పారిశుద్ధ్య కార్మికులకు వందనం

జై స్వచ్ఛ సేవక్‌ అంటూ నినాదం చేస్తూ.. సభికులతో స్వచ్ఛ సేవక్‌ లకు జై కొట్టించిన సీఎం చంద్రబాబు.

Update: 2025-10-06 15:58 GMT

మన ఇల్లు, మన ఊరు, మన వీధులను నిరంతరం శుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య కార్మికులకు వందనం అని సీఎం చంద్రబాబు అన్నారు. అపరిశుభ్రతను తరిమేసే వాళ్లు నిజమైన వీరులు అంటూ వారికి కితాబిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. జై స్వచ్ఛ సేవక్‌ అంటూ నినాదం చేస్తూ.. సభికులతో స్వచ్ఛ సేవక్‌ లకు జై కొట్టించారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పని చేసే పారిశుద్ధ్య కార్మికులు కూడా వీరులే. స్వచ్ఛ భారత్‌ పేరుతో కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోంది. కానీ గత ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయింది. 85 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిపోయింది. తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారు. చెత్త పన్ను వేశారు.. చెత్తను వదిలేశారు. మేం చెత్త పన్నును రద్దు చేశాం... చెత్తననూ తొలగించాం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లెగసీ వేస్ట్‌ తొలగించిన మంత్రి నారాయణకు, మున్సిపల్‌ సిబ్బందికీ అభినందనలు తెలిపారు.

జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్‌ రాష్ట్రంగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో 100 స్వచ్ఛ రధాలను అందుబాటులోకి తెస్తాం. పరిసరాలను శుభ్రంగా ఉంచేవాళ్లను గౌరవించుకోవాలి. ప్రతి కార్యాలయంలో, రోడ్ల మీద... ఇలా అన్ని చోట్లా పరిశుభ్రతే కన్పించాలి. స్వచ్ఛమైన, పచ్చనైనా, ఆరోగ్యకరమైన రాష్ట్రం కోసం పని చేద్దాం. మన రాష్ట్రంలోని వివిధ నగరాలు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నాయి. స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. సింగపూర్‌ దేశంలో స్వచ్చత పై అధ్యయనం చేసి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ లో అమలు చేశాం. రాత్రిపూట క్లీనింగ్‌ విధానం కూడా అమలు చేశాం. గ్రీన్‌ పాస్‌ పోర్టు ద్వారా విద్యార్థులలో చెట్లు పెంచే అలవాటును పెంచుతున్నాం. యూజ్‌ అండ్‌ త్రో పాలసీ కాదు. యూజ్‌–రికవర్‌–రీ యూజ్‌ పాలసీ అమలు చేస్తున్నాం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Tags:    

Similar News