నెల్లూరులో కారు ప్రమాదం..ఆరుగురు మెడికోలు దుర్మరణం
యాక్సిడెంట్‌లో ప్రాణాలు పోగొట్టుకున్న వారంతా నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులుగా భావిస్తున్నారు.;
By : The Federal
Update: 2025-04-30 10:53 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదాలు ఆందోళనకరంగా మారాయి. వరుస ప్రమాదాలతో రాష్ట్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మంగళవారం అర్థరాత్రి, బుధవారం తెల్లవారు జామున సింహాచలం అప్పన్న స్వామి వారి సన్నిధిలో దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల మీద గోడ కూలి 8 మంది మరణించిన దుర్ఘటన నుంచి తేరుకోక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం సృష్టించిన ప్రమాదంలో ఆరుగురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో హోటల్ కూలిపోవడమే కాకుండా, కారు కూడా నుజ్జు నుజ్జు అయ్యింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారంతా నారాయణ మెడికల్ కళాశాల విద్యార్థులే అని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత స్పష్టత రావలసి ఉంది.