పేరు 'మౌనిక'.. భర్తను చంపిన తీరు మాత్రం భయానకం!?
వీధి లైట్లు ఆపించి, ప్రియుణ్ణి రప్పించి కట్టుకున్న భర్తను హత్య చేయించిందో గృహిణి;
By : The Federal
Update: 2025-08-15 03:09 GMT
పేరులో ఉన్న లావణ్యం ప్రవర్తనలో లేకపోయింది ఈమెకు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న సాకుతో కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసి కటకటాలపాలైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పాతపట్నంలోని మొండిగొల్లవీధికి చెందిన నల్లి రాజు 8 ఏళ్ల కిందట మౌనికతో పెళ్లి అయింది. ఇద్దరు అబ్బాయిలు. కాపురం సజావుగా సాగుతున్న దశలో మౌనికకు స్థానికుడు గుండు ఉదయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇంట్లో తెలిసింది. కుటుంబంలో గొడవలు ముదిరాయి. కొట్లాటల దాకా వెళ్లింది. భర్త ఆమెను పలుమార్లు మందలించారు.
దీంతో మౌనిక కక్షపెంచుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని ప్లాన్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉండాలనుకున్నారు. అయితే ఉదయ్ కి కూడా పెళ్లి అయింది. ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి వీరిద్దరూ కాపురం పెట్టాలనుకున్నారు. ఇదీ ప్లాన్.
రాజును రాత్రివేళ బయటకు రప్పించేందుకు ఉదయ్ అమ్మాయిలా వాట్సప్‌లో సందేశాలు పంపించాడు. కుదర్లేదు. రాజు బయటకు రాలేదు. దీంతో ఇంట్లోనే హత్యకు పథకం వేశారు.
రాజును ఎలా హత్య చేశారంటే...
మౌనిక ఈ నెల 5న తన భర్తకు 4 నిద్రమాత్రలు కలిపిన అన్నం పెట్టింది. అయినా రాజు మత్తులోకి జారుకోలేదు. దీంతో ఆ మర్నాడు 6 మాత్రలు కలిపిపెట్టింది. భర్త మత్తులోకి జారుకున్నాడు. అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసింది. ఉదయ్‌కుమార్ తన స్నేహితుడైన చౌదరి మల్లికార్జున్‌తో కలిసి బైక్‌పై వస్తూ దారిలో వీధిదీపాలు ఆపేశారు.
ఇంట్లోకి వచ్చాక ముగ్గురూ కలిసి నిద్రలో ఉన్న రాజు ముఖంపై దిండు అదిమి పెట్టి ఉంచి ఊపిరాడకుండా చేశారు. దీంతో రాజు చనిపోయాడు. దీనికి ముందు ఆ ఇద్దరూ కలిసి రాజుకు ఉన్న మోటారు సైకిల్ ను స్థానిక ఎస్సీకాలనీ వద్ద పెట్టి వచ్చారు. రాజును చంపిన తర్వాత శవాన్ని ఉదయ్, మల్లికార్జున్ తాము వచ్చిన బైక్‌పై తీసుకు వెళ్లి- ముందుగా బండి పెట్టిన ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.
అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. మౌనిక తన భర్త రాత్రివేళ ఇంటినుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదంటూ అతని కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారమిచ్చింది. 7న ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు.
రాజు శరీరంపై గాయాలు లేకపోవడంతో పాటు మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసుపెట్టారు. తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నప్పుడు అసలు విషయం బయటపడింది. రాత్రిపూట ఉదయ్‌కుమార్, మల్లికార్జున్ సంచరించినట్లు గుర్తించారు.
పోలీసులు విచారణ చేపట్టారు. మౌనిక పొంతనలేని సమాధానాలిచ్చింది. దీంతో లోతుగా విచారించగా, తామే హత్యచేసినట్లు ముగ్గురూ అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేశారు.