సింగరేణే కిషన్ రెడ్డికి అతిపెద్ద చాలెంజ్

శాఖాపరంగా దేశమంతట కిషన్ ఏమిచేస్తారో తెలీదు కాని తెలంగాణాలో మాత్రం సింగరేణి రూపంలో అతిపెద్ద చాలెంజ్ రెడీగా ఉంది.

Update: 2024-06-11 06:59 GMT

కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న గంగాపురం కిషన్ రెడ్డి ముందు అతిపెద్ద చాలెంజ్ రెడీగా ఉంది. నరేంద్రమోడి 3.0 ప్రభుత్వంలో కిషన్ గనులు, బొగ్గుశాఖ మంత్రిగా నియమితులైన విషయం తెలిసిందే. శాఖాపరంగా దేశమంతట కిషన్ ఏమిచేస్తారో తెలీదు కాని తెలంగాణాలో మాత్రం సింగరేణి రూపంలో అతిపెద్ద చాలెంజ్ రెడీగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ను కేంద్రప్రభుత్వం ప్రైవేటుపరం చేయటానికి రెడీ అయిపోతోందన్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని సింగరేణి ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా తెలంగాణాలోని బొగ్గుగనులపై సింగరేణి కంపెనీదే నూరుశాతం ఆధిపత్యం. అయితే నరేంద్రమోడి ప్రభుత్వం ఏర్పడగానే అంటే 2015లో కమర్షియల్ మైనింగ్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చారు. దీనివల్ల ఏమైందంటే బొగ్గుగనులపై నూరుశాతం ఆధిపత్యం కలిగున్న సింగరేణి కాలరీస్ కు ఎదురుదెబ్బ తగిలింది. అంటే మైన్లను తనిష్టప్రకారం తవ్వకోవటానికి లేకుండా పోయింది. 2015కి ముందు సింగరేణి ఏదైనా కొత్త గనిని ప్రారంభించాలంటే కేంద్రప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేది.

గనులు, బొగ్గుశాఖ మంత్రిత్వశాఖకు చేసుకున్న దరఖాస్తుకు పర్యావరణ, అటవీ, భూసేకరణ, వాతావరణ కాలుష్య శాఖలు అనుమతులు మంజూరుచేసేవి. ఎప్పుడైతే దరఖాస్తుకు కేంద్రం ఆమోదం లభించిందో మంచిరోజు చూసుకుని తవ్వకాలు మొదలుపెట్టేసేది. అయితే కమర్షియల్ మైనింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన ఫలితంగా ఏమైందంటే బొగ్గు గనులపై సింగరేణికి గుత్తాధిపత్యం పోయింది. తెలంగాణాలోని బొగ్గు గనులను సొంతంచేసుకునే అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రైవేటు కంపెనీలకు కూడా దక్కింది. ప్రతి బొగ్గుగనికి కేంద్రప్రభుత్వం ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తోంది. ప్రైవేటు కంపెనీలతో పాటు సింగరేణి కూడా టెండర్లలో పాల్గొనాల్సిందే. ఎవరు ఎక్కువ ధరకు కోట్ చేస్తారో వాళ్ళకే బొగ్గుగని సొంతమవుతుంది. బొగ్గుగనులపై సింగరేణికి 2015కి ముందున్న గుత్తాధిపత్యం పోయింది. 2022లో నాలుగు బొగ్గుగనులకు కేంద్రప్రభుత్వం టెండర్లు జారీచేస్తే ఒక్కటి కూడా సింగరేణికి దక్కలేదు. రెండు గనులను అరబిందో కంపెనీ సొంతంచేసుకుంటే మరో రెండు గనులపై ఏ కంపెనీ కూడా ఆసక్తిచూపకపోవటంతో టెండర్లను కేంద్రం రద్దుచేసింది.

ఇపుడు విషయం ఏమిటంటే ప్రైవేటు కంపెనీలతో పోటీపడి సింగరేణి బొగ్గుగనులను టెండర్లలో సొంతంచేసుకోవటం అసంభవం. టెండర్లంటేనే ఎన్నోరకాల మతలబులుంటాయని అందరికీ తెలిసిందే. టెండర్లను సొంతంచేసుకోవటానికి ప్రైవేటుసంస్ధలు ఎన్నోరకాల ప్రయత్నాలు చేసుకుంటాయి. అలాంటి ప్రయత్నాలను ప్రభుత్వ సంస్ధ సింగరేణి చేసే అవకాశంలేదు. కాబట్టే టెండర్లలో పాల్గొని సింగరేణి బొగ్గుగనులను సొంతం చేసుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతం 18 అండర్ గ్రౌండ్ మైన్స్, 22 ఓపెన్ క్యాస్ట్ మైన్స్ లో సింగరేణి బొగ్గు ఉత్పత్తిచేస్తోంది. 2023-24లో ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసింది. ఇపుడున్న 40 గనుల ద్వారా సింగరేణి మహాయితే మరో పదేళ్ళు బొగ్గు ఉత్పత్తి చేయగలదు. ఇపుడున్న బొగ్గు నిల్వలు పూర్తయిపోతే తర్వాత సింగరేణి పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్నార్ధకమే.

కొత్తగా బొగ్గుతవ్వకాల కోసం సింగరేణి 15 గనుల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. టెండర్లలో పాల్గొని గనులను సొంతం చేసుకోవాలని స్పష్టంచేసింది. ప్రస్తుతం సింగరేణి బొగ్గు ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు, కర్నాటక లాంటి 15 రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. విద్యుత్, స్టీల్ ఉత్పత్తి సంస్ధల్లో సింగరేణి బొగ్గును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ లో లాభాలుండవు కాబట్టి సింగరేణి యాజమాన్యం ఓపెన్ క్యాస్ట్ మైన్స్ లో వచ్చే లాభాలతో సంస్ధ ఆర్ధికపరిస్ధితిని బ్యాలెన్స్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకాబట్టే ప్రైవేటుసంస్ధలు ఓపెన్ క్యాస్ట్ మైన్స ను సొంతం చేసుకోవటానికి మాత్రమే ఆసక్తిచూపుతున్నాయి. ఫలితంగా అండర్ గ్రౌండ్ మైన్సును వదిలేస్తున్నాయి. ప్రైవేటుసంస్ధలు వదిలేసిన అండర్ గ్రౌండ్ మైన్స్ ను సింగరేణి తీసుకుంటే నష్టాలే తప్ప లాభాలసంగతి దేవుడెరుగు నష్టాలు తప్పవు. ఫలితంగా 50 వేల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్న సింగరేణి మూతపడటానికి ఎక్కువ కాలం పట్టదు.

సరిగ్గా ఇక్కడే కిషన్ రెడ్డికి అతిపెద్ద చాలెంజ్ ఎదురవుతోంది. తెలంగాణాలోని బొగ్గుగనులను 2015కి ముందున్నట్లే సింగరేణి సొంతం చేస్తే సంస్ధ బతికిబట్టకడుతుంది. కాబట్టి ప్రధానమంత్రితో మాట్లాడి బొగ్గుగనులను టెండర్ల ద్వారా కాకుండా గుత్తాధిపత్యం ద్వారా సొంతం చేసుకునే ఏర్పాటుచేయాలి. మరి కిషన్ ఆ పని చేయగలరా ? అన్నదే పెద్ద ప్రశ్న. ఇదే విషయమై సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ‘ప్రైవేటుసంస్ధలతో పోటీపడి బొగ్గు గనులను సొంతంచేసుకోవాలంటే సింగరేణి సంస్ధకు సాధ్యంకాద’న్నారు. ‘టెండర్ల ప్రక్రియలో పాల్గొని బొగ్గుగనులను సొంతం చేసుకోవటంలో ప్రైవేటుసంస్ధలు ఎన్నో మాయలకు పాల్పడుతాయ’ని చెప్పారు. ‘ఇలాంటి మాయలుచేసి బొగ్గుగనులను సొంతంచేసుకోవటంలో అదాని సంస్ధ ఆరితేరి’నట్లు ఆరోపించారు. ఇపుడున్న బ్లాకుల నుండి బొగ్గు ఉత్పత్తి మరో పదేళ్ళకి మించి రాదన్నారు. ‘కొత్తబ్లాకులు రాకపోతే సింగరేణి సంస్ధ తొందరలోనే మూతపడటం ఖాయమ’ని చెప్పారు.

గుజరాత్ లోని బొగ్గు గనుల్లో కొన్నింటిని అక్కడి రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకుని టెండర్ల ప్రక్రియ నుండి మినహాయించుకున్న విషయాన్ని మందా తెలిపారు. ‘తెలంగాణా బొగ్గుగనుల విషయంలో కిషన్ రెడ్డి కూడా ప్రధానమంత్రితో మాట్లాడి కనీసం కొన్ని గనులను అయినా టెండర్ల ప్రక్రియ నుండి మినహాయించేట్లుగా చేయాల’న్నారు. గనులు, బొగ్గు శాఖ మంత్రయిన కిషన్ సింగరేణికి ఇంతకన్నా చేయగలిగిన మేలు ఇంకేముండదని చెప్పారు.

Tags:    

Similar News