పాపం ప్రభుత్వానిది... భరింపు ప్రజలది...

ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా భరించేది మాత్రం ప్రజలు. ప్రధానంగా విద్యుత్ విషయానికొస్తే ఇష్టానుసారం చార్జీలు పెంచారు. గత ఐదేళ్లలో ప్రజలపై భారం రూ.32,166 కోట్లు.

Update: 2024-07-12 05:06 GMT

గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడకుండా చూశాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలానికి రూ. 32.166కోట్ల భారం ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. వరుసగా స్వేత పత్రాలు విడుదల చేస్తున్న సందర్భంగా సీఎం చెప్పారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప పెంచిన చార్జీలు తాను తగ్గిస్తానని సీఎం చంద్రబాబు చెప్పలేక పోయారు. పైగా గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు రూ.49,596 కోట్లు. అప్పులు ప్రతి రంగంలోనూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యమైన మాట వాస్తవం. అలాగని సంస్థలను బాగు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత ఐదేళ్లలో విద్యుత్‌ సంస్థలు మొత్తం రూ.1,29,503 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయని సీఎం వైట్ పేపర్ లో వెల్లడించారు. లక్ష కోట్లకు పైన అప్పులు చేసినట్లు చెప్పిన చంద్రబాబు ఈ అప్పులు తీర్చే మార్గాలు కానీ, విద్యుత్ చార్జీలు తగ్గించే మార్గం కానీ చూపించలేదు.

విద్యుత్‌ టారిఫ్‌ పెంపు ద్వారా ప్రజలపై రూ.16,699 కోట్ల ఛార్జీల భారంతో పాటు.. ఇంధన సర్‌ఛార్జ్‌ పేరుతో రూ.5,886 కోట్లు, ట్రూఅప్‌ ఛార్జీలు రూ.3,977 కోట్లు, విద్యుత్‌ సుంకం రూ.5,604 కోట్లు కలిపి.. మొత్తం రూ.32,166 కోట్ల భారం ప్రజలపై గత ఐదేళ్లలో ప్రభుత్వం మోపింది. ఇన్ని రకాల పన్నులు వేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏమిటనేది ప్రశ్న. విద్యుత్ వినియోగం లేని ఇల్లు లేదు. అంటే అన్ని వర్గాల ప్రజల చెవులు పిండి విద్యుత్ చార్జీలు వసూలు చేసింది ప్రభుత్వం.

అనాలోచిత నిర్ణయాలతో నష్టం

వీటీపీఎస్‌ నిర్మాణానికి నిధులు అందుబాటులో ఉన్నా.. పనులు పూర్తిచేయడంలో 55 నెలలు జాప్యమైంది. దీనిద్వారా చౌకధరకు రావాల్సిన 21వేల ఎంయూల విద్యుత్‌ను కోల్పోవడం వల్ల రూ.4,895 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ప్లాంటు నిర్మాణానికి తీసుకున్న అప్పులపై వడ్డీ రూపేణా రూ.2,029 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.

కృష్ణపట్నం నిర్మాణాన్ని పూర్తి చేయడంలో 44 నెలలు ఆలస్యమైంది. దీనికోసం చేసిన అప్పులపై వడ్డీ రూ.2,035 కోట్లు, ఆ ప్లాంటు అందుబాటులోకి రాకపోవడంతో నష్టపోయిన విద్యుత్‌ 17వేల ఎంయూలకు రూ.3,560 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు 2023 మే నాటికి పూర్తి కావాలి. దీన్ని కొత్త కాంట్రాక్టర్‌కు కేటాయించి.. 2026 నాటికి పూర్తిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆన్‌గోయింగ్‌ ఆర్బిట్రేషన్‌ కింద పాత కాంట్రాక్టర్‌కు సుమారు రూ.1,500 కోట్లు చెల్లించాలి. కాంట్రాక్టు ధరల్లో తేడా రూ.350 కోట్లు, ఏటా 2వేల ఎంయూల విద్యుత్‌ ఉత్పత్తి నష్టపోవడం వల్ల రూ.1,155 కోట్ల చొప్పున జనవరి 2026 నాటికి రూ.1,732 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.

పేదలపైనే ఛార్జీల భారం అధికం

గత ప్రభుత్వం గృహ విద్యుత్‌ వినియోగదారులపై టారిఫ్‌ భారాన్ని వేసింది. 1.53 కోట్ల మంది వినియోగదారులు పెరిగిన విద్యుత్‌ ఛార్జీల వల్ల ఇబ్బంది పడ్డారు. మరో రూ.17,137 కోట్ల ఛార్జీల పెంపు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రజలపై భారం వేసేలా నిర్ణయాలు

స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా అధిక ధరకు విద్యుత్‌ కొని, రూ.12,250 కోట్ల నికర భారాన్ని ప్రజలపై వేసింది. 2023-24 నాటికి 11,655 ఎంయూల విద్యుత్‌ను యూనిట్ కు సగటున రూ.7.61 చొప్పున డిస్కంలు కొన్నాయి. ఇలా ఐదేళ్లలో 43,416 ఎంయూల విద్యుత్‌ కొనుగోలుకు రూ.26,030 కోట్లు డిస్కంలు ఖర్చుచేశాయి.

ఏటా రూ.4,350 కోట్ల చార్జీల భారం

సెకి నుంచి 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వల్ల అదనపు భారం రూ.850 కోట్లు.. జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ ఛార్జీలు ఏటా సుమారు రూ.3,500 కోట్లు కలిపి ఏటా రూ.4,350 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఒప్పందం కుదుర్చుకున్న 25 ఏళ్లలో రూ.62వేల కోట్ల భారం ప్రజలపై పడనుంది. ప్రస్తుతం ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల భారం పడకుండా కొత్త సాంకేతికత అందుబాటులో ఉంది.

Tags:    

Similar News