చంద్రబాబుకు ఆరు..పవన్ కల్యాణ్‌కి పదో ర్యాంకు
ర్యాంకులు సాధించడంలో సీఎం, డిప్యూటీ సీఎంలు వెనుకబడ్డారు. సీఎం చంద్రబాబు మంత్రుల ర్యాంకులను ప్రకటించారు.;
విద్యార్థులకు ర్యాంకుల విధానాన్ని అమలు చేస్తున్న విధంగానే ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు కూడా ర్యాంకుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులు ర్యాంకులు సంపాదించుకుంటే.. పనితీరు ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. అందులో తనకు కూడా మినహాయింపు లేదని ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. ఉప ముఖ్యంత్రి పవన్ కల్యాణ్‌కు కూడా మినహాయింపు లేదని వెల్లడించారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు ర్యాంకులను వెల్లడించారు.
మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డిసెంబరు వరకు ఫైళ్ల పరిశీలన, వాటి క్లియరెన్స్‌ల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చారు. ర్యాంకింగ్‌లో సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యంత్రి పవన్ కల్యాణ్ వెనకబడినట్లు వెల్లడించారు. తాను 6వ స్థానంలో నిలవగా.. పవన్ కల్యాణ్ పదో స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. తన కుమారుడు మంత్రి లోకేష్ కూడా మంచి ర్యాంకు పొందడంలో వెనుబడ్డారు. మంత్రి నారా లోకేష్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలు కూడా మంచి ర్యాంకులు సాధించడంలో వెనుకబడ్డారు. వాసంశెట్టి సుభాష్, పయ్యావుల కేశవ్‌లు వరుసలో ఆఖరి స్థానాలు దక్కించుకున్నారు.