రేవంత్ మాస్టర్ స్ట్రోక్

తాను ప్రకటించినట్లుగానే రేవంత్ ప్రభుత్వం సోమవారం నాడు రు. 2,423 కోట్లను విడుదలచేసింది.

Update: 2024-05-07 06:21 GMT

లోక్ సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. వ్యూహాత్మకంగా రైతుభరోసా(రైతుబంధు) పథకంలో నిధులు విడుదలచేశారు. రైతులకు పెట్టుబడిసాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసా పథకంలో రైతులందరికీ నిధులు అందలేదు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఎకరాలలోపు విస్తీర్ణం ఉన్న రైతులకు మాత్రమే నిధులు అందాయి. 5 ఎకరాలకు పైన విస్తీర్ణం ఉన్న రైతులకు పథకం అందలేదు. ఈ విషయమై ప్రతిరోజు బీఆర్ఎస్ నేతలు కేటీయార్, హరీష్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈనెల 9వ తేదీలోగా రైతులందరికీ రైతుబంధు పథకం అందుతుందని రేవంత్ ఈమధ్యనే ప్రకటించారు.

తాను ప్రకటించినట్లుగానే రేవంత్ ప్రభుత్వం సోమవారం నాడు రు. 2,423 కోట్లను విడుదలచేసింది. కేసీయార్ ప్రభుత్వం అమలుచేసిన రైతుభరోసా అన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పథకం అన్నా ఒకటే. రెండు పథకాల ఉద్దేశ్యం రైతులకు పెట్టుబడిసాయం అందించటమే. పధకాలకు పేర్లుమాత్రమే వేర్వేరు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడగానే 5 ఎకరాలకు లోపున్న రైతులకు పథకంలో నిధులందాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు 5 నుండి 7 ఎకరాల్లోపు విస్తార్ణమున్న రైతులకు పెట్టుబడిసాయం కింద 2,423 కోట్ల రూపాయలను ట్రెజరీలకు విడుదలచేసింది. మరో రెండురోజుల్లో 7 ఎకరాల నుండి 10 ఎకరాల్లోపుండే రైతులకు కూడా పెట్టుబడిసాయం అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

తాజాగా విడుదలచేసిన నిధులతో ప్రభుత్వం అంచనా ప్రకారం సుమారు 39 లక్షల మంది రైతులకు లబ్దిచేకూర్చినట్లయ్యింది. 68.99 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలుండగా ధరణి లెక్కల ప్రకారం 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముంది. గతంలోనే 5 ఎకరాల్లోపున్న రైతులకు రేవంత్ ప్రభుత్వం రు. 5,202 కోట్లు విడుదలచేసింది. తాజాగా విడుదలచేసిన నిధులతో కలుపుకుని రు. 7,625 కోట్లు చెల్లించినట్లయ్యింది. ఇపుడు ఎకరాకు పంటభరోసాగా రు. 5 వేలు చెల్లించిన ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి రు. 7500 చెల్లించబోతోంది. మొత్తానికి ప్రభుత్వం తాజాగా విడుదలచేసిన నిధులతో ప్రతిపక్షాలను మాస్టర్ స్ట్రోక్ కొట్టినట్లుగానే అనుకోవాలి.

ఎందుకంటే ఎన్నికలు 13వ తేదీ ఉండగా 7వ తేదీన లక్షలమందికి రైతుబంధు నిధులు విడుదలవ్వటం అంటే మామూలు విషయంకాదు. పైగా మిగిలిపోయిన రైతులకు 9వ తేదీన మూడోవిడత నిదులు జమవ్వబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర ప్రత్యేకంగా అనుమతి కూడా తీసుకుంది. ఒకేసారి లక్షలమంది రైతులకు లబ్దిఅందేట్లుగా నిధులు విడుదలచేయటం అంటే ఇందులో రేవంత్ వ్యూహం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ధరణి పోర్టల్ ద్వారా లక్షలాదిమంది రైతులు బాగా ఇబ్బందులు పడ్డారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. దాంతో భూ వివాదాలు పెరిగిపోయి రైతుబంధు కూడా సక్రమంగా అందని రైతుల సంఖ్య ఎక్కువగానే ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల దగ్గరున్న పట్టాదారు పుస్తకాల ఆధారంగా రైతు సమస్యలను పరిష్కరిస్తోంది.

పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే ఇపుడు రైతుభరోసా(రైతుబంధు) కింద నిధులను విడుదలచేసింది. పోలింగ్ ముందు తమ ఖాతాల్లో జమైన నిధులతో మెజారిటి రైతులు కచ్చితంగా తమకే ఓట్లేస్తారని కాంగ్రెస్ నేతలు చాలా ఆశతో ఉన్నారు. వీళ్ళ ఆశలు నిజమే అయితే ప్రతిపక్షాలకు చాలా ఇబ్బందనే చెప్పాలి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని చెరకు రైతులకు బకాయిలు తీర్చేయటం, వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న చేనేతల బకాయిలు తీర్చటానికి మొదటి విడతగా రేవంత్ ప్రభుత్వం రు. 50 కోట్లు విడుదలచేయటం అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన బకాయిలను తీర్చేస్తే రైతులు, చేనేతకార్మికుల కుటుంబాలు తమకు ఓట్లేయటం గ్యారెంటీ అని రేవంత్ బలంగా నమ్ముతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News