తిరిగి "చంద్ర గ్రహణం" ?, బాబు ఏమాత్రం మారలేదు!

ప్రపంచ రాజధాని భారీ సెట్టింగుల కథలూ తిరిగి మొదలయ్యాయి. నవ నగరాలు. వాటి నడుమ అంతర్జాతీయ విమానాశ్రయం. దానికి ఇంకో 35వేల ఎకరాల భూమి. ఏమిటీ అంతులేని భూదాహం?;

Update: 2025-04-22 04:12 GMT

Pawan kalyan, Chandrababu Naidu

"ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా

నలుపు నలుపే గాని తెలుపురాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమా!"
(తెలుగువారెవ్వరికీ వేమన గారు చెప్పిన ఈ పద్యాన్ని విడమరిచి చెప్పనక్కర్లేదు. చదివినా, విన్నా ఇట్టే అర్థం అవుతుంది.)
"నేను మారాను, నన్ను నమ్మండి! ఇక నేను పోరాడుతాను. ఆ పోరాటం నా కోసంకాదు. మీ కోసం. ఈ రాష్ట్రం కోసం.... ఏమయింది ఈ గుంటూరు సీమ పౌరుషం?" అని మైకు పుచ్చుకొని చంద్రబాబు నాయుడు అంటుంటే ఆనాడు గుంటూరు మెయిన్ రోడ్డు క్షణకాలం స్తంభించి పోయింది. ఆ వీడియో చూసి, ఆ వార్త చదివి ఆంధ్ర దేశం ఆశ్చర్యపోయింది.

"అప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఆలోచనల్లో, ఆచరణల్లో తప్పులున్నాయి. కానీ నాడు వాటిని నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక మళ్ళా ఆ తప్పులు జరగవు. నన్ను నమ్మండి." ఆ మాటలకు లౌడు స్పీకర్లు బద్దలయిపోయాయి. ఆనక వెండితెరపై కంటే రాజకీయాల్లో గొప్పగా నటనా చాతురిని ప్రదర్శిస్తున్న పవర్ స్టార్ కమల దళం మానస పుత్రుడై బాబుకు తోడొచ్చారు. కుడియడమలై నిల్చున్నాయి ఎర్ర జెండాలూ; ఇంకేముంది! బాలెట్ బాక్స్ బద్దలయింది.
సీను మారింది.
అధికారం మళ్ళీ బాబు చేతికి వచ్చింది.
ఇంకంతే...!
బెల్లంచుట్టూ చేరే అల్పజీవులన్నీ మళ్ళీ బాబు చుట్టూ చేరాయి. ఉన్నతోన్నతాధికారులు. ధనాధిపతులు. కులాధిపతులు. భజన సంఘాలు. ఒకరేమిటి? అందరూ... అంతే! మొన్నటి స్వర్ణ యుగం తిరిగొచ్చిన ఆనందం బాబుది.
ఓహ్! ఆ ఆనందంలో బాబుకి నిన్నటి మాట మరుపున పడిపోయింది. ఇజాలు ఎగిరిపోయాయి. మళ్ళీ అవన్నీ అబద్ధాలయి పోయాయి. "టూరిజమే ట్రూ ఇజం" అయి కమ్యూనిజాన్ని మరోమారు వెక్కిరించింది. ప్రపంచ రాజధాని భారీ సెట్టింగుల కథలూ తిరిగి మొదలయ్యాయి. నవ నగరాలు. వాటి నడుమ అంతర్జాతీయ విమానాశ్రయం. దానికి ఇంకో 35వేల ఎకరాల భూమి. ఏమిటీ అంతులేని భూదాహం? ఎందుకీ ప్రపంచ రాజధాని? ఎవరికోసం? నాటి శంకుస్థాపనలో పిడికెడు మట్టి, చెంబెడు నీళ్ళు ఇచ్చిపోయిన ప్రధాని మోదీ గారి మీద బాబుకు ఏమాత్రం తగ్గని కొండంత ఆశ. ఏ శాశ్వత భవన నిర్మాణానికైనా నిధులు ఇవ్వకపోతాడా అనే ఆశ. అందుకే నాడు శంకుస్థాపన చేసిన పనుల నేడు ప్రారంభించడానికి మళ్ళీ మోదీ గార్ని ఆహ్వానించి సభ పెడుతున్నారు బాబు. మరి ప్రధాని గారు ఈసారి ఏమి తెస్తారో, ఏమి ఇస్తారో మనందరం అమరావతిలో వేచిచూడాల్సింసిందే.
పవన్ అసలు స్వరూపం స్పష్టం అయింది. బిజెపి వ్యూహంలో రెండవ దశ ప్రారంభమయింది.
బిజెపి పట్ల పూర్తి ప్రతికూలంగా ఉన్న ఆంధ్రప్రజల ప్రమేయం లేకుండానే శాసనసభ, పార్లమెంటులో ప్రాతినిధ్యం సాధించడం, కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టు కోవడంలో కీలకమైన ఆంధ్ర ప్రదేశ్ ఎం.పీల మద్దతు సాధన అనే మొదటి దశ వ్యూహాన్ని బిజెపి బెట్టుగా విజయవంతంగా పూర్తిచేసింది. అందుకు అవసరమైన పాత్రను పవన్ కళ్యాణ్ అద్భుతంగా పోషించారు.
తెలుగు దేశం పార్టీని మానసికంగా బలహీన పరచడం బిజెపి రెండవ దశ వ్యూహం.
బాబు కథ మళ్ళీ మొదటికే వస్తోంది. జనం పిచ్చోళ్ళు కాదు. అమాయకులు అంతకంటే కాదు. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు క్షమించారు బాబు గార్ని. "అప్పుడేదో అవసరంకొద్దీ అన్నాను గానీ... నేను నేనే గాని మారనుగాక మారను. నేను వినా ఈ జాతికి దిక్కెవరు?" అనుకొంటున్నారు బాబు. అలా అనుకున్న హేమాహేమీలు గతంలో కనుమరుగయ్యారు. అలా ఎగిరిపడ్డ కుర్రాడు నిన్ననేగా కళ్ళ ముందే బొక్కబోర్లా పడ్డాడు. అయినా సరే "మోడీ అంతటోడు నాకు భుజంకాస్తున్నాడు" అని అనుకొంటే... ఇక అయితే మరి.
సరే... అంటారు; జనం.
బాబు పంచతంత్రం కథలు చదివినట్టు లేదు. చదివినవారినీ దరిచేరేనీయలేదు. అందుకే మిత్రలాభం, మిత్రభేదం గురించి వారికి తెలియదు. అందువల్లే కరటక దమనకుల ఎత్తులో చిక్కి చిత్తయిన సంజీవకుడు కానున్నారు చంద్రబాబు. ఏమయినా ఆంధ్రదేశానికి మరోమారు చంద్ర గ్రహణం ఛాయలు కనిపిస్తున్నాయి.
వర్గ స్వభావం, దాని ప్రయోజనాన్ని కాపాడుకొనేందుకు ఆ వర్గ నాయకత్వ వ్యూహాలు గురించి కార్ల్ మార్క్స్ ఇచ్చిన విశ్లేషణకు గొప్ప ఉదాహరణ నేటి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం.
Tags:    

Similar News