శ్రీవారి తొలి దర్శనం.. సన్నిధి గొల్లకే..!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంటేశ్వరస్వామి తొలి దర్శనం ఒక వంశానికే సొంతమైంది. వారికే తీర్థం, ప్రసాదం, చందనం ఎందుకు అందిస్తారంటే..!?

Update: 2024-04-15 02:20 GMT
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: సాధారణంగా తిరుమల శ్రీవేంటేశ్వరస్వామి వారి దర్శనం కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తారు. స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు జన్మ ధన్యం అవుతుందని భావిస్తారు. ఆ శ్రీవారిని తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఒక వంశానికే దక్కింది. ఒకటి, రెండు సార్లు కాదు జీవితాంతం... ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ భాగ్యం వారికే ఎందుకు దక్కింది? ఆ వంశానికి అంత ప్రాధాన్యత ఎందుకు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. చరిత్ర కాలగమనంలో...
రాజులు పోయారు. దేశాన్ని పరిపాలించిన బ్రిటీషు వాళ్లు పోయారు. స్వాతంత్రం వచ్చింది. మిరాశీ వ్యవస్థ రద్దయింది. ఇన్ని మార్పులు జరిగినా వందల, వేల సంవత్సరాలుగా తిరుమల శ్రీవారి సన్నిధిలో మాత్రం ఆనాటి ఆచారాలు, ఆధ్యాత్మిక ఒరవడి ఏమాత్రం చెక్కుచెదరకుండా కొనసాగుతూనే ఉంది. ఉంటుంది కూడా..
సన్నిధి గొల్లతో విడదీయలేని బంధం
తిరుమల ఆలయానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఆలయ పూజా కైంకర్యాలకు అర్చకులు, జీయర్ స్వాములు, ఆచార్య పురుషులు అన్నమాచార్య వంశీకులతోపాటు సన్నిధి గొల్ల వంశం కూడా విడదీయలేని అనుబంధం ఏర్పరుచుకొన్న ఆధ్యాత్మిక లోగిలి ఇది. కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచే భాగ్యం ఆ వంశానికే దక్కింది. మొదటి దర్శనం కూడా ఆ వంశీయులదే. శ్రీవారి సేవకు ప్రతినిత్యం అర్చకులను తీసుకువచ్చేది సన్నిధి గొల్ల వంశస్థులే. అసలు ఈ సన్నిధి గొల్లలు ఎవరు. ఈ ఆచారం పాటించడం వెనక ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి. ఒకసారి తెలుసుకుందాం.
అర్చకులను తీసుకుని..
తిరుమల ఆధ్యాత్మిక లోగిలిలో.. సన్నిధి గొల్ల వంశస్థుల్లో వెంకటరామయ్య నేటి తరానికి తెలియని వ్యక్తి. ఆయన సోదరుని కుమారుడు రమేష్ సన్నిధి. వీరిద్దరూ వంతుల వారీగా విధులు నిర్వహించేవారు. ఆ తర్వాత వెంకటరామయ్య కుమారుడు పద్మనాభం కూడా చేరారు. వయసు మీరడం వల్ల 2018లో వెంకటరామయ్య, 2021లో ఆయన కుమారుడు పద్మనాభం సన్నిధి ఈ లోకాన్ని వీడారు. దీంతో.. ప్రస్తుతం సన్నిధి గొల్ల రమేష్, వెంకటరామయ్య మరో కుమారుడు కిషోర్ యాదవ్ సన్నిధి వంశ పారంపర్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నిష్టతో కూడిన విధులు
సన్నిధి గొల్ల పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. అర్చకుడుకు భగవంతునికి వారధిగా సన్నిధి గొల్ల నిలుస్తారు. తిరుమలలోని ఉత్తర మాడవీధుల్లో నివాసముండే సన్నిధి గొల్ల రమేష్ సన్నిధి రోజు బ్రహ్మ ముహూర్తంలో వేకువజామున 2.30 గంటలకు చన్నీటి స్నానం ఆచరించి దివిటితో అర్చక భవనం వద్దకు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉండే అర్చక స్వాములు అనుసరిస్తూ ఉంటే.. దివిటీ పట్టుకున్న రమేష్ సన్నిధి ముందు సాగుతూ ఉంటారు. భక్తులు ఎవరూ దరిదాపులకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అర్చక స్వాములు మహద్వారం వద్దకు చేరేసరికి మొదటి గంట మోగుతుంది. సన్నిధి గొల్ల రమేష్ వెంట వస్తున్న అర్చక స్వాములను చూడగానే మహా ద్వారం వద్ద తలుపులు తెరుస్తారు. అర్చకులను శ్రీవారి ఆలయం వద్ద వదిలేసిన తరువాత...
జీయర్ మఠం చెంతకు..
వెంటనే సన్నిధి గొల్ల రమేష్ సన్నిధి.. ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయం (అఖిలాండం వద్ద) సమీపంలోని మఠానికి చేరుకుంటారు. జీయర్ స్వాములు లేదా వారి ప్రతినిధి అయిన ఏకాంగిని వెంటబెట్టుకొని సన్నిధి గొల్ల కాగడా వెలుగులో ఆలయం వద్దకు తీసుకువస్తారు. జీయర్ స్వాముల నుంచి రెండు తాళాలు ఉండే ఓ చెక్కపెట్టెను మోసుకుంటూ సన్నిధి గొల్ల వారిని కూడా ఆలయం వద్దకు తీసుకు వస్తారు. జీయర్ స్వాములు సన్నిధి గొల్ల వెంట వచ్చేటప్పుడు గంపలో పూలనూ వెంట తీసుకుని వస్తారు. ఆలయంలోకి ప్రవేశించగానే గాఢాంధకారంగా ఉండే ఆలయ సన్నిధిలో కాగడా వెలుగుతో..
కులశేఖరపడి (మొదటి గడప) వద్ద ఉన్న నాలుగు దీపాలను వెలిగిస్తారు. ఆ తర్వాత జీయర్ స్వాముల వద్ద తీసుకున్న పెట్టెలో నుంచి రెండు తాళాలు, ఆలయ అధికారి.వద్ద ఉండే మరో తాళం ఉపయోగించి స్వామివారి గర్భగుడి ద్వారాలు తెరుస్తారు. స్వామివారి సన్నిధి సమీపంలోని రెండు దీపాలను అలాగే సన్నిధి లోపల దీపాలను ఏకాంగి వెళ్లి ప్రజ్వలన చేస్తారు.
" ఈ కార్యక్రమాన్ని వందల సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు" ఈతరం సన్నిధి గొల్ల ప్రతినిధి రమేష్ సన్నిధి.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. అర్చకులు ఏకాంగులు జీయర్ స్వాములను వెంట తీసుకువెళ్లిన తర్వాత ఆలయంలోపల నిర్వహించే కార్యక్రమాలను రమేష్ సన్నిధి వివరించారు. "దివిటీ వెలుగులో ద్వారాల వద్ద ఉన్న దీపాలు వెలిగిస్తాం. ఆ తరువాత.. స్వామి వారి సన్నిధి వద్ద అధికారి నుంచి ఓ తాళం చెవి, జీయర్ స్వాముల నుంచి తీసుకువచ్చిన పెట్టిలో ఉన్న రెండు చెవులు ఉపయోగిస్తేనే తాళం తెరుచుకుంటుంది" అని రమేష్ సన్నిధి తెలిపారు.
ఆ తాళాలు అధికారులకు అందించిన తర్వాత తలుపులు తెరవగానే ఎదురుగా శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దీపాల వెలుగులో కనిపించే నిలువెత్తు విగ్రహాన్ని చూడగానే మేను పులకిస్తుంది" అంటూ, మాటల సందర్భంలోనే స్వామి వారి దివ్య మంగళ స్వరూపం కళ్ళముందు కనిపిస్తోందనే భావనకు లోనైన ఆయన ... మాటలు రాని స్థితిలో కొద్దిసేపు శూన్యం లోకి చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తీరుకున్న రమేష్ సన్నిధి.. ఆలయంలో కాగడాలతో వెళ్ళగానే కనిపించే దృశ్య కావ్యాన్ని వివరించడానికి మాటలు రాని స్థితిలో కాసేపు తడుముకున్నారు.
"ఆలయ సన్నిధిలో శ్రీవారు కొలువైన ప్రదేశం ఒక దివ్యకాంతిని ప్రసరిస్తూ ఉంటుంది అవి మాటల్లో వర్ణించడానికి సాధ్యం కావు" ప్రతిరోజు వేకువ జామున యాదవ వంశం నుంచి తనకు దక్కిన ఈ భాగ్యం లతో జన్మ పునీతమైంది" అని రమేష్ సన్నిధి అలౌకిక ఆనందాంతో అన్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే... "ఆలయ సన్నిధిలో విద్యుద్దీపాల ఆస్కారం లేదు. ఆగమ శాస్త్రం అంగీకరించదు. దీపాల వెలుగులోనే స్వామి వారి దివ్య తేజస్సు కాంతులీనుతుంటుంది " ఆ దృశ్యం మాటలకు అందని భావం అని రమేష్ సన్నిధిలో వాతావరణం అనే కావ్యాన్ని ఆవిష్కరించారు.
"గర్భగుడిలో స్వామివారికి ఎదురుగా ద్వారం పక్కన నాలుగు అడుగుల ఎత్తులో ఉండే పెద్ద దీపాలు ఉంటాయి" ఒక్కో దీప స్తంభం లో 15 కిలోల వరకు నెయ్యి నింపడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఒత్తి కూడా చాలా పెద్దది ఉంటుంది. ఆ వెలుగులోనే సర్వాలంకరణ శోభతుడైన వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉంటారు" అని రమేష్ సన్నిధి వివరించారు.
ఈయన సోదరుడు ( వెంకట్రామయ్య కుమారుడు) కిషోర్ యాదవ్ సన్నిధి కూడా వంశం పారంపర్యంగా దక్కిన వరం లాంటి విధుల్లో ఉన్నారు. ఎంబీఏ పూర్తి చేసిన తాను పది సంవత్సరాలు క్వాలిటీ అనలిస్టుగా హైదరాబాదులో పనిచేసే వాడినని కిషోర్ యాదవ్ సన్నిధి.. ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. ఆ ఉద్యోగం కంటే "వారసత్వంగా లభించిన సన్నిధి గొల్ల విధులు దక్కడం నా పూర్వ జన్మ అదృష్టం" అని అన్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే..
తలుపు తెరవగానే దర్శనం..
"స్వామి గర్భాలయం వద్ద ప్రధాన ద్వారం తెరవగానే కళ్ళెదుట కనిపించే శ్రీవారి దివ్య మంగళ స్వరూపం చూడగానే ఒక కొత్త శక్తి ఆవహిస్తుంది. భూలోక స్వర్గం అంటే ఇదేనేమో అని మొదటిసారి చూసినప్పుడు అనిపించింది" అంటూ కిషోర్ యాదవ్ సన్నిధి అలౌకిక ఆనందంతో తన భావాలను ఫెడరల్ ప్రతినిధితో పంచుకున్నారు.. " స్వామి వారినీ చూడగానే బాహ్య ప్రపంచం అనేది మదిలోకే రాదు" ఈ భాగ్యం నాకు దక్కడం పూర్వజన్మ సుకృతమే కాదు.. నా తల్లిదండ్రుల ద్వారా దక్కిన ఓ గొప్ప వరమని కిషోర్ యాదవ్ సన్నిధి పరమానందం గా చెప్పారు.
"స్వామివారి దర్శనం లభించగానే నేను పక్కకు తప్పుకుంటా. తర్వాత ఏకాంగి గర్భగుడిలోకి వెళ్లి దీపాలు వెలిగిస్తారు. జీయర్ స్వాములు అర్చకులు లోపలికి ప్రవేశిస్తారని కిషోర్ యాదవ్ సన్నిధి వివరించారు. సుప్రభాత సేవ కాగానే మొదట సన్నిధి గొల్ల అయిన మాకే తీర్థం, శఠగోపం, చందనం ఇస్తారు" అని చెప్పిన కిషోర్ యాదవ్ సన్నిధి " ఈ జన్మకు ఇది చాలు" అనిపిస్తుందన్నారు. అంతేకాదు...
ఆయన ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు. శ్రీవారికి సుప్రభాత సేవ అయిన తర్వాత ఆ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత అర్చక స్వాములను మళ్లీ తీసుకువెళ్లి అర్చక భవన్ వద్ద వదిలాక, వారి నుంచి అనుమతి తీసుకుని ఇంటికి వెళతా" అని చెబుతున్నారు.
ఈ విధంగా ప్రతిరోజు వేకువజామున మూడున్నర గంటలకు... సాయంత్రం ఐదున్నర గంటలకు అర్చక స్వాములను అర్చక భవన్ నుంచి, జీయర్ స్వాములను వారి మఠం నుంచి శ్రీవారి ఆలయంలోకి వెంట తీసుకువచ్చి పూజా కైంకర్యాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని అర్చక భవన్ వద్దకు వదిలిపెట్టడం రోజు జరిగే ప్రక్రియ అని వివరించారు. మా సన్నిధి గొల్ల వంశానికి రోజు స్వామివారిని ఏకాంతంగా రెండుసార్లు దర్శనం చేసుకునే భాగ్యాన్ని ఆ మహా విష్ణు ప్రసాదించిన వరమని ఆయన చెబుతున్నారు.
బ్రిటిషర్ల కాలంలోనూ..
రాజుల కాలంలోనే కాదు. బ్రిటిషర్ల పాలనలోనూ తిరుమల లో ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో యాదవ వంశస్థులకు కూడా. తిరుమల క్షేత్ర చరిత్రను తెలుసుకున్న ఆనాటి బ్రిటిషర్లు కూడా సన్నిధి గొల్ల ఆచారాన్ని యధావిధిగా కొనసాగిస్తూ రాతపూర్వకంగా సన్నిధి గొల్ల కు ప్రాధాన్యం ఇచ్చారు. దేశాన్ని వారు ఆక్రమించి, దోపిడీ చేసి ఉండవచ్చు గాక హిందూ సాంప్రదాయాలకు ప్రాధాన్యతై ఇచ్చారు అనేది రికార్డులే చెబుతున్నాయి.
తొలి దర్శనం ఎందుకు...
యాదవులకే శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం ఎందుకిస్తారు.. అనేది చాలామందికి తెలియని విషయం. ఈ ఆచారం కొనసాగడం వెనుక.. చిన్న కథను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణాల ప్రకారం... "వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన స్వామి వారు ఓ పుట్టలో ధ్యానంలో ఉంటారు. అక్కడికి కొన్ని గోవులు రావడం రోజు ఆ పుట్టపై నిలబడి పాలు వదిలేదట. ఆ పాలను స్వీకరించే స్వామి వారు ధ్యానంలో ఉండేవారు అంటారు. గోవులను మేతకు తోలుకు వెళ్లిన యాదవుడు.. ఆగ్రహించి కర్ర తీసుకొని గోవును కొడతాడు. శ్రీమహాలక్ష్మి అంశతో పాలు ఇస్తున్న ఆ గోవు అదృశ్యం కావడం, యాదవుడు విసిరిన కర్ర ధ్యానంలో ఉన్న శ్రీవారి తలకు తగిలి గాయమవుతుంది" అలా యాదవ వంశానికి చెందిన వ్యక్తికి శ్రీనివాసుడు మొదట కనిపించారు. భూలోకం లో నన్ను చూసిన మొదటి మానవుడివి నువ్వే... ఇకపై నా తొలి దర్శనం నీకే ఉంటుందని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకేశ్వరస్వామి ఆ యాదవుడికి వరం ఇచ్చారనేది పురాణ గాధ. అదే నేటికీ కొనసాగుతున్నదనేది.
సన్నిధి గొల్ల అంటే ఇష్టం...
తిరుమల శ్రీవారికి సన్నిధి గొల్లలు అంటే చాలా ఇష్టం. ఆలయం ముందు గొల్ల మండపం ఉందంటే స్వామివారికి వారంటే ఎంత ఇష్టమో చరిత్ర చెబుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సన్నిధి గొల్లల ఇంటికి స్వామివారు వెళ్లే వారిని పురాణాల కథనం. సంక్రాంతి పండుగ మూసిన తర్వాత స్వామివారు పంచాయుధాలు ధరించి, పారువేటకు బయలుదేరుతారు. ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న పార్వేట మండపం సమీపంలో వేటలో పాల్గొంటారు. టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు పండితులు అధికారులు సిబ్బంది వేడుకగా తామే స్వామివార్లము అని భావించి, పారువేటను సాగిస్తారు. మరో పల్లకిపై తానే కృష్ణుడిని వెన్న కృష్ణుడిగా ఊరేగింపు పారువేట మండపానికి స్వామివారిని వేద పండితులు వేంచేపు చేస్తారు. ఆ తర్వాత..
గొల్ల స్థావరానికి...
పారువేట వేడుక అంటే పూర్తయిన తర్వాత సమీపంలోనే తోటలో విడిది చేసిన సన్నిధి గొల్ల స్తావరానికి శ్రీనివాసుడు స్వయంగా వెళ్లి ఆ గొల్లలు నివేదించిన పాలు, వెన్న, పండ్లు స్వీకరిస్తారు. గొల్లలకు తాంబూలం, చందనం, శటారి స్వామివారి పక్షాన పండితులు అందిస్తారు. శ్రీనివాసుడు ఎప్పుడు పారువేటకు వచ్చిన అన్ని సమయాల్లోనూ సన్నిధి గొల్లను సత్కరిస్తూ ద్వాపరయుగంలో ఆ గొల్లలతో తనకున్న స్నేహ బంధాన్ని ప్రేమ బంధాన్ని చాటుకుంటూ ఉంటారని చరిత్ర చెబుతున్న కథనం.
శ్రీ వేంకటేశ్వర స్వామి చరిత్రను టీటీడీ పుస్తకాల రూపంలో అందుబాటులో ఉంచింది. చారిత్రక ఆధారాలతో కూడిన ఈ పుస్తకాల ద్వారా టీటీడీకి ఉన్న ఔన్నత్యాన్ని, అందులో జీయర్ స్వాములు, వేద పండితులు, అన్నమాచార్య వంశస్థులు, సన్నిధి గొల్ల పాత్రను క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది.
తిరుమలలో ఒక రాత్రి...
సన్నిధి గొల్ల ఏం చేస్తారు ఎలా చేస్తారు మళ్లీ ఒకసారి చూద్దామని పించింది. గురువారం రాత్రి 11 గంటలకు తిరుమలలో బస్సు దిగా.. సన్నటి మంచు తెరలు శరీరాన్ని తాకగానే ఆరోజు పగలంతా వేడితో తల్లడిల్లిన నా శరీరానికి సాంత్వన లభించింది. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో శ్రావ్యంగా ఓ పాట వినిపిస్తోంది.
శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద..
పలికిన సీతారామ కథ..
నే పలికేద కదా సీతారామ కథ..
శ్రీ హనుమంతుడు.. అంజనీ సుతుడు
అతి బలవంతుడు రామభక్తుడు...
లంకకు పోయీ.. రాగల ధీరుడు..
మహిమో దీట్టుడు.. శత్రువు గతాతీతుడు..
జాంబవదాది.. దీరులందరూ..
ఘంటసాల ఆలపించిన ఈ గీతం శ్రావ్యంగా వినిపిస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులందరూ కటిక నేరగే పట్టు పాన్పుగా సేద తీరుతున్నారు. ఆలయ పరిసరాలను గమనిస్తూ దరిదాపుల్లో తచ్చాడుతున్న. గొల్ల మండపం సమీపంలో ప్రశాంతంగా ఉంది ఒక్కరూ లేరు. దర్శి స్వామి వారి దర్శనం చేసుకున్న భక్తులు తమ కలిగిన అనుభవాన్ని చెప్పుకుంటూ ఆనందంగా బయటికి వస్తున్నారు. మరోపక్క సుప్రభాత సేవకు ఆలయ పరిసరాలను సిద్ధం చేసే రీతిలో సిబ్బంది చన్నీటితో శుభ్రం చేస్తున్నారు. సన్నిధిలో శ్రీవారు విశ్రాంతి తీసుకుని సమయం వచ్చింది. స్వామి వారి దర్శనానికి పూర్తి చేయించిన భక్తులను బయటికి పంపుతున్నారు.
అదే సమయంలో సన్నిధి గొల్ల రమేష్...
ఆలయ మహా ద్వారం నుంచి బయటికి వస్తూ ఉండడం నాకంట పడింది.... స్వామి గట్టిగా పిలవగానే అనగానే.. ప్రశ్నార్థకమైన చూపుతో నా పక్క చూసాడు. హా... భాస్కర్ బాగున్నావా.. చాలా రోజులు అయింది చూసి, ఎలా ఉన్నావ్.నువ్వు వస్తున్నట్లు తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. సన్నిధి గొల్ల నుంచి ఆ మాటలు నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి.. నా స్థితి అలా లేదు. నన్ను నేను మర్చిపోయా ఎందుకంటే ఈ సందర్భం చూసి కొన్ని సంవత్సరాలు అయింది నా మనసు నా ఆధీనంలో లేదు మళ్లీ ఆయన నా తలపై చేయించి లేపే వరకు.. నా చేతులు నా తల ఆయన పాదాలపై ఎప్పుడు వాలిపోయాయో.. కూడా తెలియలేదు. స్వామివారిని మొదట దర్శనం చేసుకునేది సన్నిధి గొల్ల... ఆ వ్యక్తి నా ఎదురుగా ఉంటే కనిపించిన సన్నిధి కొల్ల కాదు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నా దగ్గరికి నడిచి వచ్చినట్లు అనిపించింది. నిజం చెప్తున్నా మీరు నమ్మరు. చుట్టుపక్కల అందరూ మమ్మల్ని గమనిస్తున్నారు. సన్నిధి గల రమేష్ నా తల నిమిరి ఆశీర్వదించారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శుక్రవారం వేకువజామున నాకు లభించిన వరంగా అనిపించింది.
సమీపంలోనే ఒక వ్యక్తి ఉంటే అయ్యా ఒక ఫోటో తీయమని కెమెరా ఇచ్చారు ఆయన ఏదో విచిత్ర వేషాలు వేయబోయారు. ఫోటో తీసుకొని తర్వాత ఈయన ఎవరో మీకు తెలుసా అని అడిగా. తెలియదు అన్నారు ఈయన సన్నిధి గొల్ల అంటారు అనగానే ఆ వ్యక్తి కూడా వచ్చి సన్నిధికుల రమేష్ ఆశీర్వాదం తీసుకున్నారు అంటే ఆ సందర్భం నాకు కనిపించింది ఈ జీవితానికి ఇది ఒక రాని అనుభూతి నా జీవితం ధన్యమైందనే ఒక భావన కలిగింది. అది మొదలు సాధారణంగా వెంట ఎవర్ని తీసుకెళ్లరు నేను కాస్త ఎడంగా నడుస్తూ ఉంటే సన్నిధి కూడా రమేష్ మాట్లాడుతూ తీసుకెళ్లారు. ఆయన చట్టా పైన కూర్చుంటే నేను కింద కూర్చోవలని ప్రయత్నం చేశా. వద్దు వద్దు నా పక్కన కూర్చొని మాట్లాడండి అని నాతో కుటుంబం గురించి అడిగారు.
అప్పుడు నాకు అనిపించింది.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన ప్రియమిత్రుడు హాతి రాందేవ్ గారితో ఇలానే మాట్లాడారా పాచికలు ఆడారా అనే సందర్భం గుర్తుకు వచ్చింది. నేను హాజీ రాంజీ స్వామి అంతటి వాడిని కాదు కానీ ఆ సందర్భం నా మదిలో అలా మిగిలింది. కొద్దిసేపటికి అర్చక స్వాములు సంసిద్ధమై శ్రీవారి సేవ కోసం అర్చక భవన్ నుంచి బయటికి వచ్చారు. వారిని వెంట తీసుకుని బయలుదేరిన సన్నిధి గొల్ల రమేష్ సన్నిధి తనకు కాస్త దూరంలో నడుస్తున్న నన్ను వారించకుండా మహా ద్వారం సమీపంలోని గొల్ల మండపం సమీపానికి చేరేవరకు చూస్తూ నడిచి వెళ్ళాను. ఎన్నో సంవత్సరాలు తిరుమల శ్రీవారి సన్నిధిలో జర్నలిస్టుగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించా. కానీ ఇలాంటి అపురూప సన్నివేశం నేను ఆస్వాదించలేదు ఇదే మొదటిసారి. గొల్ల బండపం ఎదురుగా నుంచి అర్చక స్వాములను తీసుకొని సన్నిధి వల్ల రమేష్ సన్నిధి ఆలయంలోకి వెళ్లిపోయారు
నేను వారిని అలాగే చూస్తూ ఉండిపోయా. కాసేపటికి ఆలయానికి కాస్త దూరంగా వెళ్లి చూస్తూ ఉంటే నిజంగా వైకుంఠం అంటే ఇలా ఉంటుందనేది మనసారా ఆస్వాదించా. ఆలయానికి సమీపంలోని ఓ ప్రదేశంలో కూర్చున్నా... ఆనంద పరవశం లోని ఈ కథనం రాస్తుంటే మునుపెన్నడు నాకు దొరకని ఒక మధురానుభూతి కలిగింది. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం వేకువజామున 4 గంటల వరకు తిరుగుతూనే ఉన్నా కానీ ఎక్కడ అలసట అనిపించలేదు. విసుగు అనిపించలేదు. నిద్రలేమి అనేది కూడా తెలియనంత ఆనందం కలిగింది. ఈ ఆనందంలో ప్రశాంతంగా వేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చి ఒక కప్పు తాగి. నాలుగు గంటలకు తిరుమల లో బయలుదేరి.. ఇంటికి ఐదు గంటలకు చేరుకున్న.. కానీ ఎందుకో బడలిక అనిపించలేదు అంత కొన్ని గంటల ముందు లభించిన ఆధ్యాత్మిక ఆనందం ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది.
గోవిందా హరే శ్రీనివాసా..
Tags:    

Similar News