సత్యజాయి జీవితం విశ్వప్రేమకు ప్రతిరూపం అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభివర్ణించారు. ఆయన సందేశం నుసరణీయం అని రాష్ట్రపతి ముర్ము సూచించారు. విశ్వ శాంతికి మార్గదర్శకాలు ఇచ్చి వెళ్లిన మాటలను ఆమె గుర్తు చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని చెబుతూ, ఇందులో ప్రతి సంస్థ, పౌరులూ భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాలలో పాల్గొనడానికి రాష్ట్రపతి ముర్ము శునివారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జిల్లా ఇన్ చార్జి, రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, హిందూపురం ఎంపీ బికే. పార్థసారథి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, డిఐజి షిమోషీ, ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని అన్నారు.
"శాంతికి చిహ్నంగా శ్రీసత్యసాయి యూనివర్సల్ టార్చ్" రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెలిగించారు.
ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు.
"ఆయన సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శ్రీసత్యసాయి సెంట్రల్ టెస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయి ప్రతిమను ఆర్జె. రత్నాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో, గ్లోబల్ సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షులు నిమీష్ పాండ్య తదితరులు పాల్గొన్నారు.
"మానవ సేవే మాధవ సేవ" అనే సత్యసాయి బోధన ప్రతిదినం స్ఫూర్తి నింపుతుందని అన్నారు. సత్యసాయి పవిత్ర స్మృతికి నమస్కారం తెలియజేసిన ఆమె, బాబా మార్గనిర్దేశం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని సేవా మార్గంలో నడిపించిందని కొనియాడారు.
"లవ్ ఆల్ – సర్వ్ ఆల్ సందేశం విశ్వవ్యాప్తం, శాశ్వతం" మాటలను సందేశంగా వదిలిని సత్యసాయి సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే అయిదు మానవ విలువలను బాబా పాఠ్యాంశాలుగా నిలిపారని రాష్ట్రపతి ముర్ము ప్రస్తావించారు.
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందిస్తున్న విలువలతో కూడిన విద్య విధానాన్ని ఆమె ప్రశంసించారు. 1969లోనే బాలికల విద్య కోసం ప్రత్యేక మహిళా క్యాంపస్ ప్రారంభించడం బాబా నారీశక్తిపై ఉన్న దూరదృష్టిని స్పష్టం చేస్తుందని తెలిపారు. సత్యసాయి ఆసుపత్రులు ఉచిత వైద్యాన్ని అందించడం, వేలాది గ్రామాలకు తాగునీరు చేరుస్తూ సేవలు చేయడం అత్యంత గొప్పదని అన్నారు.
అభివృద్ధి చెందిన దేశంగా..
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని రాష్ట్రపతి ద్రైపదీ ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో దేశంలోని ప్రతి సంస్థ, ప్రతి పౌరుడి పాత్ర కీలకం అని బాధ్యతలు గుర్తు చేశారు. దేశాభివృద్ధిలో ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు, ఎన్జీఓలు, ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. సత్యసాయి శతజయంతి అనేది అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని, ప్రపంచ శాంతి కోసం కలిసి పనిచేయాలని రాష్ట్రపతి ముర్ము పౌరులకు కర్తవ్యాన్ని గుర్తు చేశారు.