాబట్టి. పదేళ్ళ పాలనలో ప్రతిపక్షాలకు చెందిన నలుగురు ఎంపీలు, 25మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను బీఆర్ఎస్ లోకి కేసీయార్ లాక్కున్నారు. ఏ ఒక్కళ్ళతో కూడా రాజీనామా చేయించలేదు. పార్టీ మారిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలపై అనర్హత వేటువేయాలని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత మొత్తుకున్నా కేసీయార్ లెక్కచేయలేదు. తాను అధికారంలో ఉన్నపుడు ఏమిచేశారో ఇపుడు రేవంత్ కూడా సేమ్ టు సేమ్ అదే పనిచేస్తున్నారు.

కాబట్టి ఎంఎల్ఏలు రాజీనామాలు చేసేదిలేదు, హరీష్ నిద్రపోయేదీ లేదు. తాము అధికారంలో ఉండగా ఫిరాయింపుల విషయంలో కేసీయార్ ఏమిచేశారో హరీష్ కు తెలీదా ? అదే సీన్ ఇపుడు రిపీట్ అవుతుంటే ఎందుకింత గోలచేస్తున్నారో అర్ధంకావటంలేదు. ఫిరాయింపు రాజకీయాలపై కేటీయార్, హరీష్ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని తెలుసుకోవాలి. ఫిరాయింపులపై గోల చేయటమే కాకుండా హరీష్ ఏకంగా భీషణ ప్రతిజ్ఞ కూడా చేసేశారు. తన ప్రతిజ్ఞ నెరవేరేది కాదని హరీష్ తో పాటు అందరికీ తెలుసు. మరి తెలిసినా ఎందుకు ప్రతిజ్ఞ చేసినట్లు ? ఎందుకంటే ఇదొక రాజకీయ డ్రామా మాత్రమే. ఫిరాయించిన ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ఏదో కాస్త హడావుడి చేయాలి కదా. ఆ నియోజకవర్గాలను పట్టించుకోకపోతే, హడావుడి చేయకపోతే పార్టీ ఆ నియోజకవర్గాలను గాలికి వదిలేసిందని అనుకుంటారు. వెళ్ళిపోయిన ఎంఎల్ఏలు, మద్దతుదారులతో పాటు ఉన్న క్యాడర్ కూడా వెళిపోయే ప్రమాదముంది. ఎంఎల్ఏ, మద్దతుదారులు పోతేపోయారు కనీసం క్యాడర్ను అయినా కాపాడుకుందామన్న ఆలోచనతోనే హరీష్ ఏదేదో నోటికొచ్చినట్లు మాట్లడేసి భీషణ ప్రతిజ్ఞచేశారు.

ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలంటే ముందు వాళ్ళే ఒప్పుకోరు. ఇదే సమయంలో రేవంత్ కూడా అంగీకరించరు. ఎందుకంటే అసెంబ్లీలో నెంబర్ గేమ్ అన్నది చాలా కీలకమైనది. అసెంబ్లీలో కాంగ్రెస్ నెంబర్ 64ను ఎంత ఎక్కువగా పెంచుకుంటే అంత సేఫ్ గా ఉంటుంది ప్రభుత్వం అని రేవంత్ తెలుసు. ఇపుడు ప్రభుత్వాన్ని సేఫ్ గా ఉంచుకోవటమే రేవంత్ టార్గెట్. అంతేకాని ప్రతిష్టకు పోయి ఫిరాయింపులతో రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు పెట్టించి మళ్ళీ గెలిపిచుకునేంత ఛాన్స్ తీసుకోరు. అందుకనే వాళ్ళు రాజీనామాలు చేయరు, రేవంత్ కూడా చేయించరని అందరికీ స్పష్టంగా తెలుసు. ఏదో గోలచేయాలి కాబట్టి కేటీయార్, హరీష్ నాయకత్వంలో హడావుడి జరుగుతోందంతే.

ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేసేట్లుగా హైకోర్టులో పోరాటం చేస్తాం అవసరమైతే సుప్రింకోర్టులో కూడా పోరాడుతామని చేసిన ప్రకటనలు అన్నీ ఉత్తుత్తివే. ఫిరాయింపుల మీద కోర్టులకు వెళితే ఏమవుతాయి ? ఏమీకావు. ఏ కోర్టు కూడా ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాల్సిందే అని ఆదేశించవు. మహాయితే ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోమని స్పీకర్ కు సూచించగలవంతే. ఈ సూచనలను, సలహాలను స్పీకర్ పట్టించుకోరు. తమ సూచనను పట్టించుకోకపోతే కోర్టు కూడా ఏమీ చేయలేవు. ఈ విషయం బాగా తెలుసుకాబట్టి అప్పట్లో కేసీయార్ కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసులు వేస్తే లెక్కేచేయలేదు. ఇపుడు రేవంత్ కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఏ కోణంలో చూసినా హరీష్ కు నిద్ర కరువే తప్ప ప్రతిజ్ఞ నెరవేరే అవకాశమే లేదు.

Tags:    

Similar News