ఏపీలో ఆర్టీసి బస్సు అపహరణ
అధికారులు షాక్ తిన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బస్సును, నిందితుడిని స్వాధీనం చేసుకున్నారు.
కార్లు..లారీలు..బైక్‌లు చోరీలకు గురి కావడం చూస్తుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఓ ఆర్టీసీ బస్సే అపహరణకు గురైంది. దీంతో ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారులు ఖంగు తిన్నారు. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం చోరీకి గురైంది. నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి నిరంతరం తునికి తిప్పే బస్సును విధులు పూర్తి అయ్యాక సిబ్బంది ఆదివారం రాత్రి డిపోలో పార్క్ చేశారు. అయితే సోమవారం తెల్లవారు జామున సుమారు 4:30 గంటల సమయంలో ఆ బస్సును తీసేందుకు పార్క్ చేసిన ప్రదేశానికి వేరే డ్రైవర్ వెళ్లి చూడగా అక్కడ బస్సు కనిపించ లేదు. దీంతో ఒక్క సారిగా షాక్‌కు గురైన ఆ డ్రైవర్ డిపో ఉన్నతాధికారులకు విషయం చెప్పాడు. వెంటనే డిపో మేనేజర్ ఆ బస్సు యజమానికి అపహరణకు గురైన సమాచారం అందించారు. అందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. రెండు బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. బస్సు ఆచూకీని కనిపెట్టారు. నర్సీపట్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి వెళ్లే మార్గంలో బస్సు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బస్సును చోరీ చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.