అసెంబ్లీలో నవ్వులు పూయించిన రుషికొండ ప్యాలెస్‌ టూర్‌ టాక్‌

రుషి కొండ ప్యాలెస్‌లపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ సాగింది. అందరం కలిసి రుషికొండ ప్యాలెస్‌లను చూసొద్దామనడంతో నవ్వులు విరబూసాయి.

Update: 2024-07-23 13:29 GMT

విశాఖపట్నం రుషికొండ ప్యాలెస్‌లు, వాటి నిర్మాణాలు, వాటికి వెచ్చించిన నిధులు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తి కర చర్చ జరిగింది. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం టీడీపీ సభ్యులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు దీని గురించి ప్రస్తావించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరం కలిసి ఒక సారి వెళొద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అందరం కలిసి ఒక సారి రుషికొండ ప్యాలెస్‌లు చూసొద్దామని అన్నారు. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న రుషి కొండను జగన్‌ నామ రూపాల్లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు.
వందల కోట్లు టూరిజమ్‌ నిధులు వెచ్చించి ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని, ఎవరి కోసం కట్టారని అని అడిగితే రాష్ట్రపతి, ప్రధాన మంత్రుల కోసం కట్టామని, వారు వచ్చినప్పుడు వాటిల్లో ఉండేందుకు కట్టామని చెబుతున్నారని వినడానికే ఇది విడ్డూరంగా ఉందని అన్నారు. వందల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండి పడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు లేచి వాటిని స్టార్‌ హోటళ్లుగా మారుద్దామని సలహా ఇచ్చారు. ఆ హాటల్‌ను మీరే నిర్వహించి రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చూడాలని సీఎం బదులిచ్చారు. దీనికి నవ్వులు చిందించిన రఘురామకృష్ణమరాజు ఇంకా మాట్లాడుతూ జగన్‌ కట్టిన ప్యాలెస్‌లను టూరిమ్‌ స్పాట్‌లు మారుద్దామని, లేదంటే హైదరాబాద్‌లోని ఫలక్‌నామా ప్యాలస్‌లుగా మారుద్దామని, దీని వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పడంతో చంద్రబాబుతో పాటు సభలోని సభ్యులందరూ ఒక్క సారిగా నవులు చిందించారు. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పందిస్తూ తన శాఖకు కేటాయించాలని కోరడంతో మళ్లీ నవ్వుకున్నారు. దీనిపైన చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దీనిని ఎలా ఉపయోగించుకోవాలి, దేని కోసం ఉపయోగించుకుంటే ఆదాయం వస్తుందనే దానిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని సభ్యులందరికీ సూచించారు. ప్రకృతికి నిలయమైన కొండను తవ్వేసి, వందల కోట్లు ప్రజల డబ్బులు పెట్టి ప్యాలస్‌లు కట్టుకున్నాడని, దీనిని అందరమూ కలిసి ఒక సారి చూసొద్దామని చెప్పడంతో అందరూ ఒకే అన్నారు.
Tags:    

Similar News