ప్రమాద స్థాయికి సికిల్‌ సెల్‌ ఎనీమియా

ఏజెన్సీలోని గిరిజనుల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియా విజృంభిస్తోంది. పిల్లలకు ఎక్కువగా వస్తోంది. అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు పూర్తి స్థాయిలో సక్సెస్‌ కావడం లేదు.

Update: 2024-08-02 03:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో సికిల్‌ సెల్‌ ఎనీమియా ప్రమాద స్థాయికి చేరింది. గిరిజన ప్రాంతాల్లో సికిల్‌ సెల్‌ ఎనీమియా ఏడాది కేడాది పెరుగుతూనే ఉంది. దీనిని అరికట్టేందుకు మందులు లేవు. జన్యు పరంగా వస్తున్న వ్యాధి కావడంతో ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా వ్యాధి ప్రబలకుండా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం సికిల్‌ సెల్‌ ఎనీమియా నిర్మూలన మిషన్‌ను 2023 జూలైలో ప్రారంభించింది. 2047 నాటికి దేశంలో సికిల్‌ సెల్‌ ఎనీమియా లేకుండా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వైద్యులకు పిలుపు నిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో జీరో నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్న బాధిత గిరిజనులు 19,90,277 మందిని మూడేళ్లలోపు స్క్రీనింగ్‌ చే యాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఒక ఏడాదిలో ఇప్పటి వరకు 8,80,560 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 19,046 మంది సికిల్‌ సెల్‌ ఎనీమియా క్యారియర్లు కాగా 1684 మందికి సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం స్క్రీనింగ్‌ చేసిన ప్రతి వ్యక్తికీ సికిల్‌ సెల్‌ స్టేటస్‌ ఐడీ కార్డును వైద్య ఆరోగ్య శాఖ వారు జారీ చేస్తారు. ఇప్పటి వరకు 2,85,397 మందికి ఈ కార్డులను జారీ చేసినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్‌ కమిషనర్, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఎండీ సి హరికిరణ్‌ తెలిపారు. మరో 1,39,888 కార్డులను త్వరలో జారీ చేస్తామన్నారు. సికిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులకు ఉచితంగా రక్తం అందిస్తామన్నారు. జాతీయ డయాలసిస్‌ కార్యక్రమం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో 49 డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయని, మరో 9 డయాలసిస్‌ సెంటర్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నట్లు సికిల్‌ సెల్‌ ఎనీమియా ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ తెలిపారు.
Delete Edit
గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక శ్రద్ధ
వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే కాకుండా గిరిజన సంక్షేమ శాఖ కూడా సికిల్‌సెల్‌ ఎనీమియా నిరోధంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ వ్యాధి ఎక్కువగా స్కూలు ఏజ్‌ పిల్లల్లో వస్తోంది. ఏజెన్సీలో ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజన బాల బాలికల్లో ఉంది. గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర స్థాయిలో ఒక విభాగాన్ని ఇందుకోసం ఏర్పాటు చేసింది. ఐటీడీఏ పీవోల ద్వారా ఇందుకు కావాల్సిన నిధులు కేటాయించి ప్రత్యేక సిబ్బందిని తీసుకొని విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ బాధితుల వివరాలు రాష్ట్ర కేంద్రానికి కూడా పంపిస్తున్నారు.
సికిల్‌ సెల్‌ ఎనీమియా అంటే ఏమిటి?
సికిల్‌ సెల్‌ వ్యాధి లేదా సికిల్‌ సెల్‌ ఎనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అనేది ఒక వంశాను గత రక్త రుగ్మత. సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుడ్రంగా పెప్పెర్‌ మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ప్రాణ వాయువును (ఆక్సిజన్‌) సరఫరా చేస్తుంటాయి. అయితే కొంత మందిలో జన్యు సంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి (సికిల్‌) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్‌ సెల్‌ ఉన్నవారి రక్తకణంలోని ఒక జన్యువు సికిల్‌ సెల్‌ గానూ, ఒకటి మామాలుగానూ ఉన్నట్లయితే అటువంటి వారిని సికిల్‌ సెల్‌ క్యారియర్లు అంటారు. వీళ్లకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులు ఇద్దరికీ ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారికి పుట్టే పిల్లలకు రక్తకణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే సికిల్‌ రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమేనని డాక్టర్‌ నరేష్‌ కుమార్‌ తెలిపారు. సికిల్‌ రక్త కణాలు నశించి పోయేంత వేగంగా కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురవుతారు. అంతేకాక సికిల్‌ రక్తకణాలు వంపుతిరిగి ఉండటం వల్ల సన్నటి రక్త నాళాల్లో సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్‌ అందటం తగ్గిపోతుంది. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే పది నుంచి పదిహేనేళ్ల లోపు చనిపోతారు.
ఈనెల 5వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కలెక్టర్‌ల సమావేశంలో కూడా ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాగ్నొస్టిక్స్‌ కేంద్రాలు ఉన్నాయి. ఎక్స్‌రే, సిటీస్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌ వంటివి ఉచితంగా తీస్తారు. వీటి పనితీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షిస్తారు.
Tags:    

Similar News