'సీమ' గొంతెండకుండా కాపాడండి...

వేసవిలో తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు.

Update: 2024-11-15 11:09 GMT

శ్రీశైలం డ్యాం వద్ద జలవిద్యుత్ ఆపాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశాలు, రాయలసీమ తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయం నుంచి ఉభయతెలుగు రాష్ట్రాలు వెంటనే జలవిద్యుత్ ను ఆపివేయాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి డిమాండ్ చేశారు.

విభజన చట్టం ప్రకారం శ్రీశైలంలో నీటిని తాగు, సాటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి కూడా శ్రీశైలం కుడికాలువ నుంచి మాత్రమే చేయాలనే నిబంధనను రెండు తెలుగు రాష్ట్రాలు ఉల్లంఘించి, జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన తెలిపారు. దీనివల్ల వేసవిలో రాయలసీమ ప్రాంత వాసులకు కడగండ్లు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీశైలంలో ప్రస్తుతం 170 టీఎంసీలు మాత్రమే నీటి నిలువ ఉంది. ఈ జలాశయంలో 854 అడుగులకు పైగా నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీరు అందుతుంది. మరో వైపు నాగార్జునసాగర్ లో పూర్తి స్థాయిలో నీరు ఉందని ఆయన తెలిపారు. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి వల్ల విడుదల అయ్యే నీరు సముద్రం పాలవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్ తర్వాతే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల, పరిస్థితిని అర్థం చేసుకోవాలని పురుషోత్తమరెడ్డి సూచించారు. అప్పటివరకు శ్రీశైలంలో నీటి నిల్వలు 854 అడుగుల వరకు కాపాడుకోకుంటే రాయలసీమకు సాగు నీరు కాదు. తాగునీరుకు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కృష్ణా యాజమాన్య బోర్డు ఆందోళన చెందుతున్న విషయాన్ని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గమనించాలని ఆయన కోరారు. రాయలసీమ సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశాలను పాటించడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం జలాశయం నుంచి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి ని నిలుపుదల చేయాలని ఆయన కోరారు.
Tags:    

Similar News