సీఐడీ విచారణకు హాజరైన సజ్జల
రోడ్డుపైనే వాహనాన్ని పోలీసులు నిలిపి వేయడంతో సజ్జల రామకృష్ణారెడ్డి నడుచుకుంటూనే సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు.;
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ విచారణకు వైసీపీ కీలక నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌లు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నారని, విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వీరు శుక్రవారం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌లతో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే వారిని పోలీసులు లోపలకి అనుమతించ లేదు. మరో వైపు కోర్టు ముందు రోడ్డుపైనే సజ్జల వాహనాన్ని పోలీసులు నిలపి వేశారు. దీంతో అక్కడ నుంచి నడుచుకుంటూనే సీఐడీ కార్యాలయంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు.