ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధం లేదు
దేశంలో పేదరికం లేకపోతే 50కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఎందుకు పంపిణీ చేస్తున్నారని రామకృష్ణ నిలదీశారు.;
By : The Federal
Update: 2025-08-16 11:00 GMT
ఆర్ఎస్ఎస్ మెప్పు కోసమే జోల పాడుతున్న మోడీ
పోలవరం నిర్వాసితుల సమస్యలపై దశలు వారి పోరాటం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
మోడీ ఆర్ఎస్ఎస్ జపం చేస్తున్నారని 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో తేట తెల్లమయ్యిందని, ఆయన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో ఒక దోపిడీ దుర్మార్గమైన రాజ్యాంగం నడుపుతున్నటువంటి బ్రిటి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు మూడే మూడు రాజకీయ పార్టీలు అని, వీటిలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పోరాడింది ఒకటి కాగా, మీగతా రెండూ ఎర్రజెండా చేత పట్టుకున్న సిపిఐ అని ఆయన అన్నారు.
నేడు మోడీ చరిత్రను విస్మరించి ఆర్ ఎస్ ఎస్ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తాము జాతీయ జెండాను ఆమోదించడం లేదని ఆర్ ఎస్ ఎస్ ఆనాడే చెప్పిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తాము తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఈనాటికీ మోడీ పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేదని, తమకు ఎన్నికల్లో 400 సీట్లు ఇస్తే తాము రాజ్యాంగాన్ని మారుస్తామని మోడీ ప్రకటించారని, కానీ గత ఎన్నికల్లో చావు దెబ్బతినడంతో టిడిపి లాంటి పార్టీలతో పొత్తు కుదుర్చుకుని పరిపాలన సాగిస్తున్నారన్నారు.
సెప్టెంబర్ నాటికి మోడీకి 75 సంవత్సరాలు నిండిపోతాయని, కనుక ప్రధాని పదవిలో వేరొకరిని కూర్చోబెట్టాలని ఆర్ ఎస్ ఎస్ డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఆర్ ఎస్ ఎస్ ను మచ్చిక చేసుకోవడానికి , వారి మెప్పు పొందడానికి సాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ ఎస్ ఎస్ ను ఆకాశానికెత్తేశారని ఆయన విమర్శించారు. దేశంలో 25 శాతం పేదరికాన్ని తాము తగ్గించామని మోడీ ఘనంగా చెప్పుకుంటున్నారని, ఒక వేళ దేశంలో అంత పేదరికమే తగ్గితే ఉచితంగా అన్ని కోట్ల మందికి బియ్యం ఇతర సామాను ఎందుకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వంలో అదానీ, అంబానీలను పోషిస్తున్నారు తప్ప పేదరికం తగ్గలేదన్నారు. ఈ రోజు కష్ట జీవుల సమస్యలు తగ్గలేదని, వారి జీవన ప్రమాణాలు మారలేదన్నారు.
ఇక పోలవరం విషయంలో నిర్వాసితులను నాశనం చేయాలన్న ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. నిర్వాసితులకు నష్ట పరిహారం తగ్గించడానికి పోలవరం ఎత్తును తగ్గించాలని చూస్తున్నారని, అందువల్ల పోలవరం భవిష్యత్ లో ఒక బ్యారేజ్ గా మిగిలి పోతుందని తప్ప మరోటి కాదన్నారు. ఆయా ప్రాంతాలలోని గిరిజనులు ఏటా జూన్ నెలనుంచి మూడు నెలలు నీటిలోనే మగ్గుతున్నారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పేదలను మోసం చేస్తున్నాయని, పోలవరం ఎత్తు తగ్గిస్తామని మోడీ చెబుతుంటే దానికి చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు.
అలాగే బాబు చెబుతున్న బనకచర్ల ప్రాజెక్టు ఓ అంబక్ ప్రాజెక్టు అని అన్నారు. ఏమైనప్పటికీ , నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రయివేటు వ్యక్తుల పెత్తనాన్ని తాము సహించేది లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు రెండు లక్షల కోట్లు రూపాయలు అవసరమని, వాటిలో లక్ష కోట్ల రూపాయలు ప్రయివేటు వ్యక్తుల నుంచి తీసుకుంటే, ఇక ప్రయివేటు వ్యక్తులు నీరెలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అలాగే బాబు ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు పధకాన్ని తాము హర్షిస్తున్నామని, కానీ దానిని అమలు చేయడానికి ఇంకా అదనంగా మూడు వేల బస్సులు, పది వేల సిబ్బంది అవసరమవుతారన్నారు. అలా ఉన్నపుడే స్త్రీ శక్తి పధకాన్ని పూర్తిగా అమలు చేయవచ్చన్నారు.
తమ పార్టీ ప్రస్తుతం పేద బలహీన వర్గాల వర్గాల వారికి ఇళ్ళ స్థలాల కోసం ఉద్యమిస్తుందన్నారు. పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇచ్చి , ఐదు లక్షల రూపాయలు ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వాలని తాము పోరాడుతున్నామన్నారు. అయితే బాబు దాని ఊసు ఎత్తడం లేదన్నారు. అలాగే మోడీ, బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదని, నేడు రాష్ట్రంలోని ఏ కార్యాలయం చూసినా అవుట్ సోర్సింగ్ సిబ్బందే కనిపిస్తున్నారన్నారు.
రాష్ట్రం గొడ్డు పోయినట్లు నేడు పేరున్న యూనివర్శిటీల పేర్లు వినిపించడం లేదని, కేవలం ప్రయివేటు యాజమాన్యాల చేతులలో ఉన్ననారాయణతో పాటు ఇతర ప్రయివేటు యూనివర్శిటీల పేర్లే వినిపిస్తున్నాయంటే మన పాలకులు ప్రయివేటు వ్యక్తులకు మన రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మేస్తున్నారో అవగతమవుతుందన్నారు.. అలాగే నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి వెంటనే ఇచ్చి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. బాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. అలా కాని పక్షంలో తాము ఉద్యమించక తప్పదన్నారు. అలాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈవిఎంల అవకతవకలకు పాల్పడి పాలన సాగిస్తుందని, దీనికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చన్నారు. ఎలక్షన్ కమిషన్ వాస్తవాలు బయట పెట్టడానికి భయపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తాము త్వరలో చంఢీగడ్ లో జాతీయ స్థాయిలో నిర్వహించనున్న సమావేశాలలో ఓ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె వి వి ప్రసాద్, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి లు సప్ప రమణ, పి లావణ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లం వేంకేశ్వరావు, చిహెచ్ సునీల్, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.