చిత్ర విచిత్రాల సింహాచలం కొండల్లో తిరగడమెలా?

సింహాచలం కొండలపై జంతువులు, పక్షులు, కీటకాలు అన్నీ అత్యంత అరుదైనవే. పలు రకాల ఔషధ జాతి మొక్కలు, వృక్షాలకు ఇవి నిలయం. చూడాలనుకుంటున్నారా?

By :  Admin
Update: 2024-10-13 03:00 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

సింహాచలం కొండ..! ఈ కొండపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన సంగతే అందరికీ తెలుసు. కానీ ఈ సింహగిరులపై జీవ వైవిధ్యం ఉన్న జంతు, పక్షి, వృక్ష, పూల జాతులు, ఔషధ గుణాలున్న మొక్కలు, మనుషుల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే మూలికలు ఉన్నట్టు ఎంతమందికి తెలుసు? దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జంతువులు, పక్షులు ఇక్కడ జీవిస్తున్నాయని ఎందరికి తెలుసు? ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ సింహాచలం కొండలపై ప్రత్యేక కథనం మీ కోసం..!

 

సముద్రమట్టానికి 800 మీటర్ల (2600 అడుగుల) ఎత్తులో, విశాఖపట్నానికి

ఉత్తరాన 14 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లో ఉంది సింహాచలం కొండల శ్రేణి. ఈ రిజర్వ్ ఫారెస్టు కొండల్లో వివిధ రకాల జంతువులతో పాటు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలూ సంచరిస్తున్నట్టు ఇదివరకే నిర్ధారణకు వచ్చారు. ఇంకా ఏఏ వృక్ష, జంతు, పక్షి, కీటక జాతులున్నాయో తెలుసుకోవడానికి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ సభ్యులు, ప్రకృతి ప్రేమికులు, పరిశోధక విద్యార్థులు పలుమార్లు రాత్రి వేళ, కొన్నిసార్లు పగటి పూట పర్యటనలు జరిపారు. బర్డ్ వాచ్ గ్రూపు సభ్యులైతే నెలలో రెండు మూడు సార్లు ఈ కొండల్లో రాత్రుళ్లు తిరుగుతుంటారు. వీరంతా ఈ సింహగిరుల్లో జీవ వైవిధ్యం కలిగిన 51 కుటుంబాలకు చెందిన 234 జంతు, 300కు పైగా వృక్ష జాతులను గుర్తించారు. వీటిలో ఏడు రకాల ఉభయ చరాలు, 40 రకాల సరీసృపాలు, 18 రకాల క్షీరదాలు, 87 రకాల పక్షులు, 82 రకాల సీతాకోకచిలుకలతో పాటు మరికొన్ని ఉన్నాయని అంచనాకొచ్చారు.

 

40 రకాల సరీసృపాలు..

సింహాచలం కొండల్లో 40 రకాల సరీసృపా (పాము జాతులు)లున్నాయి. వీటిలో రెండు ఆర్టర్లు, కొలౌబ్రిడే పదిరకాల జాతులున్నాయి. గెక్కొనిడే ఏడు, ఎలాపిడే 3, అగామిడే 3,సినిడే 3 ఉన్నాయి. ఈ పాముల్లో అత్యంత అరుదైన బేంబూ పిట్ వైపర్, బ్రాంజి బ్యాక్ ట్రీ స్నేక్, గ్రీన్ వైన్ స్నేక్, సాండోవా (కొండ చిలువను పోలి ఉంటుంది), వానపాములకంటే చిన్నవైన బ్రాహ్మిన్ బ్లైండ్ స్నేక్, షీల్డ్ టెయిల్ (సర్ప జాతులు), పెయింటడ్ లెపర్డ్ గికో, గోల్డెన్ కో (అరచేతి సైజుండే) భారీ బల్లులు), ఇండియన్ చామిలియన్ వంటి అరుదైన తొండ జాతులు ఉన్నట్టు కనుగొన్నారు. వందేళ్ల క్రితం తూర్పు కనుమల్లో కనిపించిన అరుదైన ఇండియన్ గికో ఆ తర్వాత కనుమరుగైంది. మళ్లీ 2022లో ఈ కొండలపై దర్శనమిచ్చింది. మరెక్కడా కానరాని కాళ్లు లేని నాలుగు కాళ్ల పాము (బార్కొడియ స్కింక్) ఇక్కడే ఉంది. అత్యంత అరుదైన పురుగులను వేటాడే ట్రాప్ డోర్ స్పైడర్ (సాలీడు) ఇంకా విష సర్పాలు, అరుదైన తేళ్లు, జెర్రెలు, తాబేళ్లు వంటివీ ఉన్నాయి.

 

ప్రపంచంలోనే అతి చిన్న అడవి పిల్లి ఇక్కడే..

ఈ కొండలపై 18 రకాల క్షీరదాలున్నట్టు గుర్తించారు. వీటిలో అడవిపంది, జింక, మౌస్ డీర్, జంగిల్ క్యాట్, ఇండియన్ పాంగోలిన్, ఇండియన్ క్రెస్టెడ్ పోర్కు పైన్ వంటివి ఉన్నాయి. అత్యంత అరుదైన మచ్చల పిల్లి (రస్టీ) సింహాచలం కొండపై ఉన్నట్టు కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న అడవి పిల్లిగా గుర్తింపు పొందింది. అయితే ఇది కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఇక ఉభయచర జీవుల్లో నాలుగు కుటుంబాలకు చెందిన ఏడు రకాలు ఈ సింహాచలం కొండలపై కనిపిస్తాయి. మచ్చ కప్పలు, ఇండియన్ బుల్ ఫ్రాగ్, ఇండియన్ స్కిటరింగ్ ఫ్రాగ్, బారోయింగ్ ఫ్రాగ్, వార్ట్ ఫ్రాగ్, ఓర్నాట్ నేరో మౌజ్డ్ ఫ్రాగ్, ఇండియన్ టీ ఫ్రాగ్ వంటివి ఉన్నాయి. ఈ కొండలపై రుతుపవనాల సమయంలో మంచి వర్షాలు కురుస్తాయి. కొండలపై ఏర్పడ్డ సహజ కుంటల్లో నీరు చేరడం వల్ల అక్కడ ఉభయచర జీవరాశుల సంతానోత్పత్తికి, వాటి మనుగడకు దోహదం చేస్తోంది. 'ఒక మహానగరానికి (విశాఖకు) ఆనుకుని కొండలపై ఇంతటి జీవవైవిధ్యం కలిగిన జంతు, పక్షి, వృక్ష జాతులు వందల సంఖ్యలో ఉండడం అత్యంత అరుదు' అని మద్రాస్ క్రోకడైల్ బ్యాంక్ ప్రాజెక్టు లీడ్ జ్ఞానేశ్వర్ చంద్రశేఖర్ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

 

వింతగొలిపే పక్షులు..

ఈ సింహగిరుల్లో 37 కుటుంబాలకు చెందిన 87 రకాల వింతగొలిపే పక్షులను గుర్తించారు. వాటిలో పాసెరిఫార్మ్స్, అక్సిసిట్రిఫార్మ్ు, కొలంబిఫార్మ్స్, కొరాసిఫార్మ్, కుకిలిఫార్మ్ లు, బుసెరోటిఫార్మ్స్, కాప్రిమల్టిఫార్మ్స్ వంటి పక్షి జాతులను కనుగొన్నారు. ఇక్కడ 50కి పైగా వైవిధ్యం కలిగిన పక్షులున్నాయి. ఆరెంజ్ బ్రెస్ట్ గ్రీన్ పావురం, క్రైస్టెడ్ గోషాక్, బొనెల్లిస్ ఈగిల్, ఇండియన్ గ్రే హార్నిబిల్, బ్లాక్ న్యాప్డ్ ఓరియోల్, ఆసియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్, బ్రౌన్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్, వెర్డిటర్ ఫ్లైక్యాచర్, టిక్కెల్స్ బ్లూ ఫ్లై క్యాచర్, షిక్రా, బ్లాక్ వింగ్డ్ క్లైట్, క్రైస్టడ్ సెర్పెంట్ ఈగిల్, బ్రాహ్మిణి క్లైట్, ఆరంజ్ హెడెడ్ త్రష్, బ్లూ టెయిల్డ్ బీ - ఈటర్, రోజ్ రింగ్డ్ పారాకీట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేక, విభిన్న సౌందర్యాన్ని కలిగి ఉంటాయి.

 

సింగారాల శీతాకోక చిలుకలు..

మరోవైపు ఈ పర్వతాల్లో ఐదు కుటుంబాలకు చెందిన 82 రకాల శీతాకోక చిలుకలను పరిశోధకులు, ప్రకృతి ప్రేమికులు, బర్డ్ వాచర్స్ క నుగొన్నారు. నింఫాలిడే (27 జాతులు), పియరిడే 22, లైకెనిడే 18, పాపిలియోనిడే 10, హెర్పెరిడే 10 జాతులు ఉన్నాయి. ఇవన్నీ ఆ కొండల్లో విహరిస్తూ కనువిందు చేస్తుంటాయి. ఇంకా విభిన్న రకాల తూనీగలు, అతి చిన్న నోరు కలిగిన గబ్బిలాలు, అత్యంత పొట్టి కుందేళ్ల ఉనికిని గుర్తించారు.

 

వృక్ష జాతుల్లోనూ వైవిధ్యమే..

ఇక వృక్ష జాతుల్లోనూ సింహగిరులు జీవ వైవిధ్యాన్ని చాటుకుంటున్నాయి. వీటిలో 300కు పైగా రకాల జీవ వైవిధ్య మొక్కలను కొనుగొన్నారు. ఏపీ రెడ్ లిస్ట్లో పేర్కొన్న అత్యంత విలువైన ఔషధ మొక్కలు నరమామిడి చెక్క, మధుమేహ మందుల్లో వాడే పొడపత్రి, నేలవేము, నాభి పూలు, తానికాయ, ఉసిరి, అడవి నిమ్మ, త్రిఫల చూర్ణంలో వాడే టర్మేనియా డెలారికాతో పాటు ఏగల్ మార్మెలస్, సెలాస్ట్రస్ పానిక్యులాటస్, జిమ్నెమా సిల్వెస్ట్రే, సుడార్థియా విసిడా, శాంటాలమ్ అల్బమ్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా అరుదైన సిరిగంధపు చెట్లు, జీడిమామిడి, పైనాపిల్, పనస వంటి ఫల వృక్షాలు, సువాసనల సంపెంగ, పచ్చ సంపెంగ చెట్లు, అల్లి చెట్లు, కూడా ఉన్నాయి. '1926కంటే ముందే మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ కన్జర్వేటర్ లుషింగ్టన్ ఈ సింహాచలం కొండలపై సిరిగంధం, పనస, సంపెంగ మొక్కలను నాటినట్టు రికార్డుల్లో ఉంది. ఈ కొండలు అరుదైన వృక్షజాతులతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి' అని ఆంధ్రవిశ్వవిద్యాలయం హెర్బేరియం మ్యూజియం (వృక్షశాస్త్ర విభాగం) క్యూరేటర్ డాక్టర్ జొన్నకూటి ప్రకాశరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

 

వైల్డ్ లైఫ్ మ్యూజియం ఏర్పాటు చేయాలి..

'సింహాచలం కొండల్లో అత్యంత అరుదైన జీవ వైవిధ్యం కలిగిన విభిన్న రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఇలాంటివి ఈ కొండలపైనే చూడొచ్చు. వీటి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మా వెంట ఆసక్తి ఉన్న వారిని తీసుకెళ్తున్నాం. వారికి అవగాహన కల్పిస్తున్నాం. కొన్నేళ్లుగా విశాఖ నగరం, ఈ కొండల పరిసరాలు శరవేగంగా అభివృద్ధి చెందడం వల్ల వీటి సంతతి తగ్గిపోతోంది. తిరుపతిలో మాదిరిగా ఈ కొండలపై కూడా ఒక వైల్డ్ లైఫ్ మ్యూజియంను ఏర్పాటు చేసి వాటి ఫోటోలను అక్కడ ప్రదర్శిస్తే జనాలు చూడడానికి వీలవుతుంది.' అని వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డు మెంబర్ వివేక్ రాథోడ్.. 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి వివరించారు.

Tags:    

Similar News