రోజా మాటల దుమారం..మళ్లీ 'బీప్'(వినలేని మాటలు)రాజకీయం షురూ!
ఏపీలో వేడెక్కిన బూతుల పంచాంగం..అదుపు తప్పుతున్న నేతల వ్యాఖ్యలు;
By : V V S Krishna Kumar
Update: 2025-07-23 08:28 GMT
"రాష్ట్రంలో గాలిలో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు " ఇది తాజాగా వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి రోజా టీడీపీ, జనసేన నేతలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు.ఇంకా పదునైన వ్యాఖ్యలే చేస్తూ దుమ్ము దుమారం దులిపారు.రోజా ఇలా మాట్లాడితే ఇక జనసేన,టీడీపీ నేతలు ఊరుకుంటారా.. ఇప్పుడు ఏపీలో అదే రచ్చ నడుస్తోంది. రాజకీయాలు రోజురోజుకు దిగజారి, నేతలు ఒకరిపై మరొకరు అభ్యంతరకరంగా, అసభ్యపదజాలంతో దూషించుకుంటున్నారు.ఒకవైపు కేసుల రాజకీయం , రప్పా,రప్పా పాలిటిక్స్ కొనసాగుతుండగానే రోజా పదునైన విమర్శలతో రాజకీయాల హీట్ పెంచారు.
అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ, జనసేన నేతలు వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించి దాడులు చేస్తున్నారని మాజీమంత్రి రోజా ఆరోపించారు. తమపై జరిగిన ప్రతి చర్యకు వంద రెట్లు వడ్డీతో బదులు చెబుతామని హెచ్చరించారు. నగరిలో జరిగిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో మాట్లాడిన మాటలు ఇక్కడిదాకా బాగానే వున్నా,ఉపముఖ్యమంత్రి పవన్ ను ఉద్దేశించి ఆయనకు మానసిక స్థితి సరిగా లేదంటూ, “ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టానంటున్నాడు” అంటూ ఆమె ఎద్దేవా చేయడం,అంతకు మించి గాలిగాళ్లు, ఎమ్మెల్యే నా...కొడుకులు అని మాట్లాడటం మంటలు పుట్టిస్తున్నాయి.తనను నమ్ముకున్న సామాజిక వర్గాన్ని కూడా పవన్ నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. రోజా వ్యాఖ్యలపై ఇప్పుడు అధికార పక్షం నుంచి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారం లోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాల్సిందేనని రోజా అన్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ హైదరాబాద్ వదిలి విదేశాల దిశగా వెళ్తున్నారని, రేపు అమెరికా బాట పడతారని విమర్శించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం లో వున్నప్పుడు బీప్ వ్యాఖ్యల (బూతులు వినిపించకుండా బీప్ వేసే పరిస్థితి )రాజకీయం యుద్దంలా సాగింది.పలువురు నేతలు నోరు విప్పితే బూతులు మాట్లాడుతున్నారని ప్రజలు చీదరించుకున్నారు.ఏకంగా అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరమైన భాషను ఉపయోగించడం కూడా అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడి వైసీపీ ఓటమికి అదో కారణంగా చెప్పుకోవాల్సి వచ్చింది.2024 ఎన్నికల్లో కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత అలాంటి వాతావరణం తగ్గింది. కానీ ఇటీవల రాజకీయ పరిణామాలు బూతు పాలిటిక్స్ దిశగా వెళుతున్నాయి. అదీ మళ్లీ వైసీపీ నేతలే ఇలా నోటికి అదుపు లేకుండా మాట్లాడటం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును వైసీపీ నేతలు అప్పుడే మర్చిపోయారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి.
రోజాకు బొలిశెట్టి కౌంటర్
రోజా వ్యాఖ్యలకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మిగిలిన టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. "మనం సైలెంట్‌గా ఉంటే ఈ రఫ్పా రఫ్పా గాళ్లంతా రోడ్లెక్కి మాట్లాడుతుంటే మనమంతా ఎక్కడ ఉన్నామో అర్ధం కావడం లేదు. ఎమ్మెల్యే నా కొడుకులట.. రోజా మాట్లాడుతుంది.. ఆమె అసలు ఆడదో, మగదో ఎవడికీ తెలియదు. ఎమ్మెల్యే నా కొడుకులంటే జగన్ కూడా దాని కొడుకేనా?. ఎమ్మెల్యే అంటే జగన్, చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలే కదా. నా వయసెంత రోజా వయసెంత.. ఇలాంటి దురదృష్టకరమైన బూతులు" అంటూ బొలిశెట్టి కూడా అదే స్థాయిలో రోజాకు సమాధానం ఇచ్చారు.కొంతమంది కాపుల్ని ఉసిగొలిపి వాళ్లతోనే స్టేట్‌మెంట్స్ ఇప్పిస్తున్నారని, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి పనికిమాలినోళ్లంతా వచ్చి దమ్ముంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు అని బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు.కొంతకాలం పాటు సైలెంట్ గా వున్న రోజా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి అసభ్య వ్యాఖ్యల దుమారం వేడి ఇంకా చల్లారలేదు. నల్లపురెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిపై కొందరు దాడి చేశారు కూడా.. నల్లపు రెడ్డి తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పుపట్టారు. మిగిలిన టీడీపీ నేతలూ విరుచుకు పడ్డారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తే చూస్తూ సహించేది లేదని ఘాటుగానే హెచ్చరించారు. నల్లపురెడ్డిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సమయంలో ఇప్పుడు రోజా చేసిన వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయి. వైసీపీ వర్సెస్ ,టీడీపీగా వున్న రాజకీయం కాస్తా వైసీపీ వర్సెస్ జనసేనగా మారుతుందా అన్న అనుమానాలు కల్గుతున్నాయి.మళ్లీ 'బీప్' రాజకీయం షురూ....