శేషాచలం అడవి సాక్షిగా నాడు ఎర్రచందనం...నేడు ఏనుగుదంతాల స్మగ్లింగ్
శేషాచలం అడవుల్లో నుంచి ఇన్నాళ్లు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన స్మగ్లర్లు నేడు రూటు మార్చి ఏనుగుదంతాలను స్మగ్లింగ్ కు తెరలేపారు.;
By : Shaik Saleem
Update: 2025-07-08 12:15 GMT
హైదరాబాద్ నగరంలో వెలుగుచూసిన ఏనుగుదంతాల స్వాధీనం కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లు శేషాచలం అడవుల నుంచి తరలించారని తేలింది. శేషాచలం అడవుల్లోని చిత్తూరు, నెల్లూరు,అనంతపురం, కడప జిల్లాల్లోని అడవుల్లో ఏనుగులు సంచారం ఎక్కువగా ఉంటోంది. దీన్నే అనువుగా తీసుకొని ఏనుగు దంతాలను శేషాచలం అడవుల నుంచి గుట్టుగా హైదరాబాద్ తరలించి విక్రయిస్తున్నారు. ఏనుగు దంతాల విక్రయ బాగోతాన్ని ఇటీవల రాచకొండ పోలీసులు గుట్టు రట్టు చేయడంతో ఈ స్మగ్లింగ్ వెలుగుచూసింది.
ఏనుగు దంతాల ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్ నగరంలో చిత్తూరు జిల్లా స్మగ్లర్లు ఏనుగు దంతాలను విక్రయించేందుకు యత్నిస్తుండగా రాచకొండ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు. దీంతో శేషాచలం అడవుల నుంచి ఏనుగుదంతాలు తీసుకువచ్చి విక్రయించేందుకు యత్నించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి రాజుల కాలనీకి చెందిన రేకులకుంట ప్రసాద్ (32)ఎర్రచందనం స్మగ్లర్.మరో ఎర్రచందనం స్మగ్లర్ లోకేశ్వర్ రెడ్డి లను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి వారిని జైలుకు పంపించింది. వీరిద్దరూ జైలులో ఉన్నపుడే ఎర్ర చందనం దుంగలను తరలిస్తుంటే తాము పట్టుబడుతున్నామని ఇక నుంచి అత్యంత విలువైన ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఏనుగుదంతాల విలువ రూ.3కోట్లు
శేషాచలం అడవుల నుంచి తీసుకువచ్చిన రెండు ఏనుగు దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్ లో మూడు కోట్ల రూపాయలని తేలింది. రెండు ఏనుగుదంతాలు 5.62 కిలోల బరువు ఉందని పోలీసులు చెప్పారు. ఈ ఏనుగు దంతాలు శేషాచలం అడవుల్లోని ఏనుగుల నుంచి తెచ్చినవని తెలంగాణ వైల్డ్ లైఫ్ అధికారి ఎన్ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
నేడు ఏనుగుదంతాల స్మగ్లింగ్
జైలు నుంచి విడుదలయ్యాక రాయచోటికి చెందిన రేకులకుంట ప్రసాద్ ఎర్రచందనం స్మగ్లర్.మరో ఎర్రచందనం స్మగ్లర్ లోకేశ్వర్ రెడ్డి లు ఏనుగుల దంతాల స్మగ్లింగ్ కు తెరలేపారు. లోకేశ్వర్ రెడ్డిి పథకం ప్రకారం తిరుపతి జిల్లాలోని శేషాచలం అటవీప్రాంతంలోని యానాదుల గిరిజనులున్న ప్రాంతానికి వెళ్లి వారి వద్ద నుంచి రెండు విలువైన ఏనుగు దంతాలను సేకరించారు. తన తోటి స్మగ్లర్ అయిన ప్రసాద్ తో కలిసి ప్రైవేటు ట్రావెల్ బస్సులో రెండు ఏనుగు దంతాలను తీసుకొని వాటిని విక్రయించేందుకు హైదరాబాద్ కు గత నెల 25వతేదీన తెల్లవారుజామున వచ్చారు. ఎల్ బీ నగర్ లో దిగిన వీరిద్దరూ ఏనుగు దంతాలను విక్రయించేందుకు కొనుగోలు దారుల కోసం చూస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు.
ఏనుగు దంతాల స్మగ్లింగ్ సమాచారంతో...
ఎల్ బీ నగర్ ప్రాంతంలో ఏనుగు దంతాలను విక్రయించేందుకు ఇద్దరు స్మగ్లర్లు యత్నిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎల్ బీ నగర్ స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హయత్ నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి దాడి చేసి నిందితుడు రేకులకుంట ప్రసాద్ ను అరెస్ట్ చేసి అతని నుంచి రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నరు. మరో స్మగ్లర్ లోకేశ్వర్ రెడ్డి పరారయ్యాడు. పరారైన స్మగ్లర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తీగలాగితే డొంక కదిలినట్లు...
హైదరాబాద్ నగరంలో ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లు శేషాచలం అడవుల్లోని ఏనుగుల దంతాలను యానాదుల సాయంతో స్మగ్లర్లు తీసుకువచ్చి విక్రయించేందుకు యత్నించారని తేలింది. ఏనుగు దంతాల స్మగ్లింగ్ బాగోతాన్ని రాచకొండ పోలీసులు శేషాచలం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో శేషాచలం అటవీశాఖ అధికారులు ఈ ఏనుగుదంతాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఏనుగులను చంపారా లేదా వాటికి మత్తు మందు ఇచ్చి దంతాలను కోసి తీసుకువచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.