మార్గదర్శి కేసులో చంద్రబాబుకు సహకరించిన రేవంత్ ప్రభుత్వం

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసును ఇపుడు విచారించటం వల్ల సమయం వృథా తప్ప ఏమీ ఉపయోగం ఉండదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు;

Update: 2025-03-01 07:16 GMT

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసును ఇపుడు విచారించటం వల్ల సమయం వృథా తప్ప ఏమీ ఉపయోగం ఉండదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. మార్గదర్శి(Margadarsi) కేసు విచారణ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఏపీ ప్రభుత్వ లాయర్ వినిపించిన వాదనకు తెలంగాణ ప్రభుత్వం లాయర్ కూడా మద్దతుగా వాదన వినిపించారు. అంటే రెండు ప్రభుత్వాలు కూడా మార్గదర్శి కేసు విచారణను హైకోర్టు కొట్టేయాలన్నట్లుగానే వాదనలు వినిపించాయి. ఒకపుడు మార్గదర్శి చిట్ ఫండ్ కేసు దేశంలోనే సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. 2006లో మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా రామోజీరావు రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలను మోసం చేస్తున్నారని, చిట్ ఫండ్ వ్యాపారం చట్టవిరుద్ధమైనదని మాజీ ఉంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసువేశారు.

సంవత్సరాల పాటు కొనసాగిన విచారణలో ప్రజలనుండి మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధులు సేకరించటం తప్పేనని తేలింది. ప్రజల నుండి సేకరించిన డబ్బును తిరిగి చెల్లించేయాలని కోర్టు రామోజీరావును ఆదేశించింది. భవిష్యత్తులో మళ్ళీ ప్రజల నుండి చిట్ ఫండ్స్ పేరుతో డబ్బులు వసూలు చేయద్దని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జనాల నుండి వసూలుచేసిన డబ్బునంతా రామోజీరావు తిరిగి చెల్లించేశారు. తర్వాత ఇదే విషయాన్ని కోర్టుకు రామోజీ అఫిడవిట్ రూపంలో చెప్పారు. అయితే తర్వాత కూడా ప్రజల నుండి రామోజీ డబ్బులు వసూలు చేస్తునే ఉన్నట్లు ఉండవల్లి ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగంలేకపోయింది.

ఒకవైపు కేసు విచారణలో ఉండగానే రామోజీరావు మరణించారు. హిందు అవిభాజ్య కుటుంబం కర్త, మార్గదర్శి ఛైర్మన్ రామోజీ మరణించారు కాబట్టి ఇక కేసును విచారించటంలో అర్ధంలేదని ఏపీ ప్రభుత్వ లాయర్ వాదించారు. ఏపీ ప్రభుత్వ లాయర్ వాదనకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్ కూడా కేసును క్లోజ్ చేయాలని స్పష్టంగా వాదించారు. అయితే ఇద్దరి లాయర్ల వాదనకు వ్యతిరేకంగా ఆర్బీఐ లాయర్, ఉండవల్లి వాదనలు వినిపించారు. ఆర్బీఐ తరపు లాయర్ ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ రామోజీరావు మరణించినా కేసును విచారించాల్సిందే అన్నారు. రామోజీ తప్పుచేసినట్లు తేలితే సెక్షన్ 58(బీ) ప్రకారం మార్గదర్శి ఛైర్మన్ శిక్షను ఎదుర్కోవాల్సుంటుందని స్పష్టంగా చెప్పారు. ఉండవల్లి వాదనలు వినేందుకు కేసు విచారణను మార్చి 7వ తేదీకి కోర్టు వాయిదావేసింది.

మర్గదర్శి తప్పుచేసిందా, రామోజీ శిక్షార్హుడేనా, చనిపోయారు కాబట్టి మార్గదర్శి కేసును మూసేయాల్సిందేనా అన్నది పూర్తిగా సాంకేతికమైన అంశాలు. రామోజీ బతికుండగానే మార్గదర్శి ద్వారా చట్టాలను ఉల్లంఘించారని, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని తేలిపోయిందని ఉండవల్లి చాలాసార్లు మీడియా ముందే చెప్పారు. మార్గదర్శి తప్పుచేసింది అనటానికి ఏకైక ఉదాహరణ చందాదారులకు డబ్బులను రామోజీ తిరిగి వాపసు ఇచ్చేయటమే అని కూడా ఉండవల్లి(Undavalli Arunkumar) గుర్తుచేశారు. కాకపోతే మార్గదర్శి తరపు లాయర్లు గట్టివాళ్ళు కాబట్టి సంవత్సరాలుగా కేసును ఎటూ తేలనీయకుండా లాగుతున్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఉండవల్లి పిటీషన్ కు మద్దతుగా 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) ప్రభుత్వం ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం పిటీషన్ వేయటంతోనే ఉండవల్లి వాదనకు మద్దతుగా నిలిచినట్లయ్యింది. అదే సమయంలో మార్గదర్శి మీద సీఐడీ కేసులు నమోదుచేసి రామోజీరావుతో పాటు కోడలు, సంస్ధ ఎండీ శైలజను కూడా విచారించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో రామోజీ ఆర్ధిక నేరానికి పాల్పడ్డారని చెప్పేందుకు అన్నీ ఆధారాలున్నట్లు సీఐడీ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలుచేసింది. అయితే అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మార్గదర్శి కేసులో అనుకూలంగా కాని వ్యతిరేకంగా కాని ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు.

సీన్ కట్ చేస్తే 2024లో జగన్ ఓడిపోయి చంద్రబాబునాయుడు(Chandrababu) ముఖ్యమంత్రయ్యారు. అప్పటినుండి హైకోర్టులో మార్గదర్శి కేసు ఎప్పుడు విచారణకు వచ్చినా ఏపీ ప్రభుత్వం రామోజీకి సానుకూలంగానే వ్యవహరించింది. చివరకు మార్గదర్శిలో ఆర్ధిక నేరాలు జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని సీఐడీ ఈమధ్యనే మరో అఫిడవిట్ దాఖలు చేయటంతో అందరు ఆశ్చర్యపోయారు. జగన్ సీఎంగా ఉన్నపుడేమో రామోజీ ఆర్ధికనేరాలకు సాక్ష్యాలున్నట్లు చెప్పిన సీఐడీ చంద్రబాబు సీఎం కాగానే ఆర్ధిక నేరాలకు సాక్ష్యాలు లేవని చెప్పటం విచిత్రమే. ఇదేసమయంలో రామోజీ ఆర్ధికనేరాలకు పాల్పడ్డారనేందుకు ఆధారాలున్నట్లుగా ఆర్బీఐ అఫిడవిట్లు దాఖలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుండి కోట్లాదిరూపాయలు డిపాజిట్లుగా సేకరించినట్లు తేల్చిచెప్పింది. ఆర్ధిక నేరాలకు పాల్పడిన రామోజీ ఆర్బీఐ సెక్షన్ 58బీ(సీ) ప్రకారం అత్యంత శిక్షార్హుడని గట్టిగా చెప్పింది.

ఈ కేసులో కీలకమైన పాయింట్ ఏమిటంటే రామోజీని లేదా ఆయన వారసులను రక్షించుకోవటం చంద్రబాబుకు అత్యంత అవసరం. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను రామోజీ మీడియా దశాబ్దాలుగా రక్షిస్తోంది. ఇపుడు రామోజీ లేకపోయినా ఆయన కొడుకు లేదా కోడలు మార్గదర్శి సంస్ధను నడుపుతున్నారు కాబట్టి అండదండలు అందించటం చంద్రబాబుకు అత్యవసరం. అందుకనే రామోజీ ఆర్ధికనేరాలకు పాల్పడినట్లుగా ఎలాంటి సాక్ష్యాలు లేవని సీఐడీతో కోర్టులో అఫిడవిట్లు దాఖలుచేయించారు. ఇపుడు కేసు విచారణ చివరదశకు చేరుకోవటంతో ఏకంగా ప్రభుత్వమే మార్గదర్శికి అనుకూలంగా కేసును క్లోజ్ చేయాలని చెప్పేసింది. చంద్రబాబుకు అంటే మార్గదర్శికి అనుకూలంగా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరాలు చాలాఉన్నాయి. మరి రేవంత్(Revanth) ప్రభుత్వానికి మార్గదర్శిని రక్షించాల్సినంత అవసరం ఏముంది ?

డైరెక్టుగా మర్గదర్శిని రక్షించాల్సిన అవసరం రేవంత్ కు లేదు. అయితే చంద్రబాబు కోసమనే మార్గదర్శికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతోంది. మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నంతమాత్రాన సరిపోదు. తెలంగాణ ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంటేనే కేసు నీరుగార్చచ్చు. అందుకనే చంద్రబాబు కోసమనే మార్గదర్శి కేసు విచారణవల్ల సమయం వృధాతప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని లాయర్ ద్వారా రేవంత్ ప్రభుత్వం వాదనలు వినిపించింది. కేసును డ్రాప్ చేయాలని లాయర్ తో వాదనలు వినిపించటంతోనే చంద్రబాబుకు రేవంత్ గురుధక్షిణ చెల్లించుకున్నట్లయ్యిందనే చర్చలు పెరిగిపోతున్నాయి.

అయితే ఇక్కడ మరో కీలకపాయింట్ ఉంది. అదేమిటంటే రెండు ప్రభుత్వాలు కోర్టులో కేసును కంటిన్యు చేయటంలో ఎలాంటి ఉపయోగాలు లేవని వాదనలు వినిపించినా ఆర్బీఐ(RBI) లాయర్, ఉండవల్లి అరుణ్ కుమార్ సంగతేమిటి ? ఆర్బీఐ లాయర్, ఉండవల్లి మార్గదర్శి కర్తగా ఉన్న రామోజీ మరణించినా ఇపుడు కర్తగా ఉన్న కొడుకు కిరణ్ బాధ్యత వహించాల్సిందే అని గట్టిగా వాదిస్తున్నారు. మరి చివరకు హైకోర్టులో ఎవరి వాదనలు నిలబడతాయో చూడాల్సిందే. చంద్రబాబు కోసమనే రేవంత్ ప్రభుత్వం కేసును నీరుగార్చేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకున్నది వాస్తవం.

Tags:    

Similar News