P.V.SINDHU MARRIAGE | 22న పీవీ సింధూ పెళ్లి, వరుడు ఎవరంటే?
ఒలంపిక్స్ విజేత పీవీ సింధూ డిసెంబర్ 22న పెళ్లి చేసుకోబోతున్నారు. హైదరాబాద్ కి చెందిన ఓ టెక్నోక్రాట్ తో పెళ్లి జరుగుతుంది. డిసెంబర్ 24న హైదరాబాద్ లో రెసెప్షన్..;
By : The Federal
Update: 2024-12-03 01:10 GMT
DATTA SAI & PV SINDHU
భారత్ టాప్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధూ (పీవీ సింధు) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆమె పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందని సింధూ కుటంబ సభ్యులు ప్రకటించారు. ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశానికి రెండు సార్లు పతకాలను అందించిన ఈ హైదరాబాద్ క్రీడాకారిణి సింధూ పెళ్లి ఉదయ్ పూర్ లో డెస్టినేషన్ మోడ్ లో జరుగుతుంది.
పి.వి. సింధు ఒలింపిక్ పతక విజేత, ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. తన అద్భుతమైన విజయాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టింది. సెలబ్రిటీ అయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాలపై సామాన్యులకు ఆసక్తి మెండుగానే ఉంటుంది. అటువంటి జాబితాలో చేరిన పీవీ సింధు ఎవర్ని పెళ్లి చేసుకోబోతోంది అనే దానిపై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రకటనలో సింధూ అభిమానులు, అనుచరులలో ఆసక్తిని రేకెత్తించింది.
ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పి.వి. సింధు ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. హైదరాబాద్ నుంచి తన క్రీడాయాత్రను ప్రారంభించిన సింధూ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒలింపిక్స్ లో రజత, కాంశ్య పతకాలు సాధించి ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించారు. క్రీడలు, వ్యక్తిగత జీవితం తరచుగా కలిసే ప్రపంచంలో పీవీ సింధూ కూడా ఎవరో ఒక క్రీడాకారుడితో ప్రేమలో పడి ఉంటుందని అందరూ భావించినా ఆమె మాత్రం తన కుటుంబ సభ్యులు కుదిర్చిన పెళ్లికే మొగ్గు చూపారు.
ఎవరీ పీవీ సింధు?
పి.వి. సింధు 1995 జూలై 5న హైదరాబాద్ లో జన్మించారు. భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. అనేక బహుమతులు పొందారు. బోలెడన్ని విజయాలు సాధించారు. ఆమె తల్లిదండ్రులది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. ఆమె షటిల్ కోర్టులో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అతికొద్ది మంది భారతీయ అథ్లెట్లలో ఒకరిగా చరిత్ర సృష్టించింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. BWF టోర్నమెంట్‌లలో టైటిల్స్ గెలిచింది.
పి.వి. సింధు ప్రధానంగా తాను నమ్ముకున్న ఆటకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. 2024 పారిస్ ఒలింపిక్స్ లో ఆమె ఆటతీరు నిరాశపరిచినా తిరిగి గెలుస్తాననే నమ్మకంతో ముందుకు సాగుతూ వచ్చింది. మరో నాలుగేళ్ల దాకా తన క్రీడా ప్రతిభను ప్రపంచం గుర్తించే అవకాశం లేని తరుణంలో వ్యక్తిగత జీవితాన్ని నిర్మించుకోవాలని తలపెట్టింది. ఆమెకు కాబోయే భాగస్వామి ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వచ్చినా ఆమె మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి వైపే మొగ్గు చూపారు. ఆమె డేటింగ్ జీవితం గురించి అనేక పుకార్లు వచ్చాయి. అయినా సింధూ ఎప్పుడూ తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. తన వ్యక్తిగత జీవితాన్ని జనానికి దూరంగానే ఉంచింది.
పూసర్ల వెంకట సింధు తల్లిదండ్రులు పి. రమణ, విజయ. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆమె తల్లి విజయవాడకు చెందిన వారు. ఆమె తండ్రి కుటుంబం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందినప్పటికీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లకు వలస పోయారు. ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు ఏలూరు జిల్లా రత్నాలమ్మకుంట గ్రామంలోని వారి కుటుంబ దేవతలను క్రమం తప్పకుండా దర్శించుకుంటారు.
ఆమె తల్లిదండ్రులిద్దరూ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. ఆమె తండ్రి రమణ 1986 సియోల్ ఆసియన్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత వాలీబాల్ జట్టులో సభ్యుడు. 2000లో అర్జున అవార్డును అందుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు. ఒకరు కాపు, మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. సింధు హైదరాబాద్‌లో పుట్టిపెరిగారు. ఆక్సిలియం హై స్కూల్, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో చదువుకున్నారు.
2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన పుల్లెల గోపీచంద్ విజయం నుండి ప్రేరణ పొంది బ్యాడ్మింటన్‌ని ఎంచుకుంది. ఆమె ఎనిమిదేళ్ల వయస్సు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లోని బ్యాడ్మింటన్ కోర్టులలో మెహబూబ్ అలీ మార్గదర్శకత్వంతో ఆమె శిక్షణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె పుల్లెల గోపీచంద్ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో చేరింది.
డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో పెళ్లి..
భారత్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి. సింధు పెళ్లి డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో జరుగుతుంది. పెళ్లికి సంబంధించిన వేడుకలు డిసెంబర్ 20న ప్రారంభమవుతాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత అయిన సింధు హైదరాబాద్‌కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని వివాహం చేసుకోనున్నారు. దత్తసాయి ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నారు. క్రెడిట్ కార్డులు, లోన్లు ప్రాసెస్ చేయడంలో దిట్ట. హైదరాబాద్ లోనే పుట్టిపెరిగారు.
"రెండు కుటుంబాలు ఒకరికొకరు తెలిసినవే. నెల రోజుల కిందటే పెళ్లి విషయాన్ని ఖరారు చేశాం. జనవరి నుంచి ఆమె షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. అందుకే డిసెంబర్ లో పెళ్లి పెట్టుకున్నాం" అని సింధు తండ్రి పివి రమణ పిటిఐ వార్తా సంస్థకు చెప్పారు. " ఉదయ్ పూర్ లో పెళ్లి తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. వచ్చే సీజన్‌కు ప్రాధాన్యత ఉండటంతో ఆమె తన శిక్షణను త్వరలో ప్రారంభించనుంది" అని ఆయన చెప్పారు.
డిసెంబర్ 20న పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
సుదీర్ఘ కాలంగా పతకాల వేటలో ఉన్న సింధూ డిసెంబర్ 1 న జరిగిన సయ్యద్ మోడీ ఓపెన్‌లో గెలిచి పెళ్లి పీటలు ఎక్కెందుకు సిద్ధమయ్యారు. పెళ్లి తర్వాత కూడా జనవరిలో జరిగే షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ టోర్నీలలో ఆమె ఆడుతుంది. ఆ షెడ్యూల్ కలిసివచ్చేలా ఈ పెళ్లిని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.