బీఆర్ఎస్ కు రేవంత్ మరో షాక్

రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు మరోసారి పెద్ద షాకిచ్చారు. ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డిని శాసనమండలిలో విప్ గా నియమించారు.

Update: 2024-10-04 10:29 GMT

రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు మరోసారి పెద్ద షాకిచ్చారు. ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డిని శాసనమండలిలో విప్ గా నియమించారు. రంగారెడ్డి జిల్లా స్ధానిక సంస్ధల కోటాలో పట్నం ఎంఎల్సీగా గెలిచారు. పట్నంను శాసనమండలిలో విప్ గా నియమిస్తే బీఆర్ఎస్ కు ఎలా షాక్ అని ఆలోచిస్తున్నారా ? ఎందుకు షాక్ అంటే పట్నం ఎంఎల్సీగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ తరపున. 2019 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున రంగారెడ్డి జిల్లా స్ధానిక సంస్ధల కోటాలో పోటీచేసి గెలిచారు. ఈయన పదవీకాలం మరో ఏడాది ఉంది. ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పట్నం భార్య పట్నం సునీతారెడ్డి పోటీచేసి ఓడిపోయారు. ఎంపీగా భార్యకు టికెట్ ఇప్పించుకోవటం కోసం పట్నం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.

తాజాగా పట్నంను రేవంత్ రెడ్డి మండలిలో విప్ గా నియమించటం వివాదంగా మారింది. వివాదం ఎందుకంటే ఇప్పటికే మరో ఫిరయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని రేవంత్ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి(పీఏసీ)ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. రేవంత్ ప్రభుత్వం గాంధీని పీఏసీ ఛైర్మన్ చేయటంతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కొద్దిరోజుల క్రితం ఎంతటి గోలచేశారో అందరూ చూసిందే. పీఏసీ ఛైర్మన్ పదవిలో ప్రభుత్వం మామూలుగా అయితే ప్రతిపక్షం ఎంఎల్ఏని నియమిస్తుంది. తన నియామకంపై గాంధి మాట్లాడుతు తాను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎంఎల్ఏని కాబట్టే పీఏసీ ఛైర్మన్ గా నియమించినట్లు ప్రకటించారు. దాంతో కారుపార్టీ ఎంఎల్ఏలకి మండిపోయింది. దాని తర్వాతనే బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ఫిరాయింపు ఎంఎల్ఏని టార్గెట్ చేస్తు నానా గోలచేశారు. అయితే గాంధీ చెప్పింది ఒక విధంగా నిజమనే చెప్పాలి. ఎలాగంటే అసెంబ్లీ రికార్డుల ప్రకారం సాంకేతికంగా గాంధీ బీఆర్ఎస్ ఎంఎల్ఏనే. అయితే అంటకాగుతున్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే. ఇదే పద్దతిని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ కూడా ప్రాక్టీస్ లో పెట్టారు. కాంగ్రెస్, టీడీపీ తరపున 2014-23 మధ్య గెలిచిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో చాలామందిని బీఆర్ఎస్ లోకి లాక్కున్న విషయం తెలిసిందే.

అప్పట్లో కేసీఆర్ ఆచరించిన పద్దతినే ఇపుడు రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు. పీఏసీ ఛైర్మన్ గా గాంధీ నియామకం గొడవలే పూర్తిగా చల్లారలేదు. అలాంటిది ఇపుడు మరో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్సీ పట్నంను శాసనమండలిలో విప్ గా నియమించటం అంటే ఒకవైపు బీఆర్ఎస్ ను రెచ్చగొడుతున్నట్లే మరో వైపు షాకిచ్చినట్లే ఉంది. మరి తాజా నియామకంపై బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News