150పైగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విచారణ చేసిన సిట్ అధికారులు.;
లిక్కర్ స్కామ్‌లో ఏ 31, ఏ 32 నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి కే ధనుంజయరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్‌డీ పీ కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విచారణ కొనసాగించారు. తొలుత వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు విచారణ ముగిసిన అనంతరం వారికి అందజేశారు. సుదీర్ఘ సమయం విచారించిన సిట్ అధికారులు దాదాపు 150కిపైగా ప్రశ్నలు సంధించారు.
లిక్కర్ వ్యవహారంలో వచ్చిన సొమ్ము వైట్ మనీ అయితే ఆ లావాదేవీలకు సంబందించిన రికార్డులు, లెక్కలు, అందుకు సంబందించిన పత్రాలు చూపించాలని సిట్ అధికారులు ఇద్దరినీ ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అధికారులుగా ఉన్న మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు బినామీలుగా ఉన్న కొన్ని సంస్థలు, వ్యక్తుల ఖాతాల్లోకి అంత భారీగా నిధులు ఎలా వచ్చాయి.. ఎక్కడి నుంచి వచ్చాయి.. వాటికీ మీకు ఉన్న సంబంధం ఏంటని ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.