RRRపై కేసు కొనసాగించలేనంటున్న కానిస్టేబుల్
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసును ఇక ముందుకు తీసుకెళ్లలేనని ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎందుకు?;
By : The Federal
Update: 2025-08-04 09:43 GMT
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసును ఇక ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదని ఫిర్యాదుదారు, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని ఫరూక్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట చెప్పారు. దీంతో అఫిడవిట్ రూపంలో తన నిర్ణయాన్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ కేసు నేపథ్యం...
2022 జూన్‌లో రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్‌పై ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో రఘురామ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సీఆర్పీఎఫ్ సిబ్బంది పట్టుకుని, రఘురామతో పాటు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.
ఆ త్వాతత ఏమి జరిగిందో గాని, తాను విధుల్లో ఉండగా రఘురామ, ఆయన కుమారుడు, సీఆర్పీఎఫ్ సిబ్బంది దాడి చేశారని ఫరూక్ బాషా అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దానికి ముందే రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్, రఘురామ భద్రతా సిబ్బంది కలిసి స్థానిక గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషాపై కేసు పెట్టారు. దాన్ని నమోదు చేయకుండా ఫరూక్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టారంటూ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు దానిని తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది.
వాదనల సందర్భంగా రఘురామ తరఫు న్యాయవాది, ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే ఎదురు కేసు పెట్టారని తెలిపారు. కేసు క్రమానుసార వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించగా, ఇదే సమయంలో ఫిర్యాదుదారు కేసు కొనసాగించనని స్పష్టంచేశారు.
దీనిపై అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఫరూక్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.